header

Srisaila Mallikarjunudu....శ్రీశైల మల్లికార్జునుడు

srisailam

శ్రీశైల మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగములలో శ్రీశైలం రెండవది. ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల అడవులలో ఉంది.
స్థలపురాణం : పార్వతి పరమేశ్వరుల కుమారులు గణేశుడు, స్కందుడు రుద్రగణాధిపత్యంకై జరిగిన పోటీలో వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షణం చేసి గెలిచి గణాధిపత్యం దక్కించుకుంటాడు. స్కందుడు అలిగి కైలాసం వదలిపెట్టి శ్రీశైలం వచ్చి క్రౌంచపర్యతం మీద తన కాళ్ళకు మంత్రబద్ధంగా బంధనములు ఏర్పాటు చేసుకొని ఆసీనుడు అవుతాడు.
కుమారుని అలక తీర్చి కైలాసమునకు తీసుకురమ్మని శివపార్వతులు నారదుని పంపుతారు. నారదుడు వచ్చి ఎంత నచ్చ చెప్పినా స్కందుడు వినేలేదు. పార్వతీ దేవి పుత్రవాత్సల్యము చేత శ్రీశైలమునకు వచ్చి కుమారునకు నచ్చచెప్పినా వినలేదు. అప్పుడు పార్వతీ దేవి శ్రీశైలంలోని స్థిరనివాసం ఏర్పరుచుకొంటొంది. శివుడు కూడా ఆమెను అనుసరించి శ్రీశైలంలో జ్వోతిర్లింగ స్వరూపుడై వెలుస్తాడు.
నారదుడు, బ్రహ్మాది దేవతలు అచ్చటికి వచ్చి శివపార్వతులు, స్కందుని పూజిస్తారు. ఆ తరువాత వినాయకుడు కూడా శ్రీశైలానికి వచ్చి సాక్షిగణపతి పేరున వెలుస్తాడు.
కాలాంతరంలో శ్రీశైల ప్రాంతమును పరిపాలిస్తున్న చంద్రగుప్తుని దంపతులకు ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పసికందుగా ఉండగానే చంద్రగుప్తుడు యుద్ధానికి వెళతుడు. కాని యుద్ధం 16 సంవత్సరముల పాటు జరుగుతుంది. యుద్ధంలో విజయం సాధించిన తరువాత చంద్రగుప్తుడు తిరిగా తన రాజ్యనికి వస్తాడు. అప్పటికి అతని కుమార్తె 16 సం.ప్రాయంలో ఉంటుంది. చంద్రగుప్తుడు ఆమెను చూసి కామాంధుడై ఆమెను చెరపట్టబోతాడు. మహారాణి ఆమె మన కుమార్తె అని చెప్పినా మోహావేశుడై చంద్రగుప్తుడు వినకుండా ఆమెను వెంబడిస్తాడు.
చంద్రగుప్తుని బారినుండి తప్పించుకొనుటకు చంద్రావతి కొండమీద నుండి కృష్ణానది లోనికి దూకుతుంది. కృష్ణనది రెండుగా చీలుతుంది. ఆ దారిలోనుండి ఆమె నడుస్తుండగా చంద్రగుప్తుడు ఆమెను వదలకుండా వెబడిస్తాడు. చంద్రావతి తండ్రిని చూసి కామాంధుడవై వావివరుసలు గానకున్నావు, నీవు బండరాయివై పడివుండమని శపిస్తుంది. చంద్రగుప్తుడు పాతాళ గంగ యందు పచ్చటి బండరాయిగా మారిపోతాడు. అందువలనే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందంటారు.
చంద్రావతి శ్రీశైలమున జ్యోతిర్లింగముగా వెలసిన శివుని మల్లెపూలతో సేవింపసాగినది. ఒకనాడు శివుడు ఆమె భక్తికి సంతసించి దర్శనమిచ్చి వరం కోరుకొమ్మంటాడు. చంద్రావతి స్వామి ఈ మల్లెమాలను శాశ్వతముగా నీ కంఠసీమనందు అలంకరించుకొనుము మరియు నీ జటజూటమునందు మల్లెమాలను అర్థచంద్రాకారముగా నా స్వహస్తములతో అలంకరించు భాగ్యము ప్రసాదించుమని వేడుకొంటుంది. శివుడు అనుగ్రహించి కుమారీ నేటి నుంచి నేను మల్లికార్జుడను పేరున భక్తులను అనుగ్రహిస్తాను. ఈ మల్లెమాల నా శిరమునందు మూడువందల కోట్ల సంవత్సరము ఉంటుందని వరమిస్తాడు.
ఆ నాటి నుండి శ్రీశైలమునందున్న జ్యోతిర్లింగము మల్లికార్జున లింగంగా ప్రసిద్ధి చెందుతుంది. మల్లికార్జునుని ఆగస్త్య మహర్షి, వేదవ్యాసులవారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణస్వామి ద్వాపరమున పంచపాండవులు ద్రౌపతీ దేవితో సహా అర్చిస్తారు. అప్పటి నుండి శ్రీశైలం భక్తజనానికి ఆరాధ్యమై ప్రకాశిస్తుంది.
ఎలా వెళ్ళాలి ? శ్రీశైలానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్నిముఖ్య పట్టణాలనుండి బస్సులలో వెళ్లవచ్చు. హైదరాబాద్ నుండి 232 కి.మీ. దూరంలో మరియు విజయవాడ నుండి గుంటూరు, వినుకొండ, దోర్నాల మీదుగా 260 కి.మీ. దూరంలో ఉంటుంది.