సమోసా అంటే ఆలూనేగా గుర్తుకొచ్చేది. చీరాలలో మాత్రం షేక్ మునీర్ తయారుచేసే తీపి సమోసాలే గుర్తుకొస్తాయి. పెళ్లిళ్లకీ, ప్రత్యేక సందర్భాలకీ కూడా తీపి సమోసానే ముందు వరుసలో ఉంటుంది. మునీర్ ఒంగోలులోనే ఉన్నా అతను తయారుచేసిన ఈ తీపి సమోసా మాత్రం అమెరికా, జపాన్, జర్మనీ, లండన్, మలేషియా తదితర ప్రాంతాలకు వెళ్లిపోయి ఆహా ఏమి రుచి అనిపిస్తోంది. కేవలం తీయగా ఉండటం మాత్రమే ఈ సమోసా ప్రత్యేకం కాదు... దీన్నిండా జీడిపప్పు ఉండి పలుకుపలుకులో ప్రత్యేకమైన రుచితో నిండి ఉంటుంది. మునీర్‌కు మాత్రమే సాధ్యమైన ఈ వంటకం పూర్వపరాలేంటో తెలుసుకుందాం.
వాస్తవానికి మునీర్ పండ్ల వ్యాపారి. అద్దంకి బస్టాండు దగ్గర పండ్లు అమ్మేవాడు. అక్కడ పెద్దగా లాభాలు లేకపోవడంతో చీరాల వెళ్లి సమోసాల వ్యాపారం ప్రారంభించాడు. ఇక్కడా పోటీనే ఎదురయ్యింది. ఏ ప్రత్యేకతా లేకపోవడంతో వ్యాపారం తగ్గింది. కానీ నలుగురు పిల్లలు వాళ్ల పోషణా అతన్ని కొత్తగా ఏదో ఒకటి చేయాలనే దిశగా ప్రేరేపించాయి. తన పాకశాలనే ప్రయోగశాలగా మార్చుకున్నాడు. నెల రోజులు ఇంటి గడపదాటకుండా ప్రయోగాలు చేశాడు. అలా తయారయ్యింది.. తీపి సమోసా. జీడిపప్పు బాగా దట్టించి రుచికరంగా తయారు చేశాడు. చుట్టూ ఉన్న వాళ్లకూ, కుటుంబ సభ్యులకు రుచి చూపించాడు. బాగున్నాయని చెప్పడంతో దీన్నే వ్యాపారంగా ఎంచుకున్నాడు.
అది వ్యాపార రహస్యం...!
తీపి సమోసా ఎలా తయారు చేశాడనేది బయటకు చెబుతాడు, కానీ దీనిలో ఏం కలిపాడో మాత్రం ఆయన బయటపెట్టరు. అది వ్యాపార రహస్యమంటాడు. పైభాగంలో మైదాపిండి... లోపల వివిధ రకాల తీపి పదార్థాలతో పాటూ 25 గ్రాముల వరకూ జీడిపప్పు ఉంటుంది. నూనెలో వేయించిన తర్వాత సమోసాలను బెల్లం పాకంతో నానబెట్టి తీస్తారు. అమెరికా, జపాన్, జర్మనీ, లండన్, మలేషియా తదితర ప్రాంతాలకు వీటిని తీసుకువెళ్తుంటారు. పట్టణంలో అమ్మకానికి రూ. 30ల రకం, అదే శుభకార్యాలకూ, విదేశాలకు పంపించాలంటే జీడిపప్పు ఎక్కువ వేసి రూ. 40 రకం తయారు చేస్తుంటారు. తీపి మునీర్ తన పిల్లలను మంచి చదువులు చదివించాడు.అతను వ్యాపారం ప్రారంభించిన మొదట్లో కిలో జీడిపప్పు రూ. 60 ఉండేది. ఇప్పుడు జీడిపప్పూ, వనస్పతీ, బెల్లం అన్నీ ధరలు పెరిగాయి. జీడిపప్పు కిలో రూ. 800కి చేరింది. అందుకే ఇప్పుడు తీపి సమోసా ఒక్కటీ రూ. 30 అయ్యింది. ఇంత ఖరీదుకు అమ్మడం అంటే బాధే. కానీ ఇది కూడా లాభాపేక్ష కోసం కాదు. నా ప్రత్యేకత కోసమే దీన్ని కొనసాగిస్తున్నా అంటున్నారు మునీర్.
మానెం శ్రీనివాసరావు సౌజన్యంతో... ఈనాడు డిజిటల్, ఒంగోలు