వివాహం ఆలస్యం అవుతున్నవారు అమ్మవారిని పూజిస్తే, వారి వివాహంలో కలుగుతున్న ఆటంకాలు తొలగి, త్వరగా వివాహం అవుతుందనేది భక్తుల విశ్వాసం. అదేవిధంగా సంతాన సౌభాగ్యం కోసం పరితపిస్తున్నవారు, ఇంటిలో తలపెట్టిన
శుభకార్యాలు వివిధ రకాల ఆటంకాల వల్ల వెనక్కి వెళుతుంటే, అమ్మవారిని పూజించి, విజయదశమినాడు జరిగే ఆమె రథయాత్రలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో తమకు కలుగుతున్న అమంగళాలను తొలగించుకుని, మంగళప్రదమైన జీవితాన్ని అనుభవించడం భక్తుల ప్రత్యక్ష అనుభవాలకు, అమ్మవారి అనుగ్రహానికి నిదర్శనం. ఆలయ శిల్పసంపద కన్నులు తిప్పుకోనివ్వనంత అద్భుతంగా ఉంటుంది. రథోత్సవం ఈ ఆలయంలో జరిగే ప్రధాన వేడుకల్లో ఒకటి.
బెంగళూరుకు పశ్చిమంగా 350 కి.మీ.ల విస్తీర్ణంలో అలరారే నగరం మంగుళూరు. కర్ణాటకలో అతి ముఖ్యమైన రేవుపట్టణం ఇది. కోరికలను తీర్చే కొంగు బంగారంగా పేరొందిన మంగళాదేవి కొలువైంది ఇక్కడే. ఆ అమ్మ పేరు మీద ఏర్పడినదే ఈ పట్టణం.
నేత్రావతీ నదీ జలాలు, గురువురా నదీ జలాలు, ఇక్కడే సముద్రంలో కలుస్తూ ఉంటాయి. సముద్రంలో ఓడల రద్దీ పెరిగినపుడు ఇక్కడే కొన్నిటిని నిలుపుతూ ఉంటారు. కాఫీ, జీడిపప్పు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. మంగుళూరు నగరాన్ని గతంలో కదంబులు, విజయనగర రాజులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హోయసాలులు, పోర్చుగీసు వారు పరిపాలించారు. ఈ విధంగా మారుతున్న పరిణామాల్లో భాగంగా నాటి మైసూర్ ప్రభువైన హైదర్‌అలీ, 1763లో మంగుళూరు మీద దండెత్తి ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1767 వరకు ఈ రాజ్యం అతని ఏలుబడిలోనే ఉంది.
కాని ఆ తరువాతి పరిణామాల్లో బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుగుబాటుతో హైదర్‌అలీ పాలన అంతమయింది. నాటి నుంచి అంటే 1767 నుంచి 1783 వరకూ మంగుళూరు వారి అధీనంలోనే ఉంది. ఆ తరువాత హైదర్‌అలీ కుమారుడు టిప్పుసుల్తాన్ ఈ పట్టణాన్ని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. హోయసాలులు, పోర్చుగీసువారు పరిపాలించారు. ఇలా ఈ ప్రాంతం చాలా కాలం మైసూరు రాజులు, హైదర్ అలీ, టిప్పుసుల్తాన్, బ్రిటిష్ ప్రభువుల మధ్య గొడవల్లో నలిగిపోయింది 1799లో బ్రిటీష్ వారు ఈ పట్టణాన్ని హస్తగతం చేసుకున్నారు.
ఈ నగరానికి మంగుళూరు అని పేరు రావడానికి వెనుక చిన్న కథనం కూడా ఉంది.ఇక్కడ కొలువై ఉన్న మంగళాదేవి ఆలయాన్ని నాథ వంశీయుడైన మత్యేంద్రనాథుడు నిర్మించాడు. ఒకసారి ఈ మత్యేంద్రనాథుడు, కేరళ రాజకుమారి అయిన పరిమళతో కలిసి ఇక్కడికి వచ్చాడు. ఈమెనే ప్రేమలాదేవి అని కూడా పిలిచేవారు. ఆ తరువాత ఈమె నాథ మతాన్ని స్వీకరించి మత్సే్యంద్రునితోనే ఉండిపోయింది. మతం మారిన తర్వాత మత్యేంద్రుడు ఆమెకు మంగళాదేవి అని పేరు మార్చాడు. మంగళాదేవి చనిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకార్ధం ఇక్కడ బోలార్ అనే ప్రాంతంలో మంగళాదేవి ఆలయాన్ని నిర్మించాడు. టూకీగా మంగుళూరు పూర్వచరిత్ర ఇది.
హిందూ చరిత్రలో ఇది చాలా పురాతన, పౌరాణిక ప్రాశస్త్యం గల పట్టణం. రామాయణ కాలంలో శ్రీరాముడు ఈ నగరాన్ని ఏలినట్లు పౌరాణిక ఆధారాలున్నాయి. మహాభారతకాలంలో పాండవుల్లో చివరివాడైన సహదేవుడు ఈ నగరాన్ని పరిపాలించాడని, పాండవ మధ్యముడైన అర్జునుడు కూడా దేశాటన చేస్తున్న కాలంలో గోకర్ణం నుంచి ఆదూరు వెళుతూ మార్గమధ్యంలో ఇక్కడే విడిది చేశాడని పురాణకథనం.
ఇలా అనేక రాజుల ఏలుబడిలో , సుదీర్ఘచరిత్ర కలిగిన ఈ మంగుళూరు చుట్టుపక్కల ఉన్న అనేక దర్శనీయస్థలాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ పట్టణాన్ని అనుకుని ఉన్న అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ చారిత్రక శిథిలాలు, వాటి ఆనవాళ్లు, అనేకం మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. సుందరవనాలకు పెట్టిందిపేరైన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మంగుళూరు చుట్టుపక్కలున్న అటవీ ప్రాంతం కూడా ఎంతో మనోహరంగా ఉండి, కనువిందు చేస్తుంది.
కుద్రోలి గోరఖ్‌నాథ్ ఆలయం, ఖాద్రి మంజునాథాలయం, కటీల్ శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయం, సోమేశ్వరాలయం, పొలాలి రాజరాజేశ్వరి ఆలయం, శ్రీ వెంకటరమణ ఆలయం, శ్రీ శరావు మహాగణపతి ఆలయం, శ్రీ అనంత పద్మనాభాలయం పుణ్యస్థలాలు. మంగుళూరు బీచ్ అన్నింటికన్నా ముందు అందరికీ గుర్తొస్తుంది. అయితే శూరత్కాల్ బీచ్, మిలేగ్రేస్ చర్చ్, ఎన్‌ఐటీకే లైట్ హౌస్; డాక్టర్ టిఎంఎ పాయ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ది ఫోరమ్ ఫిజా మాల్, ఖాద్రి మిల్ పార్క్, రొసారియో కెథడ్రల్ చర్చ్, మానసా ఎమ్యూజ్‌మెంట్ అండ్ వాటర్‌పార్క్, బటర్ ఫ్లై పార్క్, న్యూ మంగుళూర్ పోర్ట్... ఇవన్నీ కూడా చూడదగ్గ ప్రదేశాలే. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే రమణీయ స్థలాలే.
కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యనగరాలలో మంగుళూరు ఒకటి కాబట్టి ఈనగరానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. జలమార్గం కూడా ఉంది. అన్ని వర్గాల వారికీ సరిపడేవిధంగా భోజన, వసతి సౌకర్యాలు దొరుకుతాయి.