Trayambakeswaram….త్రయంబకేశ్వరం : వనవాస కాలంలో శ్రీరామచంద్రుని మోహించిన రావణాసురుని చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులను లక్ష్మణుడు కోస్తాడు. ఈ ప్రాంతాన్నే నాశిక్ అంటారు. ఇక్కడకు దగ్గరలోనే బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఈ పర్వతం దగ్గర సప్తర్షులో ఒకరైన మహాముని గౌతముడు తన భార్య అహ్యలతో నివసించేవాడు. ఒకసారి ఈ ప్రాంతంలో కరువు వచ్చి మునులందరూ నీరు లభించక అనేక ఇబ్బందులు పాలయ్యారు. గౌతముడు తన తపశ్శక్తితో దేవతల అనుగ్రహంతో నీటి సౌకర్యాన్ని కల్పించి పంటలు పండిస్తాడు.
తోటి మునులు అసూయతో ఒక మాయాగోవును సృష్టించి గౌతముని పోలంలోనికి వదలుతారు. గౌతముడు పంటను పాడుచేస్తున్న ఆవును ఆదిలించటానికి ఒక దర్భను (గడ్డిపోచ) విసురుతాడు. దానితో ఆ మాయాగోవు మరణిస్తుంది. గౌతముడు గోహత్యా నివారణకై శివుని కొరకు ఘోర తపస్సు చేస్తాడు. గౌతముని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివభగవానుని ప్రార్థించి గోహత్య నివారణకై శివుని జటాజూటంలో ఉన్న గంగను భూమిపైకి వదలమని ప్రార్థిస్తాడు.శివుని జటాజూటం నుండి బ్రహ్మగిరిపై పడిన గంగ రెండు పాయలుగా విడిపోతుంది. మొదటి పాయ గౌతముని పేరుమీదుగా గౌతమి గాను ఇంకొక పాయ గోదావరి గాను ప్రసిద్ధి చెందినది. గౌతముని కోరిక మేరకు శివభగవానుడు ఈ ప్రాంతంలో త్రయంబకేశ్వరుడే అనే పేరుతో వెలిశాడు.
ఎలావెళ్లాలి : త్రయంబకేశ్వరం మహారాష్ట్రలోని నాశిక్‌లో ఉన్నది. హైదరాబాద్ నుండి రైలు మార్గంలో వెళ్ళవచ్చు. హైదరాబాద్ నుండి సుమారు 700 కి.మీ. దూరంలో ఉన్నది. షిర్డి సాయిదగ్గరకు వెళ్ళిన వారు అక్కడ నుండి 117 కి.మీ. దూరంలో ఉన్న త్రయంబకేశ్వరం వెళ్ళవచ్చు.