header

చెన్నకేశవాలయం, బేలూరు / Chennakesavalayam, Beluru

చెన్నకేశవాలయం, బేలూరు / Chennakesavalayam, Beluru

chennakesavalayam, beluru అమరశిల్పి జక్కన్న....సృష్టికర్తనే మరపించేలా బేలూరు చెన్నకేశవాలయాన్ని తీర్చిదిద్దిన మహాశిల్పి...కర్నాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఉన్న ఈ ప్రఖ్యాత ఆలయం ప్రపంచ వారసత్య సంపదగా గుర్తించబడినది. ఈ శిల్పకళ జక్కన్న చే రూపుదిద్దుకున్నదే. బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు ఇతని కళావిజ్ఞతకు తార్కాణం
బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినది. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది.
ఈ ఆలయం హొయసల కాలమునకు చెందినది మరియు వివిధ డిజైన్లకు తార్కాణంగా ఉన్న 48 శిల్ప స్తంభాలను కలిగి ఉంటుంది.1117సంవత్సరంలో లో తాలక్కాడ్ యుద్ధ సమయంలో, ఈ మహానిర్మాణాన్ని చోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల విష్ణువర్ధనుడు కట్టించాడు. పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు, వివిధ రంగులలో చెక్కిన నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.
అంతేకాక ఆలయం వరండా లోపల అనేక ఇతర ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి.ఈ దేవాలయలోని అనేక శిల్పాలలో అనేక రకాలైన ఆభరణాలు,పైకప్పులు, జంతువులు, పక్షులు, ద్వారాలు మరియు అనేక రకాలైన ఇతర చిత్రాలను చూడవచ్చును . పర్యాటకులు ఆలయం యొక్క ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణిని (మెట్లబావి) కూడా చూడవచ్చు. విజయనగర సామ్రాజ్యం రోజులలో ఈ ఆలయం యొక్క రాజగోపురాలు నిర్మించబడ్డాయి. ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి
జక్కనాచారి
ఇతను కర్ణాటకలోని తుముకురు దగ్గర కైదల అనే గ్రామంలో జన్మించాడు. వివాహం చేసుకున్న త్వరలోనే శిల్పకళ మీద అభిమానంతో దేశాటన చేస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎన్నో దేవాలయాలు నిర్మించి శిల్పకళలో నిమగ్నమై భార్యను మరియు కుటుంబాన్ని కూడా మరిచిపోయాడు.
జక్కనాచారి ఇల్లువదలి పోయే సమయానికి అతని భార్య గర్భవతి.ఒక మగబిడ్డకు తల్లి అవుతుంది. కొడుకు పేరు ఢంకనాచారి. చిన్నప్పుడే శిల్పిగా తీర్చిదిద్దబడిన ఢంకన తండ్రిని వెదుకుతూ దేశాటనం చేస్తూ ఉంటాడు. బేలూరులో అతనికి శిల్పిగా పనిచేసే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో జక్కన్నచే చెక్కబడిన మూలవిరాట్టులో లోపం ఉన్నదని ఢంకన గుర్తిస్తాడు. ఆగ్రహం చెందిన జక్కన్న లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటానికి ప్రతిజ్ఞ చేస్తాడు. పరీక్షించిన తరువాత ఆ శిల్పంలోని లోపం నిజమైనదేనని నిరూపించబడుతుంది. మాట ప్రకారం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు. ఆ సమయంలోనే వీరిద్దరు తండ్రీకొడుకులని తెలుస్తుంది. ఢక్కన తండ్రిని మించిన తనయునిగా ప్రసిద్ధిపొందుతాడు.
ఎలా వెళ్లాలి ? కర్నాటకలోని హసన్ కు రైలు మరియు రోడ్ మార్గాలద్వారా వెళ్లవచ్చు. అక్కడనుండి బస్సుల ద్వారా బేలూరుకు వెళ్లవచ్చు. హుబ్లీ, బెంగుళూరు, మంగుళూరు నుండి రైలు ద్వారా హసన్ కు వెళ్లవచ్చు. దగ్గరలోని విమానాశ్రాయాలు బెంగుళూరు, మైసూరు.