header

Kasi..కాశీ

కాశీ యాత్ర
varanasi, kasi కాశీ గురించి కల్పం మొదట్లో బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం పొందటానికి, తపస్సు చేసుకోవటానికి ప్రకృతి మొత్తం జలరాశితో నిండియున్న సమయంలో పరమశివుడు తన త్రిశూలాగ్రం మీద సృష్టించిన భూఖండమే కాశి. దీనిమీద కూర్చుని బ్రహ్మదేవుడు అనేక లోకాలను, నక్షత్రాలను, భూమిని సృష్టించాడంటారు. తరువాత దేవతలు, రుషులు విన్నపం మేరకు శివుడు తన త్రిశూలం మీద ఉన్న భూఖండాన్ని అలాగే భూమిమీదకు దించి నిలబెట్టాడు. అదే కాశీపట్టణమని వ్యాసుల వారు శివపురాణంలో వివరించారు. కాశీలో బ్రహ్మదేవునికి, యమునితో సహా దేవతలందరికీ ఇక్కడ ఎటువంటి ప్రభావం లేదని కేవలం ఈశ్వరునికి ఆయన పరివార దేవతలకు మాత్రమే ఇక్కడ ప్రభావం ఉంటుందని, బ్రహ్మదేవుని సృష్టి ప్రళయకాలంలో నశించినా కాశీనగరం మాత్రం చెక్కు చెదరదని పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులలో కూడా కాశీ ప్రస్తావన కలదు.
శివరాత్రి ముందు, శ్రావణమాసం, ఎండాకాలం, కార్తీక మాస సమయాలలో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు నెలల ముందే రిజర్వేషన్లు చేయించుకోవలసి వస్తుంది. మిగతా రోజులలో కొద్ది రోజుల ముందే రిజర్వేషన్ దొరకవచ్చు
పాంచభౌతిక దేహాలకు ఇహంలోనే పరమానందాన్ని, పరంలో మోక్షాన్ని ప్రసాదించే దివ్యధామం వారణాసి. ఇక్కడ నడిచే ప్రతి అడుగూ ఒక ప్రదక్షిణే! చూసే ప్రతి దృశ్యమూ శివతేజమే! సత్యయుగంలో మొదలైన పౌరాణిక నగరి ప్రాశస్త్యం.. కలియుగంలోనూ కొనసాగుతోంది. ఈ ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం ఒక తీర్థయాత్రగా మిగిలిపోదు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని కళ్లముందుంచుతుంది. సనాతన ధర్మం విశిష్టతను పరిచయం చేస్తుంది.
కాశీ.. వారణాసి.. యుగయుగాలుగా పేరు మారని ఊరు ఇదొక్కటే అంటారు. ఈ పేరును పరమ పవిత్రంగా భావిస్తారు హిందువులు. అతి పురాతనమైన నగరాల్లో కాశీ ప్రముఖమైనది. కిక్కిరిసిన వీధులు.. వీధి వీధినా ఆలయాలు.. బారులు తీరిన భక్తులు.. బోలేనాథుడి నామస్మరణలు.. సాధువులు.. సత్సంగాలు.. ఆధ్యాత్మిక దృశ్యకావ్యంలా కనిపిస్తుందీ దివ్యక్షేత్రం. నగర వీధుల్లో విహరిస్తుంటే అంతుతెలియని అద్భుతాలు దాగున్నాయని తోస్తుంది. ఏదో నిగూఢశక్తి ఆవహించిన అనుభూతి కలుగుతుంది. విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, దుర్గ, భైరవుడు ఇలా ఎందరో దేవుళ్లు పవిత్ర కాశీలో కొలువుదీరి భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారు. ఆలయ నగరిగా ప్రసిద్ధి చెందిన కాశీలో చిన్నాపెద్దా ఆలయాలు 15,000 వరకు ఉంటాయని ప్రతీతి.
కాశీగంగకు వందనం
గంగానది ఒడ్డున ఉన్న నగరాలన్నింటిలోనూ ప్రత్యేకమైనది కాశీ. ఉభయ సంధ్యల్లో ఈ జీవనది సౌందర్యం చూసి తీరాల్సిందే. సూర్యోదయ సమయంలో ఆకాశంలో కమ్ముకున్న అరుణవర్ణం గంగమ్మ ఒడిలో ప్రతిఫలించి సందర్శకులను సమ్మోహితులను చేస్తుంది. అపురూప దృశ్యాన్ని ఆస్వాదిస్తూనే నదిలో పవిత్ర స్నానాలు చేస్తుంటారు యాత్రికులు. మలిసంధ్యలో నింగిలో పొంగుకొచ్చే కాషాయ తెరలు.. గంగ తరంగాలపై పొరలు పొరలుగా కదలిపోతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. హిమాలయాల్లో పుట్టింది మొదలు దక్షిణాభిముఖంగా ప్రవహించే గంగా నది.. కాశీలో తన దిశ మార్చుకొని ఉత్తర దిశగా పయనమవుతుంది. అందుకే కాశీగంగలో మునకేస్తే పాపాలు తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. ఇక ప్రతి సాయంత్రం గంగ ఒడ్డున పవిత్ర ఘాట్‌లలో నిర్వహించే హారతి మరో అద్భుతం. ముఖ్యంగా దశాశ్వమేధఘాట్‌, బాబూ రాజేంద్రప్రసాద్‌ ఘాట్‌లలో గంగా హారతి చూపురులను కట్టిపడేస్తుంది. విశ్వనాథ ఆలయంలో ప్రతీ సాయంత్రం నిర్వహించే సప్తర్షిపూజ, రాత్రి జరిపే పవళింపు సేవలు భక్తులను సమ్మోహితుల్ని చేస్తాయి.
‘‘అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పూరీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః’’ అనేది వేద ప్రవచనం. దేశంలోని ఏడు మోక్ష పట్టణాలివి. వీటిలో ఎక్కడ జన్మించినా మోక్షం సిద్ధిస్తుందంటారు. కాశీలో మాత్రం మరణించినా ముక్తి లభిస్తుందని చెబుతారు. కనీసం ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించినా మోక్షం లభిస్తుందని కొందరి నమ్మకం. అందుకే ఎందరో ఆధ్యాత్మికవాదులు జీవిత చరమాంకంలో కాశీ చేరుకొని ఇక్కడే జీవనం కొనసాగిస్తుంటారు. ప్రపంచంలో బహుశా వారణాసిని మాత్రమే ‘డెత్‌ టూరిజం’ అని పిలుస్తారు. రోజూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందల మంది తమవారి అస్థికలు తెచ్చి గంగలో నిమజ్జనం చేస్తుంటారు. పరిసర ప్రాంతాల్లోని వారైతే నేరుగా మృత దేహాలను వాహనాల్లో తీసుకుని వచ్చి అంత్యక్రియలను నిర్వహిస్తుంటారు.
దేవతల కోరికపై శివుడు ఈ కాశీ నగరాన్ని తన ఆవాసంగా చేసుకుని, స్వయంభువుగా, విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడని హిందువులు భావిస్తారు. సంస్కృతి పరంగా, కళల పరంగా, మత, విద్యా, వ్యాపారపరంగా ఉన్నతంగా ఉండేదీ నగరం. మధ్యయుగాలలో అనేకసార్లు దండయాత్రలకు, విధ్వంసానికి గురైన కాశీలో తర్వాత హిందూ రాజపుత్రులు, మరాఠా రాజులు అనేక ఆలయాలను పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆలయమైన విశ్వేశ్వర మందిరాన్ని 1780లో ఇండోర్‌ రాణి అహల్యాబాయి హోల్కర్‌ నిర్మించారు. ఎన్ని విధ్వంసాలు, ఎన్ని ఆటుపోట్లకు గురైనప్పటికీ వారణాసి తన వైభవాన్ని కోల్పోలేదు. కాశీ రాజుల ఆధ్వర్యంలో చాలాకాలం ఆలయ నిర్వహణ బాధ్యతలుండేవి. ఇప్పటికీ కాశీరాజుల వారసులకు ప్రత్యేక స్థానం ఉంది.
కాశీగంగ పొడవునా దశాశ్వమేధ ఘాట్‌, తులసీఘాట్‌, హరిశ్చంద్ర ఘాట్‌.. ఇలా మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. వేటికవే ప్రత్యేకమైనవి. హరిశ్చంద్ర ఘాట్‌, మణికర్ణిక ఘాట్‌లలో నిరంతరాయంగా అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. దశాశ్వమేధ ఘాట్‌, దర్భాంగా ఘాట్‌, హనుమాన్‌ ఘాట్‌, మన్‌ మందిర్‌ ఘాట్‌లలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హరతులను నిర్వహిస్తారు. మానస సరోవర్‌ ఘాట్‌, నారదఘాట్‌, మణికర్ణిక ఘాట్‌లలో పిండ ప్రదానాలు, అస్థికల నిమజ్జనం వంటివి జరుగుతుంటాయి. గంగానదిలో బోట్‌లో, పడవలో ప్రయాణిస్తూ ఈ ఘాట్‌లను సందర్శించడం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
అభిషేక యోగం
విశ్వనాథ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదోది. బంగారుపూత ఉన్న గోపురం ఉండడం వలన దానిని గోల్డెన్‌ టెంపుల్‌ అని పిలుస్తారు. ఆలయ గర్భగుడి చాలా చిన్నది. ఇక్కడ స్వామివారికి భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. గర్భాలయ గోడలపై సీతారామలక్ష్మణులు, దశభుజ వినాయకుడు, కాలభైరవుడు, శక్తి, యోగాసనంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు ఉంటారు. ఆలయంలో అవిముక్తేశ్వర లింగం, పార్వతీదేవి ఆలయం వంటి ఉపాలయాలున్నాయి.
పర్యాటక ప్రదేశాలు
- వారణాసికి వచ్చే జైనులు జైన దేవాలయంలో ఉపశమనం పొందుతారు. ముస్లింలు ఇక్కడి జ్ఞాన్‌బాపి మసీదును పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నగర శివారులో ఉన్న సారనాథ్‌ బౌద్ధుల పుణ్య స్థలం. గౌతమ బుద్ధుడు తన మొదటి ‘ధర్మ’ ఉపదేశాన్ని ఇచ్చింది సారనాథ్‌లోనే.
- గంగా నది అవతలి వైపున్న రామ్‌నగర్‌ ఫోర్ట్‌ (కాశీరాజు కోట), జంతర్‌ మంతర్‌, ఫోర్ట్‌ మ్యూజియం పర్యాటకులను అలరిస్తాయి. బనారస్‌ యూనివర్సిటీ, బనారస్‌ పట్టు చీరల తయారీ కేంద్రాలు చూసే యాత్రికులూ ఉంటారు.
- నగరంలో సంప్రదాయ నృత్యం, సంగీతం, యోగా వంటివి నేర్చుకోడానికి అనేక కేంద్రాలు ఉంటాయి. కాశీని సందర్శించే విదేశీయులు కొందరు నెలల తరబడి ఇక్కడే ఉండి ధ్యానం, యోగా, సంగీతం వంటివి సాధన చేస్తుంటారు.
- ఇదొక మార్మిక నగరంగా భావిస్తారు. మార్మిక, తాంత్రిక విద్యలకు కేంద్రాలూ ఉంటాయి. అఘోరాలకు ఇది ఆవాసమని చెబుతారు. కాని సామాన్యంగా వారి దర్శనం ఎవరికీ లభించదు.
- కాలభైరవ మందిర్‌, బిందు మాధవుడు, సంకట మోచన హనుమాన్‌ ఆలయం, రోజుకు తిలపరిమాణంలో పెరిగే తిలభాండేశ్వర సజీవ లింగం, కేదారఘాట్‌లోని కేదారేశ్వర మందిరం, అపమృత్యుదోషాలను తొలగించే మృత్యుంజయ మందిరం, తులసీదాసు రామాయణాన్ని రచించిన తులసీ మానస మందిరం, నీలకంఠేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, డుండి గణపతి ఆలయం వంటి ప్రముఖ దర్శనీయ స్థలాలు ఇక్కడ ఉన్నాయి.
- వరుణ, అసి అనే రెండు నదులు గంగానదితో సంగమించే మధ్య ప్రదేశమే వారణాసి. ఈ రెండు నదుల సంగమ స్థానం మధ్య ఉన్న ఐదు క్రోసుల దూరాన్ని భక్తులు పంచక్రోస యాత్రగా చేస్తారు.
కాశి వెళ్ళే ప్రయాణికుల తీసుకోవలసిన జాగ్రత్తలు :
విలువైన బంగారు నగలు, ఉంగరాలు, మంగళసూత్రాలు ఇంటి వద్దనే భద్రపరచుకోవటం మంచిది. అవసరమైనంత వరకు డబ్బు మాత్రమే ఉంచుకొని ఎ టి యం కార్డులు తీసుకు వెళ్ళటం మంచిది. వీటిని కూడా లోపలి జేబుల్లో భద్రపరచుకోవాలి. కాశీలో అన్ని బ్యాంకుల ఎ టి యం లు కలవు. డి డిలు తీసుకు వెళ్ళినా ఆంధ్రాశ్రమం వారి సహకారంతో మార్చుకోవచ్చు. మీరు వాడే మందులు సరిపడా తీసుకు వెళ్ళటం మంది. అవే కంపెనీల మందులు కాశీలో దొరకక పోవచ్చు. నవంబర్, డిశెంబర్ నెలలో కాశీలో చలి ఎక్కువగా ఉంటుంది. అందు తగ్గ ఏర్పాట్లు (దుప్పట్లు, చలికోట్లు) తీసుకు వెళ్ళాలి. ఇంటి దగ్గర నుండి తాళం కప్ప తీసుకువెళితే కాశీలో రూములకు, రైలులో సామాన్లకు వేయటానికి పనికి వస్తుంది. రైలు ప్రయాణంలో కిటికీ వైపు తలపెట్టి నిద్రించరాదు. రైలు జబల్పూర్ దాటి కత్ని – సత్నా, అలహాబాద్ స్టేషన్ల నుండి ప్రయాణించేటపుడు దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. కనుక కొంతమంది వంతుల వారీగా మేలుకొని ఉండటం మంచిది.
రాత్రి 10 గంటల తరువాత కాశీలో దిగితే ఊళ్ళోకి వెళ్ళకుండా రైల్వే విశ్రాంతి గదులలో కానీ, స్టేషన్ లో గానీ విశ్రాంతి తీసుకుని ఉదయం కాశీలోకి వెళ్ళటం మంచిది. దళారులను నమ్మి బయట లాడ్జీలలో దిగి మోసపోకండి.
రైల్వే స్టేషన్ నుండి ఆంధ్రాశ్రమమం, కేదార్ ఘాట్, పాండె హవేలి, హరిశ్ఛంద్ర ఘాట్ లు సుమారు 7,8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సత్రాల దగ్గరకు ఆటోలు మాట్లాడుకుని వెళ్ళవచ్చు. మీరు తెలుగు వారైతే బెంగాలీ టోలా రోడ్ లోని ఆంధ్రాశ్రమం ప్రాంతానికి వెళితే తెలుగు వారు ఉంటారు.
కాశీలో వసతి సదుపాయాలు :
తెలుగు వారైతే బెంగాలీ టోలాగల్లీకి వెళ్ళటం మంచిది. కేదార్ ఘాట్ నుండి రాజాఘాట్ వరకు ఎక్కువగా తెలుగు వారుంటారు. గంగాస్నానానికి ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం ఉండదు. పూజలకు, పితృకార్యాలకు స్ధానిక పురోహితులు అందుబాటులో ఉంటారు.
కాశీలో ఆశ్రమాల వివరాలు :
శ్రీరామ తారక ఆంధ్రాశ్రమమం :
110 గదులు కలిగి విశాలమైన వరండాలతో నాలుగువైపుల మొట్లు కలిగి అన్ని సదుపాయాలతో ఉంటుంది. యాత్రికులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంది. వర్ణభేదాలు లేకుండా హిందువులందరికీ వసతి సౌకర్యం కల్పిస్తారు. అడ్రస్ : శ్రీరామ తారక ఆంధ్రాశ్రమం, బి.14-92, మానస సరోవర్, బెంగాలీ టోలా, పాండేహవేలీ, వారణాసి. ఫోన్ : 0542-2450418
భోజన సదుపాయం :
ఆశ్రమంలో దిగిన వారందరికీ పగలు 12 గంటలకు భోజనం రాత్రి 7 గంటల నుండి 8 గంటలలోపు అల్పాహార పాకెట్లు ఉచితంగా ఇస్తారు. ఇందు కోసం ఉదయం 9 గంటలలోపు పేర్లు నమోదు చేయించుకోవాలి. విరాళాలు ఇవ్వవచ్చు. ఇతర వివరాలకు సత్రంలో ఉన్న ఆశ్రమంలోని ఉద్యోగస్తులను సంప్రదించటం మంచిది.

భోలానంద సన్యాస ఆశ్రమం :
ది.28 -181, పాండేహవేలి, వారణాసి ఫోన్ : 0542-2450416, సెల్ : 9450707921 అటాచ్డ్ బాత్రూంలతో 10 రూములు, కామన్ బాత్ రూంలతో 8 రూములు కలవు.
శ్రీ శృంగేరి శంకర్ మఠ్ :
ది శృంగేరి జగద్గురు సంస్థానానికి చెందిన మఠం. కేదార్ ఘాట్ కుఎదురుగా కలదు. కామన్ బాత్రూంలతో 10 ఫర్నిష్ తో ఉన్న గదులు కలవు. రూముకు నలుగురు ఉండవచ్చు. రూములకు అద్దెలుండవు కానీ విరాళాలు స్వీకరిస్తారు. భోజనవసతి లేదు. ముందుగా ఫోన్ చేసి రూములు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
బి 14.111 కేదార్ ఘాట్, వారణాసి ఫోన్ : 0542-2452768

ట్రావెన్ కోర్ సత్రం :
శృంగేరి మఠాన్ని ఆనుకొని ఉంది. కింద ఆరు, పైన ఆరు గదులు కలవు. పాతభవనం, పైన నీటివసతి లేదు. కింద మున్సిపల్ నీరు 8 గంటలు మాత్రమే వస్తుంది. సత్సంగ శివనామ సంకీర్తనా సదనం :
కామన్ బాత్ రూంలతో 9 గదులలో నలుగురు, చిన్నగదులలో ఇద్దరు ఉండవచ్చు. చాపలు, బల్లలు, కుర్చీలు మాత్రమే ఉంటాయి. లాకర్ సౌకర్యం కలదు. బెంగాలీ టోలా గల్లీలోనికి వెళితే వెల్లంపలి రాఘవయ్య, రాఘవమ్మ అన్నసత్రం దగ్గర ఈ సత్రానికి సంబంధించిన బోర్డు తెలుగులో కనబడుతుంది.

మార్కండేయ ఆశ్రమం:
కేదార్ ఘాట్ లో, కేదారేశ్వరాలయానికి దగ్గరలో కలదు. ఆటోలు రిక్షాలు ఆశ్రమం దాకా వెళతాయి. 15 రూములు కలవు. నెలవారీగా లేక రోజువారీగా అద్దె ఉంటుంది. అడ్రస్ : డి7-187 కేదార్ ఘాట్, వారణాసి డి7-187, కేదార ఘాట్
అన్నపూర్ణా ప్రాంతీయ ఆశ్రమం :
కేదార్ ఘాట్ లో గుడి దగ్గరలో కలదు. హెడ్ ఆఫీస్, హైదరాబాద్ లో కలదు. అటాచ్డ్ బాత్ రూంల సౌకర్యాలతో రెండు రూములు, కామన్ బాత్ రూం ల సౌకర్యంతో రెండురూములు మాత్రమే కలవు. 15 మంది యాత్రికులు ఒకేసారి బసచేయవచ్చు. అడ్రస్ : డి 6-112 కేదార్ ఘాట్, సోనార్ పురా, వారణాసి, ఫోన్ : 0542-5535002. సెల్ : 9839605344
కాశీ వైశ్వసత్ర సంఘం :
ఈ సత్రం కేవలం వైశ్యులకు మాత్రమే. క్షేమేశ్వరఘాట్ కు అతి దగ్గరలో, శ్రీ శృంగేరీ మఠం, కేదార్ఘాట్ పోస్ట్ ఆపీస్ కు ఎదురుగా గలదు. మూడు నుండి అయిదు రోజుల వరకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు పొందవచ్చును. 2 గదులు పర్నిచర్ తో సహా కలవు. అడ్రస్ : డి14-15 క్షేమేశ్వరఘాట్, కేదార్ ఘాట్ పోస్టాఫీస్ ఎదుట వయా సోనాపురా, వారణాసి.
ఆంధ్ర క్షత్రీయ సంఘం :
శ్రీ తారకరామ నిలయం, బి5-281 హనుమాన్ ఘాట్ పోస్టాఫీస్ ఎదురుగా మెయిన్రోడ్డులో కలదు. హిందూ యాత్రికులందరికి వసతి కల్పిస్తారు.
గంగా స్నాన ఘట్టాలకు ఒక కిలో మీటరు దూరంలో ఉన్న వసతి గృహాలు :
శ్రీ నిర్మలానంద ఆశ్రమం :
బెంగాలి టోలా ఇంటర్ కాలేజి పక్క మదన్ పురా పోస్టాఫీస్ ఎదురుగా మెయిన్ రోడ్డులో కలదు. హిందూ యాత్రికులందరికీ వసతి కల్పస్తారు ఫోన్ : 0542-2450178, సెల్ : 98390 36093. అటాచ్డ్ బాత్ రూంలతో6, కామన్ టాయ్ లెట్లతో 14 గదులు, 1 హాలు కలవు.
కాశీజంగం మఠ్ :
గోదోలియా చౌరాహ్ నుండి బి.హెచ్. యు వైపు పోతుంటే సుమారు 150-200 మీటర్ల దగ్గరలో ఎడమచేతి పైపు పెద్ద గేటున్న విశాలమైన పురాతన మఠం ఇది. రైల్వే స్టేషన్ నుండి 6-7 కిలో మీటర్ల దూరంలో మెయిన్ రోడ్డులో కలదు. భారతదేశంలోని హిందువులందరికీ ప్రపవేశం కలదు.
జంగమవాడి మఠ్ :
డి 35-77 వారణాసి. 75 రూములు కలవు : ఒకేసారి వేయిమందికి సరిపోను వసతి కలదు అద్దెలు లేవు. విరాళాలు స్వీకరస్తారు. బ్యాంకులు ఎటియం లు దగ్గరలో కలవు.
హరసుందరి ధర్మశాల :
గోధోలిలా చౌరాహ నుంచి గిరిజాఘర్ చైరాహాకు వెళ్ళే దారిలో 30 అడుగుల దూరంలో భట్టాచార్య వారి హోమియోపతి మందులషాపుల కలదు. అందరికీ ప్రవేశం కలదు. అడ్రస్: హరసుందరి ధర్మశాల, గోదౌలియా, వారణాసి. ఫోన్ 0542-2452446. 40 రూములు, 6 హాల్స్, అన్నిటికి కామన్ బాత్ రూంలు. సామాన్యులకు అందుబాటులో గల ధర్మశాల.
వీరేశ్వర్ పాండే ధర్మశాల :
గోదౌలియా చౌరాహాకు పడమరగా కొద్ది దూరంలో కనిపించే గిరిజాఘర్ చౌరాహాలో కార్పోరేషన్ బ్యాంక్ కు దగ్గరగా ఉన్న తరుణ్ గుప్తా హాస్పటల్ కు ఎదురుగా లక్సారోడ్ లో కలదు. 22 రూములు, కామన్ బాత్ రూంలు, 8 రూములు అటాచ్డ్ బాత్ రూంలతో కలవు. అడ్రస్ : 47-200 అస్సి, వారణాసి. ఫోన్ : 0542-245527.
చౌడేశ్వర్ పాండే ధర్మశాల :
47-200, పి. దూరంలో మెయిన్ రోడ్ మీద కాశీపట్టణానికి దక్షిణం వైపు అసీ ఘాట్ దగ్గర కలదు. 5 ఎకరాల విశాలమైన స్థలంలో ఉంది. అందరికీ ప్రవేశం కలదు. కాశీ ముముక్షు భవన్ సభ : రైల్వే స్టేషన్ కు 10కి.మీ దూరంలో మెయిన్ రోడ్ మీద కాశీపట్టణానికి దక్షిణం వైపు అసీ ఘాట్ దగ్గర కలదు. 5 ఎకరాల విశాలమైన స్ధలంలో ఉంది. అందరికీ ప్రవేశం కలదు.150 నుండి 200 మందికి సరిపడు హాలు, 50 గదులు (కొన్నింటికి మాత్రమే అటాచ్డ్ బాత్ రూంలు కలవు) ఈశ్వర్ మఠ దండిస్వాములకు 150 రూములు ప్రత్యేకంగా కలవు. కాశీలో చరమదశ గడపాలన్న వారికి 60 రూములు కలవు. రూములకు అద్దెలుండవు. స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు స్వీకరిస్తారు. ప్రతి రోజూ బీదలకు అన్నసంతర్పణ జరుగుతుంది. దగ్గరలోనే స్టేట్ బ్యాంక్, బరోడా బ్యాంక్, సెంట్రల్ బ్యాంకులు కలవు. యజ్గ్నయాగాదులు జరుపుకునే సౌకర్యం కలదు.
అడ్రస్ : కాశీ ముముక్షు భవన్ సభ (అన్నక్షేత్ర) గౌడిలియా చౌరాహ్ నుంచి బి హెచ్ యుకు వెళేళ దారిలో తులసీఘాట్ సమీపంలో మెయిన్ రోడ్ లో ముముక్షు భవన్ కు అరకిలోమీటరు దూరంలో కలదు.
శ్రీ మార్వాడి సేవాసంఘ్, భదైనీ (తులసి ఘాట్ దగ్గర) వారణాసి
న్యూ హోటల్ బ్రాడ్ వే :
రైల్వే స్టేషన్ నుండి 8 కి.మీ దూరంలో బి హెచ్ యు వెళ్ళే దారిలో విజయా సినిమా క్రాసింగ్ దగ్గర ఉన్నది. శివాలా ఘాట్ కు అరకిలోమీటర్ దూరంలో ఉంది. అడ్రస్ : విజయా సినిమా క్రాసింగ్ దగ్గర భేలుపూర్, వారణాసి. ఫోన్ : 0542-2277097, 3090284
షేర్ ఆనందరామ్ జైపురియా స్మృతిభవన్ సొసైటి (జైపురియా భవన్) : గౌడిలియా సెంటర్ నుండి జ్గ్నానవాసికి వెళ్ళే మెయిన్ రోడ్ లో ప్యాలెస్ హోటల్ క్లాక్ టవర్ దాటిన తరువాత మొదటి ఎడమ గల్లీలో ఉన్నది. మొత్తం 35 రూములు కలవు. ఫోన్ : 0542-2412766, 24127709, 24122674
శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య వృద్దాశ్రమమం మరియు నిత్యాన్నదాన సత్రం:
ఈ సత్రం ఆర్యవైశ్యులకు మాత్రమే. రెండు సత్రాలు కలవు. మొదటిది అక్నా రోడ్డులో కెనరాబ్యాంక్ ఉన్న సందులో ఉన్నది. 5 అంతస్తుల భవనంలో లిఫ్ట్ తో సహా ఆధునిక సౌకర్యాలు కలవు. 0542-2400076, 2455087. రెండవ సత్రం ఇదేరోడ్ లో రామకృష్ణ మిషన్ హాస్పటల్ దగ్గరఫోన్ : 0542-2411829. వీరు మూడు రోజుల పాటు ఉచిత వసతి,భోజన సౌకర్యం కల్పిస్తారు.
ఇవి కాక కాశీలో అనేక ఇతర లాడ్జీలు, హోటల్స్ కలవు
కాశీలో భోజన సదుపాయాలు :
ఆంధ్రాశ్రమం, వైశ్వ సత్రాలలో దిగిన వారికి ఉచిత భోజనం కలదు. ఉదయం 9 గంటలలోపు పేర్లు నమోదు చేయించుకోవాలి. వెల్లంపల్లి రాఘవయ్య, రాఘవమ్మ కాశీ శ్రీ అన్నపూర్ణమ్మ సత్రం ఫోన్ : 0542-2452339 గంగామహల్, బెంగాలీటోలా, వారణాసి
ఉదయం 9 గంటల లోపు పేర్లు నమోదు చేయించుకోవాలి. మ. 12 గంటలకు భోజనం, రాత్రికి అల్పాహారం ఇస్తారు. నాలుగు వర్ణాల వారికి ఉచితంగా నిత్యాన్నదానం జరుగుతుంది. విరాళాలు స్వీకరిస్తారు.
అఖిల భారత బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం : ఎ బి బి కె యస్ సత్రం బి 4-52 మానస సరోవర్ వారణిసి ఫోన్ 2451953. బ్రాహ్మణులకు మాత్రమే 9 రోజులపాటు అన్న సంతర్పణ
అఖిల భారతీయ బ్రాహ్మణ వారణాసి నిత్యాన్నదాన సత్రం : ఆంధ్రాశ్రమం ఎదురు సందులో మానస సరోవర్ ఉదయం 9 గంటల లోపు పేర్లు నమోదు చేయించుకోవాలి. మ. 12 గంటలకు భోజనం, రాత్రికి అల్పాహారం ఇస్తారు. నాలుగు వర్ణాల వారికి ఉచితంగా నిత్యాన్నదానం జరుగుతుంది. విరాళాలు స్వీకరస్తారు.
కాశీ అన్నపూర్ణ అన్న క్షేత్ర ట్రస్ట్ :
శ్రీ అన్నపూర్ణా దేవాలయం, శ్రీ విశ్వనాధ వీధి, వారణాసి ఫోన్ : 0542-2392619 ఉదయం 10 గంటలలోపు పేర్లు నమోదు చేయించుకోవాలి. మ.12 గంటలకు భోజనం.
కాశీలో చేయకూడని పనులు :
గంగానదికి చెప్పులతో వెళ్ళకండి.. షుగర్ వ్యాధిగ్రస్తులు చెప్పులను మెట్లమీద జాగ్రత్త పరచుకోవాలి.
గంగానదిలో స్నానం చేసేటపుడు సబ్బులు షాంపూలు ఉపయోగించరాదు. సబ్బులతో బట్టలు ఉతకరాదు. గంగానదీజలం కలుషితమవుతుంది.
గంగాజలాన్ని ఇక్కడ నుండి పాత్రలలో మీ ఊరికి తీసుకువెళ్ళరాదు హరిద్వార్, అలహాబాద్ (ప్రయాగ) గంగాసాగర సంగమం (కలకత్తా)ల నుండి మాత్రమే గంగాజలం సేకరించి తీసుకు వెళ్ళాలి.
మొబైల్ ఫోన్లు, కెమేరాలు దైవదర్శనానికి వెళ్ళేమందు తీసుకు వెళ్ళరాదు. రూములలోనే జాగ్రత్త పరచుకోవటం మంచిది. బయట లాకర్లు లభిస్తాయి. కానీ ఖరీదైన వస్తువులకు గ్వారంటీ ఉండదు.
కాశీలో ప్రతి జీవి, ప్రతిదీ శివమయమే. శివనింద చేయరాదు. పోట్లాడుట, అసత్యమాడుట పనికిరాదు.
కాశీలో శివలింగాలను తాకి పూజచేయవచ్చు. అమ్మవారిని మాత్రం తాకరాదు. దూరం నుంచే పూజచేయాలి.
యాత్రికులు ఎవరూ లేని చోట గంగా స్నాన ఘట్టాలలో స్నానం చేయకండి. మొట్లమీద నాచు, మట్టి ఉంటే జాగ్రత్తగా దిగండి.
కాశీలో చేయదగిన పనులు :
కాశీలో ఉన్నన్ని రోజులు ప్రతిరోజూ గంగా స్నానం చేయండి.
బ్రాహ్మణులకు, బీదవారికి అన్నదానం చేయండి.
మొదటి సారి కాశీకి వచ్చినవారు ప్రాయశ్చిత్త గంగా స్నానం, పితరులకు పిండప్రదానము (తండ్రి లేనివారు) చేయండి. ప్రయోగ, గయలలో కూడా స్నానం, పిండ ప్రదానం చేయాలి. కాశీలో 9 రోజులు నిద్రచేయటం మంచిది. ఇంకా 9 నెలలు 9 రోజులు (గర్భవాసం) ఉండటానికి చాలామంది కాశీ చేరుంటారు. మరణించేవరకు కాశీలో ఉందామని వచ్చిన వారు (క్షేత్ర సన్యాసులు లేక కాశీవాసులని అంటారు) కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు.
కాశీలో షాపింగ్ :
దక్షిణ భారతం నుండి వచ్చిన పట్టునూలుతో అద్భుతంగా పట్టువస్త్రాలు తయారు చేసేవారు కాశీలో ఎక్కువగా ఉన్నారు. బెనారస్ పట్టుచీరలు, చేతితో చేసిన వస్తువులు, సంగీత సాధనాలు, ఇత్తడి సామాగ్రి, రుద్రాక్షలు, చెక్క, మట్టి బొమ్మలు, దండలు, గాజులు, ఉన్ని వస్త్రాలు బేరమాడి కొనవచ్చు.
కాశీ ప్రయాణ సౌకర్యాలు :
పురాతనకాలంలో కాశీకి పోవాలంటే చాలా కష్టనష్టాలు పడవలసి వచ్చేది. కానీ ప్రస్తుత కాలంలో ఈ పరిస్థితి చాలా వరకు మారిపోయింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల రాజధానుల నుండి కాశీకి (వారణాశి) ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి.
విమాన ప్రయాణం చేసేవారు వారణిసికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం ’’బాబత్పురా‘‘. న్యూఢిల్లీ, ఆగ్రా, కోల్ కత్తా, లక్నో, భువనేశ్వర్, ముంబై, ఖుజరాహో పట్టణాల నుండి వారణాసికి (బాబత్పురా) కు విమానాలు నడపబడుచున్నవి.