ఘుశ్మేశ్వరము లింగము ఒకప్పుడు దేవగిరి అను ఊరునందు సుదర్ముడనే బ్రాహ్మాణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ. వీరికి సంతానము లేదు. ఒకనాడు వారి ఇంటికి ఒక యతి వచ్చాడు. ఆ యతీంద్రునికి అతిధి సత్కారము చేసి భిక్ష స్వీకరించమని కోరగా సంతానహీనుల ఇంట భిక్ష స్వీకరించరాదనే నియమం ఉందని తెలిపి వెళ్ళిపోయాడు.
భార్యా భర్తలు మిక్కిలి దుఖించి ...సుధర్ముని భార్య సుదేహ స్వామీ మన వంశము అంతరించకుండా మీరు నా చెల్లెలు ఘుశ్మను వివాహమాడవలసిందని కోరటంతో వారి విహాహం జరుగుతుంది. ఘుశ్మ మహప్రతివత. భర్తనే ప్రత్యక్ష దైవంగా సేవించే ఆమె మనస్సున శివుని క్షణక్షణము స్మరించేది. ఆమె గర్భవతియై ఒక బాలునికి జన్మనిస్తుంది. బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతుంటాడు.
ఆ బాలుని గాంచి తనకి సంతానము కలగలేదేనే బాధ సుదేహకు అధికమై అది ఆ బాలునిపై ద్వేషముగా మారింది. ఒకనాటి రాత్రి అందరూ నిదురించుచుండగా సుదేహ ఆ బాలుని భుజాన వేసుకొని ఊరి బయటకు వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పారేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి నిద్రపోయింది.
మర్నాడు యధాప్రకారం ఘుశ్మ నీటికై చెరువుకు వెళ్ళి, చెరువులో దిగి బిందె ముంచి నీళ్ళు తీసుకుంటున్న సమయంలో ఆ బాలుడు ఆమె కాళ్ళు పట్టుకుని అమ్మా అమ్మా అంటూ చెరువులో నుంచి బయటకు వస్తాడు. ఆమె కుమారుని ముద్దాడి ఇంట్టో ఉండవలసిన కుమారుడు ఈ చెరువులోనికి ఎలా వచ్చాడని సంశయించింది. ఆ బాలుడు ‘‘అమ్మా నాకు ఒక కల వచ్చింది. కలలో నేను మరణించి మరల బ్రతికినట్లు కనిపించింది’’ అని చెబుతాడు. ఆమె ఆశ్ఛర్యపోవుచుండగా శివుడు ప్రత్యక్షమై సాధ్వీ..నీ కుమారుడు చెప్పినదంతయూ నిజమే...సుదేహ ద్వేషముచేత నీ కుమారుని చంపి ఈ తటాకమున పారవేసినది. నీవు మహాసాధ్వివి నా భక్తురాలివైనందున నేను నీ కుమారునికి పునర్జన్మనిచ్చాను’’ అని పలికి నీ సోదరిని శిక్షించెదనని పలుకుతాడు. సుదేహ శివుని పాదములపై పడి స్వామి దుర్గుణముల చేత ప్రేరణ పొంది ఇట్టి అకృత్యములు జరుగుతాయి. మా అక్కగారిని క్షమించి మంచి బుద్ధిని ప్రసాదించమని వేడుకొనగా శివుడు సంసించి ఘశ్మా.. నీ ప్రవర్తనకు సంతసించి నేను ఇచ్చటనే జ్యోతిర్లింగ రూపమున ఘుశ్మేశ్వరునిగా వెలుస్తానని వరమిచ్చి జ్యోతిర్లింగంగా అవతరిస్తాడు. ఈ ఘుశ్మేశ్వరుని ఆరాధించువారికి పుత్రశోకము కలగదు.
ఎలా వెళ్ళాలి ? ఘుశ్మేశ్వరము మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు దగ్గరలో వేలూరు గ్రామమునందు కలదు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి వేలూరు గ్రామం 29 కి.మీ. దూరంలో ఉంటుంది. ఎల్లోరా గుహలు 1 కిలోమీటరు దూరంలో కలవు.
వసతి : ఇక్కడ వసతి సౌకర్యములు తక్కువ కాబట్టి ఔరంగాబాద్ పట్టణంలో బసచేయటం మంచిది.