header

Brahma Temple/ పుష్కర్ పుణ్యక్షేత్రం - అజ్మీర్

Brahma Temple/ పుష్కర్ పుణ్యక్షేత్రం - అజ్మీర్

రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్. క్రమంగా ఆ ప్రాంతం ఈ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది.
ఈ సరస్సు చెంతనే ఉంది సృష్టికర్త బ్రహ్మ ఆలయం. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇది. మన దేశంలోని అతి ముఖ్యమైన తీర్థాల్లో ఒకటైన పుష్కర్ను దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి కానట్టేనని పెద్దలంటారు. అందుకే దీన్ని తీర్థరాజ్ అంటారు. పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన మహాభారత, రామాయణాల్లోనూ ఆదితీర్థంగా ప్రస్తావించబడింది ఈ తీర్థం. కార్తీక పౌర్ణమి రోజున ఇందులో ఓసారి మునిగితే వందల సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుందట.
స్థలపురాణం
పద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో ఆ తామరపూపు నుంచి రేకులు మూడు చోట్ల రాలి, మూడు సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ట పుష్కర్, మధ్యపుష్కర్, కనిష్టపుష్కర్ అని పిలుస్తున్నారు. పైగా సృష్టికర్త తాను భూలోకంలో అడుగినప్పుడు తన చేతి (కరం)నుంచి పుష్పం రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అని పేరు పెట్టినట్లు మరో కథనం కూడా వినిపిస్తుంది.
సరస్వతీదేవి శాపం.. ఏకైక ఆలయం
వజ్రనాభ సంహారం అనంతరం లోకకల్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించాడట సృష్టికర్త. సుముహూర్తం ఆసన్నమవుతుండటంతో సరస్వతీదేవిని తీసుకుని రమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ. కానీ నారదుడి కలహప్రియత్వం కారణంగా బయలుదేరేందుకు తాత్సారం చేస్తుంది సరస్వతీ దేవి. ఇవతల ముహూర్తం మించిపోతుండటంతో, అనుకున్న సమయానికే యజ్ఞం పూర్తి కావాలన్న తలంపుతో ఇంద్రుడి సహకారంతో గాయత్రిని పెళ్లాడి నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని ప్రారంభించారు.
యజ్ఞం సమాప్తం అవుతుండగా అక్కడికి చేరుకున్న సరస్వతీదేవి బ్రహ్మ దేవుడి పక్కన మరో స్త్రీని చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న దేవతలందరినీ శపిస్తుంది. భర్తను వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక్క పుష్కర్లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అనంతరం బ్రహ్మదేవుడి అభ్యర్థనను మన్నించి శాప తీవ్రతను తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండటానికి కారణం ఇదేనంటారు. పుష్కర్లో సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్య సుమంగళి వరాన్నిస్తుందన్న నమ్మకంతో పుష్కర్ను సందర్శించిన భక్తులంతా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.
ఇతర విశేషాలు
పుష్కర్లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు 400 పురాతన ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆప్తేశ్వర్, రంగ్జీ, ఏకలింగజీ దేవాలయాలు. వీటిలో రంగ్జీ ఆలయం దక్షిణాది శైలిలో కట్టబడి ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్జీగా పూజలందుకుంటున్నాడు. రాజస్థాన్లోని సుప్రసిద్ధ శివక్షేత్రం ఏకలింగజీ దేవాలయం. ఇక్కడ శివలింగం కేవలం లింగాకారంగా కాక నలుపక్కలా నాలుగు ముఖాలను కలిగి ఉండటం విశేషం. ఇవి కాక గోవిందాజీ ఆలయం, నక్షత్రశాల, హవామహల్, చట్రిస్, గాలోటా, ఖవాసాహిబ్ దర్గా, అధాన్ దిన్ కా జూన్ ప్రా, అనాసాగర్, జగ్నివాస్ భవనం, జగదీష్ ఆలయం, అహర్, నక్కి సరస్సు, జోథ్పూర్ పట్టణం, అజ్మీరు, ఉదయ్పూర్, అబూశిఖరం, పింక్సిటీగా పేరుగాంచిన జైపూర్లు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు.
ఎలా వెళ్లాలంటే..?
పుష్కర్కు వెళ్లడానికి దగ్గరలోని అజ్మీర్ రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. ఢిల్లీ, జోద్పూర్, జైపూర్, ఆగ్రా, ముంబాయ్. అహ్మదాబాద్ల నుంచి రైళ్లున్నాయి. శతాబ్ది ఎక్స్ప్రెస్ బెస్ట్. అజ్మీర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని పుష్కర్కు చేరుకోవాలంటే లోకల్ బస్సులు, ఆటోలు ఉన్నాయి. విమాన మార్గం సంగనీర్ ఏర్పోర్ట్. అయితే అక్కడినుంచి పుష్కర్ వెళ్లాలంటే 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అన్ని ప్రధాన నగరాలనుంచి పుష్కర్కు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.