header

Bundar Laddu ….బందరు లడ్డు

Bundar Laddu ….బందరు లడ్డు

బందర్ లడ్డూకి 77 సంవత్సరాల చరిత్ర ఉంది. తీయని ఈ అచ్చతెలుగు వంటకం గురించి.....
దిల్లీ సుల్తానుల కాలంలో మహారాష్ట్ర - మధ్యప్రదేశ్‌ సరిహద్దున ఉండే బుందేల్‌ఖండ్‌ ప్రాంతం నుంచి మచిలీపట్నంలోని బందరుకు వలస వచ్చిన బొందిలీలు ఈ లడ్డు తయారీ ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు.
ఇలా వలసవచ్చిన వారిలో బొందిలి రాంసింగ్‌ కుటుంబం మొదటి సారి ఈ లడ్డుని తయారు చేసిందట. మొదట్లో సన్నకారప్పూసని తయారుచేసిన ఆ కుటుంబం.. ఆ పూసని బెల్లంపాకంతో కలిపి తొక్కి లడ్డూలని తయారుచేసి తొక్కుడు లడ్లు చేశారని తయారీదారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి అమెరికా, లండన్‌తోపాటు ఐరోపా దేశాలకు ఏటా పదివేల కిలోల లడ్డు ఎగుమతి అవుతోంది.
సాధారణంగా మిఠాయి అంటే పంచదారనే వినియోగిస్తుంటారు. అయితే ఇక్కడ లడ్డుతో పాటు ఇతర మిఠాయిల్లోనూ బెల్లం మాత్రమే వినియోగించడం ప్రత్యేకత. యంత్రాల వాడకం పెరిగినా.. ఇప్పటికీ ఇక్కడి లడ్డూలను చేత్తో మాత్రమే తయారు చేస్తారు. సెనగపిండి, బెల్లం, నెయ్యి మిశ్రమాలను ప్రధానంగా వినియోగిస్తారు. సెనగపిండి, నీరు కలిపిన మిశ్రమాన్ని నూనెలో వేయించి మొదట పూస తయారు చేస్తారు. పూసను బెల్లం పాకంతో కలిపి రోటిలో వేసి రోకలితో తొక్కుతారు. అనంతరం లడ్డూ తయారీ చేస్తారు. ఈ పని మొత్తం తయారీదారుడి పర్యవేక్షణలోనే జరుగుతుంది.
బందరులోని లడ్డు తయారీదారులు నాణ్యతతో రాజీపడకుండా దాని ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆ కారణంగానే బందరు లడ్డుకి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. బందరులోని బృందావన్‌ మాన్యుఫాక్చురర్‌ అసోసియేషన్‌కు భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌-జీఐ) వచ్చిందంటే దానికి ప్రధాన కారణం దాని యజమాని మల్లయ్యే.