ఆ మాటలను భరించలేనట్లు వారు రెండుచెవులూ మూసుకుంటూ, ‘‘అయ్యో, మాకిక దారి ఏది’’ అంటూ అక్కడే స్పృహతప్పి పడిపోయారు. వారి అనన్య భక్తికి పరవశించిన నారదుడు వారిని లేవనెత్తి, ‘‘విచారించవద్దు. మీరు ఇక్కడకు సమీపంలోని హరిధ్రానదిలో స్నానం చేసి, ద్వారకాధీశుడైన కన్నయ్యకోసం తపస్సు చేయండి. ఆయన మీ కోరిక తీరుస్తాడు’’అని చెప్పి అంతర్థానమయ్యాడు. వారు సంవత్సరం పాటు తీవ్రంగా తపస్సు చేసిన పిమ్మట రాజగోపాలుడు ప్రత్యక్షమై, ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘‘భగవాన్ మాకు మీరు వెన్నదొంగగా ఉండగా చూడాలని ఉంది. గోపికలతో కలసి జలక్రీడలాడుతుండగా దర్శించాలని ఉంది. యశోదమ్మ నిన్ను చెట్టుకు కట్టివేస్తుండగా చూడాలని ఉంది. గోపబాలుడిగా పశుపాలన చేస్తుండగా వీక్షించాలని ఉంది.... ’’ ఇలా 30 కోరికలు కోరారు. స్వామి వారు కోరినట్లుగా తన బాల్యం నుంచి, అవతార పరిసమాప్తి వరకు తన లీలలన్నీ వారికి చూపాడు. ఆ సమ్మోహన మూర్తిని, ఆయన చూపిన దివ్యలీలలను కన్నులారా దర్శించిన మునిబాలురు ఆనందంతో పరవశించిపోతూ, ‘‘స్వామీ, నీవు ఇక్కడ వేణుగానం చేస్తూ, గోవులను కాస్తూ, నీ పత్నులయిన రుక్మిణీ సత్యభామలతో సహా నువ్విక్కడే ఉండిపో’’ అని కోరారు. వారు కోరిన విధంగా వరం ఇచ్చి విష్ణువు వారికి మోక్షప్రాప్తి కలిగించాడు. ఆయనే రాజగోపాలస్వామి. ఆ ప్రదేశం మన్నారు గుడి కావడంతో ఆయన మన్నారు గుడి రాజగోపాలస్వామిగా ప్రసిద్థిగాంచాడు.
ఆలయంలో గణేశుడు, వేణుగోపాలుడు, వేంకటేశ్వరస్వామి వారితో సహా మొత్తం 24 దేవతా సన్నిధులున్నాయి. ఆలయ ప్రాకారాలు అద్భుతమైన శిల్పసంపదతో కనువిందు చేస్తాయి. తిరువుణ్ణాజీ ప్రాకారం, గరుడ ప్రాకారం, చంపక ప్రాకారం, కాశీ ప్రాకారం, నాచ్ఛియార్ ప్రాకారం తదితర ఏడు ప్రాకారాలు, వల్లాల మహరాజ మండపం, వెయ్యిస్తంభాల మండపం, గరుడ వాహన మండపం, యానై వాహన మండపం, పాలకాణి మండపం, వెన్నై తాఝీ మండపం, పున్నై వాహన మండపం అనే ఏడు పెద్ద మండపాలతో ఎటుపోయి ఎటువస్తున్నామో తెలియనంత సువిశాలంగా ఉంటుంది ఆలయ ప్రాంగణం. ఈ క్షేత్రం ఉన్న ప్రదేశాన్ని చంపకారణ్యమంటారు. ప్రాచీన కాలంలో ఇక్కడ చంపక వృక్షాలుండేవి. ఇప్పుడు పున్నాగ వృక్షాలున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ పున్నాగ ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల పునర్జన్మ ఉండదని, సిరిసంపదలకు లోటుండదని నమ్ముతారు. హరిద్రానదిలో స్నానమాచరించిన వారికి చర్మవ్యాధులు తొలగిపోతాయని, కోరుకున్న వారితో వివాహం జరుగుతుందని కూడా భక్తుల విశ్వాసం.