కారం చట్నీ, బొంబాయి చట్నీ, పప్పుల పొడి దోసెతో కలిసి చేసే రుచుల అద్భుతమే కడప కారందోసె..
కడప వన్టౌన్ ఈ దోసెలను ప్రాచుర్యంలోకి తెచ్చింది. బియ్యం, మినపపప్పుతో పాటు కొద్దిగా జీలకర్ర, సెనగపప్పు, మెంతులు, అన్నం కూడా వేసి ఎనిమిది గంటల పాటు నానబెట్టి ఈ పిండిని రుబ్బుతారు. ఇక తక్కిన వాటి కోసం ముందుగా... పుట్నాల పప్పు( వేయించిన సెనగపప్పుని) పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
సెనగపిండి చట్నీ దీన్నే బొంబాయి చట్నీ అంటారు. దీన్ని చేయడానికి పోపుదినుసులు.. జీలకర్ర, ఆవాలు, అల్లం తురుము, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి కావాలి. నూనెలో వీటిని వేయించుకుని ఇందులో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై సెనగపిండి కలిపిన చిక్కని నీళ్లను ఇందులో వేస్తే క్షణాల్లో బొంబాయి చట్నీ సిద్ధం. ఇక.. కారం చట్నీ. ఇందుకు.. ఉల్లిపాయలు, కారం, ఉప్పు వేసి వీటిని రోట్లో దంచుకోవడమే. పెనంపై దోసె వేసుకుని దీనిని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఆపై కారం చట్నీ, బొంబాయి చట్నీలని పూయాలి. ఆపై పుట్నాల పప్పు పొడిని వేసి వేడివేడిగా కడప కారందోసె తినేయడమే. కడపలో వీధివీధికి ఈ కారెం దోసె దుకాణాలున్నా... వన్టౌన్లో వేసే దోసెలు చాలా ఫేమస్.
కొన్ని దుకాణాలు అయితే.. నలభై, యాభై ఏళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్వంటి నగరాల్లో కూడా ఈ కారెందోసెలు దొరుకుతున్నాయి.