Rameswaram…రామేశ్వరం … రామేశ్వరం తమిళనాడులోని రామేశ్వరం అనే దీవిలో ఉన్నది. సముద్రం మీదుగా నిర్మించిన పంబన్ అనే వంతెన మీదగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆలయం పొడవైన వసారా(నడవా) తో అలంకారంతో చూడచక్కగా నిర్మించబడింది. ఇక్కడ 36 తీర్థాలు కూడా కలవు.
స్థలపురాణాం : శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి లంకపై విజయం సాధించిన తరువాత తిరుగు ప్రయాణంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించదలచి హనుమంతుని కాశీనుండి శివలింగాన్ని తేవలసిందిగా కోరతాడు. హనుమంతుని రాక ఆలస్యమైనందున శ్రీరాముడు సీతాదేవిచే చేయబడిన ఇసుక లింగాన్ని ఇక్కడ ప్రతిష్టాడు. తరువాత హనుమంతునిచే తేబడిన శివలింగం (విశ్వనాధ శివలింగంగా పేరుపొందినది) కూడా ఇక్కడ ప్రతిష్టించబడుతుంది.
రామేశ్వరం 15 ఎకరాలలో చూడముచ్చటైన గోపురాలతో చుట్టూ ఆలయ ప్రాకారాలతో నిర్మించబడినది. ఎత్తైన వేదిక మీద నాలుగు వేల స్థంభాల మీద నిర్మించ బడిన వసారా ప్రపంచంలో అతి పొడవైన వసారాగా పేరుపొందినది. తూర్పున ఉన్న రాజగోపురం 126 అడుగుల ఎత్తున తొమ్మిది అంతస్థులతో నిర్మించబడినది. ఇక్కడ తొమ్మిది అడుగుల ఎత్తు 12 అడుగుల పొడవైన నందీశ్వరుని దర్శించవచ్చు.