header

Subrahmaneswara Swamy Teample, Palani / సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పళని

Subrahmaneswara Swamy Teample, Palani / సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పళని
Subrahmaneswara Swamy Teample, Palani / సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పళని పళని అరుల్‌ ముగు శ్రీ దండాయుధపాణి క్షేత్రం అత్యంత పేరు పొందిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో మూడోదిగా పేరు పొందింది. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుగల్‌ జిల్లాలోని పళనిలో కొలువై ఉంది. ఇది మదురైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎతైయిన కొండలపై ఉంటుంది.
పురాణ గాథ
ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. అది వారిద్దరి కుమారులలో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు. అయితే ఆ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరినీ ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు. వెంటనే కుమార స్వామి తన నెమలి వాహనం తీసుకుని లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు. కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తిరిగి కైలాసాన్ని చేరుకుని జరిగిన విషయం తెలుసుకుంటాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకుని, నిరాశగా స్కందుడు భూలోకంలోని పళని ప్రదేశానికి చేరుకుంటాడు. కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనిలోని ఒక కొండ మీద మౌన ముద్రలో ఉంటాడు. విషయం తెలుసుకున్న గౌరీశంకరులు అక్కడకు చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ఊరడిస్తాడు.
అప్పుడు శివుడు కుమారా.. సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం, నీవు అంటే నీ ఈ రెండు కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. అందుకు సరేనన్న శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు. స్వామి వారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో భోగార్‌ ముని తయారు చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి దేవతా మూర్తి తొడ భాగం నుంచి విభూతి తీసి భక్తులకు పంచేవారు. అలా చేస్తూ ఉండటంవల్ల స్వామి వారి విగ్రహం అరిగిపోతూ వచ్చింది. దీంతో కొద్దికాలం తర్వాత అలా పంచడాన్ని నిలిపేశారు. మొదటగా స్వామి వారి ఆలయాన్ని ఏడో శతాబ్దంలో కేరళ రాజు చీమన్‌ పెరుమాళ్‌ నిర్మించారు. తర్వాత పాండ్యులు పునరుద్ధరించారు.
కావడి ఉత్సవం
సుబ్రహ్మణ్య స్వామి శిష్యులలో అగస్త్య మహాముని ఒకరు. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయారు. కానీ అందులో ఇడుంబన్‌ అనే ఒక రాక్షసుడు మాత్రం తన అసుర గణాలను వదిలి అగస్త్య ముని పాదాలు పట్టుకుంటాడు. అప్పుడు అగస్త్యుడు అతనిలో మిగిలిపోయిన రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు. లోకంలో ఆది గురువు దక్షిణా మూర్తి, శంకరుడు ఉండేది కైలాసంలో కదా అందుకని ముందు అక్కడికి పంపిద్దాం అనుకుంటాడు. అతడిని పిలిచి ‘‘ నాయనా ఇడుంబా, నేను కైలాసం నుంచి రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు ఆ రెండు కొండలను ఒక కావిడిలో నేను ఉన్న చోటికి తీసుకురా’’ అని ఆజ్ఞాపించాడు. ముని ఆజ్ఞకు బద్ధుడై కైలాసం వెళ్లి కొండలను ఒక కావిడిలో పెట్టుకుని బయలుదేరుతాడు. శంకరుడు దానికి అడ్డుచెప్పడు. ఆ రాక్షసుడి అసురత్వం పోగొట్టే పని జ్ఞాన రాశి అయిన సుబ్రహ్మణ్యుడు చూసుకుంటాడని శివుడు -రుకుంటాడు.
ఇక్కడ స్వామి పళని కొండ మీద పిల్లవాడిగా ఉన్నాడు. ఇడుంబన్‌ దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరికి వచ్చే సరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి కాసేపు కింద పెట్టి సేదతీరుతాడు. కాసేపటి తర్వాత కావిడి ఎత్తుకుందామని కిందికి వంగి కావిడి భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి, రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒక వైపు ఎక్కువ బరువు, ఇంకో వైపు తేలికవుతోంది. ఎంతసేపటికీ రెండువైపులా సమానం కాదు. దీంతో ఇక విసుగొచ్చిన అతడు కావడి పైకి చూస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లాడి రూపంలో పకపక నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఏమిటానవ్వు నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను అని అంటాడు. అయినా స్వామి వారు నవ్వుతూనే ఉంటారు. నిన్ను చంపేస్తాను అంటూ కొండమీదికి పరుగెత్తుతాడు.
తెలిసో తెలియకో పరుగెత్తి కొండ మీదకి పాదచారియై వెళ్తాడు. ఈ సమయంలోనే స్వామి వారు అతడిని రెండు గుద్దులు గుద్దుతారు. అప్పుడు ‘ఓ జగద్రక్షకా తెలుసుకోలేకపోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను నాకు వరం ఇవ్వండి’ అంటాడు. ఏ వరం కావాలో కోరుకోమంటే ‘ స్వామీ నేను ఈ పళనిలోనే కదా కావిడి ఎత్తలేకపోయాను. ఈ కావిడి వల్లనే కదా నేను మిమ్మల్ని చూడగలిగాను. ఈ కావిడే కదా మిమ్మల్ని చేరడానికి మార్గమైంది.. అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధన చెయ్యకపోయినా, ఒక్కసారి కావిడి పాలతో కాని, విభూతితో కాని, పూలతో, తేనెతో, నేతితో కాని భుజం మీద పెట్టుకొని పాదచారులై వస్తే అటువంటి వారికి నీ ఆరాధన చేసిన ఫలితం అందివ్వాలి అని కోరుకుంటాడు. అప్పుడు స్వామి వారు నీ కోరికను కటాక్షిస్తున్నాను. అలాగే నాదగ్గరకు వచ్చే భక్తులు ఇకపై ముందుగా నీ దర్శనం చేసుకునే నా వద్దకు వస్తారని వరమిస్తారు. అందుకే స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబడి మూర్తి ఉంటాడు. అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే సుబ్రహ్మణ్యున్ని దర్శనం చేసుకుంటారు.
ఆలయం చేరే మార్గం
ఈ క్షేత్రం దిండుగల్‌ జిల్లాలో మదురైకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానం ద్వారా హైదరాబాద్‌ నుంచి మదురైకి చేరుకుని అక్కడ్నుంచిరోడ్డు, రైలు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు.
రైలు ద్వారా చెన్నై సెంట్రల్‌, లేదా మదురై చేరుకోవాలి. మదురై నుంచి కోయంబత్తూర్‌ వెళ్లే రైళ్లు పొల్లాచ్చి మీదుగా, పళని రైల్వేస్టేషన్‌ నుంచే వెళ్తాయి. చెన్నై సెంట్రల్‌- పళని ఎక్స్‌ప్రెస్‌ తిరుచెందూర్‌ నుంచి మదురై మీదుగా పళని చేరుతుంది.
అక్కడి నుంచి ఆలయం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వేస్టేషన్‌ నుంచి దేవాలయానికి ఆటో, బస్సు సౌకర్యం ఉంది.