అమర్‌నాథ్ యాత్ర ఎంత పవిత్రమైనదిగా భావిస్తారో అంతకు మించిన క్లిష్టతతో కూడుకున్న ప్రయాణం ఇది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. హిమాలయాల్లో సముద్రమట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తున, చుట్టూ ఆవరించిన మంచు పర్వతాల మధ్య నెలకొన్న గుహాలయం ఇది. దాదాపు నలభై మీటర్ల ఎత్తులో ఉండే గుహలో హిమరూపంలో పరమశివుడు దర్శనమిస్తాడు. ఏడాదిలో కొంతకాలం తప్ప మిగిలిన మాసాల్లో ఈ ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పి ఉంటుంది. ఆ ప్రాంతంలో మే నుంచి ప్రారంభమయ్యే వేసవి కాలంలో మాత్రమే అక్కడికి చేరుకోగలరు. వాతావరణం అనుకూలిస్తే తప్ప ఈ యాత్రకు అనుమతించరు. అమర్‌నాథ్ యాత్ర చేస్తున్నవారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలివి.
యాత్రకు మీరు అనుమతి పొందినట్టు ధ్రువీకరించే రిజిస్ట్రేషన్ కార్డు తీసుకువెళ్ళడం మరచిపోవద్దు. ఈ కార్డు లేకపోతే యాత్రకు అనుమతించరు. అలాగే మీ ఐడి ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు, చిరునామా, యాత్రలో మీతోపాటు పాల్గొంటున్న వారి వివరాలు, మీ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కాగితం లేదా చిన్న పుస్తకంలో రాసి మీతో పాటు ఉంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నప్పుడు వాటి అవసరం ఉండొచ్చు.
13 ఏళ్ల లోపు బాలబాలికలనూ, 75 ఏళ్లు దాటిన వారినీ ఈ యాత్రకు అనుమతించరు. యాత్రకు వెళ్లే భక్తులు పూర్తి స్థాయి రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే గుండె సంబంధిత ఈసీజీ, 2డి-ఎకో తదితర పరీక్షలను వయసును బట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాపీలను యాత్ర సమయంలో దగ్గర ఉంచుకోవాలి.
ఇది ప్రమాదకరమైన యాత్ర. కాబట్టి బీమా తీసుకోండి. సుమారు మూడు లక్షల రూపాయల వరకూ గ్రూప్ ఇన్స్యూరెన్స్‌ను అమర్‌నాథ్ యాత్ర బోర్డు అందిస్తోంది.
తగినంత నగదు: దారిలో ఆహారం, అవసరమైన పరికరాలు కొనుక్కోవడానికీ, బస చేయడానికీ అవసరమైన నగదు తీసుకువెళ్ళండి.
ఆహారం: బిస్కట్లు, మిల్క్ పౌడర్, చక్కెర, డ్రైఫ్రూట్స్, గ్లూకోజ్, ఇతర తినుబండారాలూ మీతో పాటు తీసుకువెళ్ళండి. సీసాతో నీళ్ళు, గ్లాసు, స్పూన్లు, ఒక ప్లేట్ మీ కిట్‌లో చేర్చుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. మార్గమధ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సరుకుల దుకాణాలు, ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే రెస్టారెంట్లు, టీ దుకాణాలు ఉంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా ఆహారాన్నీ, దారిపొడుగునా మంచి నీటినీ అందిస్తున్నాయి. ఖాళీ కడుపుతో ప్రయాణం చెయ్యకూడదు. దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
యాత్రికుల కోసం వివిధ సంస్థలు హెలికాఫ్టర్ సేవలు అందిస్తున్నాయి. నీల్‌గ్రాత్ (బల్తాల్) నుంచి పంచ్‌తరణి వరకూ ఒక వైపు ప్రయాణానికి రూ. 1,600, పహల్గామ్ నుంచి పంచ్‌తరణి వరకూ ఒకవైపు ప్రయాణానికి రూ. 2,751 ఛార్జీలుగా నిర్ణయించారు.(2018)
జమ్మూ-కాశ్మీర్‌లో, యాత్ర జరిగే ప్రాంతంలో ఇతర రాష్ట్రాల ప్రీపెయిడ్ సిమ్ కార్డులు పని చెయ్యవు. భక్తులు తమ బృందంలో ఒక్కరికైనా పోస్ట్ పెయిడ్ ఫోన్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎ్‌సఎన్‌ఎల్ వారి కనెక్షన్ ఉన్న ఫోన్‌ను వెంట ఉంచుకోవడం ఉత్తమం. లేదంటే బల్టాల్, నున్వాన్ బేస్ క్యాంప్‌ల వద్ద ప్రీయాక్టివేటెడ్ సిమ్ కార్డుల్ని కొనుక్కోవచ్చు.
ఏ సేవకు ఎంత మొత్తంలో చెల్లించాలో అమర్‌నాథ్ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ వివరాలతో బోర్డులు ఉంటాయి. ఆ మేరకు మాత్రమే చెల్లించండి.
వేసలైన్, కోల్డ్ క్రీమ్, మోశ్చరైజర్, లిప్ బామ్, సర్జికల్ కాటన్, నొప్పి నివారణ మాత్రలు, స్ర్పేలు, చిన్న చిన్న గాయాలు, ఆరోగ్య ఇబ్బందులకు అత్యవసరంగా ఉపయోగపడే మందులతో ఫస్ట్‌ఎయిడ్ బాక్స్ మీతో ఉంటే మంచిది. కర్పూరం కూడా తీసుకువెళ్ళండి. శ్వాసకోశ సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని వాసన చూస్తే ఉపశమనం కలుగుతుంది.
దారి మిట్టపల్లాలుగా ఉంటుంది. సుమారు మూడు కిలోమీటర్లకు పైగా మంచు మీద నడవాల్సి ఉంటుంది. కనుక ఊత కోసం పొడవైన కర్ర లేదా వాకింగ్ స్టిక్ తీసుకు వెళ్ళండి. టార్చిలైట్ కూడా దగ్గర ఉంచుకోండి.
అమర్‌నాథ్ మంచు ప్రదేశం. చలి ఎముకలు కొరికేస్తూ ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచడంతోపాటు వెచ్చదనాన్ని అందించే దుస్తులు ఈ యాత్రకు తప్పనిసరి. కాబట్టి ఊలుతో చేసిన స్వెట్టర్లు, ఫ్యాంట్లు, మంకీ క్యాప్‌లు, చేతి తొడుగులు ధరించండి. బయటి నుంచి గాలి శరీరాన్ని తాకకుండా జాగ్రత్త పడండి. రైన్ కోట్, స్లీపింగ్ బ్యాగ్, చలిని బాగా తట్టుకోగలిగే రగ్గులు, గొడుగు తీసుకువెళ్ళండి. సాధారణమైన చెప్పులు, షూస్ వేసుకోకండి. మంచులో నడవాల్సి ఉంటుంది కనుక వాటర్ ప్రూఫ్ బూట్లు ధరించండి. స్లిప్పర్లతో, కాళ్ళకు ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా నడవకూడదు. చెవుల్లోకి చలి గాలి వెళ్ళకుండా దూది పెట్టుకుంటే మేలు.
మహిళలు చీరలు ధరించకపోవడం మంచిది. ఫ్యాంట్లు బెస్ట్. లేదంటే సల్వార్ సూట్లు వేసుకోవచ్చు. ధోవతీల్లాంటివి వద్దు.
యాత్ర జరిగే సమయంలో జమ్మూ-కాశ్మీర్ పర్యాటకాభివృద్ధి సంస్థ దారి పొడుగునా గుడారాలు ఏర్పాటు చేస్తుంది. వీటిలో వివిధ సౌకర్యాలుంటాయి. ప్రైవేటు వసతి కూడా అందుబాటులో ఉంటుంది. బేస్ క్యాంపుల వద్ద వీటిని బుక్ చేసుకొవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
డోమెల్, చందన్‌వారీల వద్ద ప్రవేశ ద్వారాలు సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ తెరుస్తారు. ఆ సమయానికల్లా గేట్ దగ్గరకు యాత్రికులు చేరుకోవాలి. గేట్లు మూసిన తరువాత యాత్రికులు ప్రయాణానికి అనుమతించరు. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత పంచ్‌తరణి క్యాంప్ నుంచి గుహాలయం వైపు ప్రయాణించకండి. సాయంత్రం 6 గంటల తరువాత దర్శనానికి అనుమతించరు.
రాత్రిపూట గుహల దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదు. ఆక్సిజన్ బాగా తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి చీకటి పడకముందే వెనక్కి బయలుదేరడం మంచిది.
తొందరగా వెళ్తామన్న ఆలోచనతో ఇతరుల్ని ఓవర్‌టెక్ చెయ్యడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం లాంటివి చేయకూడదు. మీరు ప్రయాణించేది ప్రమాదకరమైన మార్గం. రెప్పపాటు పొరపాటు జరిగినా ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో ప్రయాణం చేయాలి.
అమరనాథ్ ఆలయ బోర్డు గుర్రాలు, డోలీల నిర్వాహకులకు లైసెన్స్ కార్డులు ఇస్తుంది. అధికారికంగా నమోదైన వ్యక్తుల సేవలు మాత్రమే వినియోగించుకోండి. వారు మీతో పాటే వచ్చేలా చూసుకోండి. వారిని వదిలి దూరంగా వెళ్ళకండి. వారి పేరు, వివరాలు ఉన్న కార్డులు తీసుకోండి.
యాత్ర అధికారులు ఎప్పటికప్పుడు సూచనలూ, సలహాలూ ఇస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న వారిని అడిగి తెలుసుకోండి. యాత్ర సమయంలో అమరనాథ్ ఆలయ బోర్డు సిబ్బంది, పోలీసులు, పర్యాటక, ఆరోగ్య శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సందేహాలున్నా వాళ్ళను అడిగి తెలుసుకోండి.
డిస్పోజబుల్ ప్లాస్టిక్ కప్పులూ, ప్లేట్లను వినియోగించకండి. పాలిథిన్ వాడకం జమ్మూ-కాశ్మీర్‌లో నిషేధం. చెత్తను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే పడేయండి.