header

శ్రీరంగనాథుడు - శ్రీరంగపట్నం / Sri Ranganathudu - Sri Rangapatnam

శ్రీరంగనాథుడు - శ్రీరంగపట్నం / Sri Ranganathudu - Sri Rangapatnam
శేషపానుపు మీద పవళించి ఉండే శ్రీరంగనాథుడితో పాటూ లక్ష్మీ దేవిని మనం చూస్తాం. కానీ ఆ స్థానంలో కావేరీ దేవి కొలువై ఉంటుంది కర్ణాటకలోని శ్రీరంగ పట్టణంలో. దేశంలోని ప్రముఖ, ప్రాచీన శ్రీరంగ క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయంలో వెలసిన స్వామి కరుణ కావేరీ ప్రవాహం లాంటిందంటారు. మహావిష్ణు స్వరూపాల్లో ఒకటిగా శ్రీరంగనాథుడ్ని కొలుస్తాం. పాలకడలిలో శేషతల్పంపైన విష్ణుమూర్తి పవళించి ఉండే భంగిమలో కనిపించే శ్రీ రంగనాథుడి విగ్రహాన్ని చూడగానే రెండు చేతులూ అప్రయత్నంగా దగ్గరవుతాయి. అలాంటి గంభీర సుందర రూపంతో కర్ణాటక రాష్ట్రం మండ్యా జిల్లా శ్రీరంగ పట్టణంలో కావేరీ సమేతంగా వెలశాడు రంగనాథుడు. ఆకాశాన్నంటుతున్నట్టు కనిపించే గాలి గోపురం స్వామి వైభవానికి సంకేతంగా కనిపిస్తుంది.
కావేటి రంగడు...
రంగనాథుడికీ కావేరికీ ఉండే సంబంధం విశిష్టమైనది. అందుకే దేశంలోని ప్రముఖ శ్రీరంగ క్షేత్రాల్లో మూడు ఈ నది ఒడ్డునే వెలిశాయి. కావేరీ నదికి మొదట్లో వెలసిన శ్రీరంగపట్టణం ఆది శ్రీరంగంగా, ఇంకా ముందుకు శివనసముద్రం దగ్గర ఉండే శ్రీరంగ దేవాలయం మధ్య రంగంగా, తమిళనాడులోని శ్రీరంగంలో వెలసిన రంగనాథుడి ఆలయం అంత్య రంగంగా విరాజిల్లుతున్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకం, అంతకు మించి పురాతనం. శ్రీరంగ పట్టణంలోని స్వామి ఎప్పుడు వెలశాడు అన్నదానికి కచ్చితమైన ఆధారాలేవీ లేవు. అయితే క్రీ.పూ.3600 సంవత్సరంలో అంబ అనే ఒక భక్తురాలు చిన్నగా శ్రీరంగనాథుడికి గుడికట్టించినట్టు కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది. స్థల పురాణం ప్రకారం... గౌతమ మహర్షి బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవటం కోసం ఇక్కడ ఉండే గుహలో తీవ్రంగా తపస్సుచేసి విష్ణుమూర్తిని మెప్పిస్తాడు. ఆయన చెప్పిన ప్రకారం గౌతముడు ఇక్కడి కావేరినదిలో స్నానంచేసి తన పాపాన్ని పోగొట్టుకుంటాడు. ఆ సమయంలో గౌతముడూ, కావేరీనదుల కోరిక మేరకు శ్రీరంగనాథుడి రూపంలో విష్ణుమూర్తి ఇక్కడ వెలశాడని అంటారు. అందుకే శ్రీరంగ పట్టణంలో స్వామి పాదాలను సేవిస్తూ కావేరీమాత కనిపిస్తుంది. అదే గర్భగుడిలో గౌతముడి విగ్రహాన్నీ చూడొచ్చు. అయితే ఉత్సవ మూర్తుల్లో మాత్రం స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లే దర్శనమిస్తారు.
ఇక్కడ కావేరి నది పూర్వ వాహినిగా, పశ్చిమ వాహినిగా విడిపోయి ప్రవహిస్తోంది. కాబట్టి శ్రీరంగపట్టణం ఈ రెండువాహినులకు మధ్యగా ఒక సుందర ద్వీపంగా కూడా ప్రసిద్ధి చెందింది.
సుందర దేవాలయం...
ఇక్కడి స్వామితో పాటు ఆలయపు నిర్మాణాన్నీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వివిధ రాజవంశీయుల వాస్తుశిల్ప కళలకు సుందర తార్కాణం ఈ దేవస్థానం. గంగ, హోయసల, విజయనగర రాజుల ఏలుబడిలో అభివృద్ధిచెందిన ఈ దేవాలయం ఆయా రాజుల కళాపోషణకు ప్రతీకగా కనిపిస్తుంది. అంతకు ముందు చిన్నదిగా ఉన్న ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దంలో గంగరాజులు పునర్నిర్మించారు. అనంతరం హోయసలులూ, ఆ తరవాత విజయనగర రాజులూ అభివృద్ధిపరిచారు. గర్భగుడి గంగరాజుల శైలిలో, ఇతర లోపలి నిర్మాణాలు హోయసల శైలిలో, రంగమండపం, గోపురం విజయనగరశైలిలో ఉంటాయి. 700కు పైగా అత్యద్భుత రాతి స్తంభాలున్నాయీ గుళ్లొ. దేవాలయంలోని రెండు స్తంభాల మీద విష్ణుమూర్తి 24రూపాలు చెక్కి ఉన్నాయి. వీటిని చతుర్వింశతి స్తంభాలని కూడా అంటారు. కొంతకాలం టిప్పుసుల్తాన్‌, హైదర్‌అలీల ఏలికలో రాజధానిగా ఉన్నందువల్ల శ్రీరంగపట్టణం ఇండో ముస్లిమ్‌ వాస్తుశిల్ప కళను కూడా సంతరించుకుంది.
దేవస్థానానికి చెందిన 25 ఎకరాల స్థలంలో ఐదుఎకరాలలో దేవాలయం నిర్మితమై ఉంది. ఆలయ రాజగోపురం ఎత్తు 100అడుగులు. ఆలయ లోపలి ప్రాంగణంలో 32 ఉప ఆలయాలు ఉన్నాయి. వీటిలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయుడు, నరసింహస్వామి, వినాయకుడు, సరస్వతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తదితర దేవతామూర్తులు కొలువయ్యారు. ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ధనుర్మాస పూజ, సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు, అనంత చతుర్దశి, వెంకటరమణస్వామి పుష్పాంగి ఉత్సవం, ఆండాళమ్మ తిరునక్షత్ర ఉత్సవాలతో పాటు వివిధ పుణ్యదినాల్లో కార్యక్రమాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇక్కడి స్వామిని రోజుకి కనీసం వేయి మంది భక్తులు దర్శించుకుంటారు.
ఈ పట్టణంలో అడుగు పెడుతూనే మనకు మైసూరు పులి టిప్పుసుల్తాన్‌కు చెందిన కట్టడాలు దర్శనమిస్తాయి. టిప్పు వేసవి విడిదిగా వినియోగించిన దరియాదౌలత్‌ అనే అత్యద్భుత భవనం ఇక్కడే ఉంది. ఆయన వాడిన దుస్తులూ, ఆయుధాలూ తదితరాలను మ్యూజియంలో ఇక్కడే పొందుపరిచారు. అలాగే ఆయన తల్లిదండ్రుల సమాధులతోపాటు టిప్పుసుల్తాన్‌ సమాధి ఉన్న అత్యంత విశాల కట్టడ ప్రాంగణం గుంబజ్‌, జుమామసీదులను కూడా చూడొచ్చు. ఇక్కడికి దగ్గరలోనే నిముషాంబ అమ్మవారి దేవస్థానం, శివన సముద్ర జలపాతం, రంగనాథిట్టు అనే పక్షిధామం తదితర దర్శనీయ స్థలాలున్నాయి.
ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి?
బెంగళూరు నుంచి 127కిలోమీటర్ల దూరంలోనూ, జిల్లా కేంద్రం మండ్యా నుంచి 13 కిలోమీటర్లూ, మైసూరు నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న శ్రీరంగపట్టణం మంచి చారిత్రక ప్రదేశం కూడా.
ఆధారం : ఈనాడు ఆదివారం బుక్