header

Spansaveria

స్వచ్ఛమైన గాలిని అందించే సాన్సవేరియా..

ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని పెరిగే మొక్కల్లో సాన్సవేరియాది ప్రథమ స్థానం.
అశ్రద్ధ చేసినా చక్కగా పెరిగి ప్రత్యేకంగా కనబడటం దీని స్వభావం. దీన్నే ‘స్నేక్‌ ప్లాంట్‌’ అని, ‘మదర్‌-ఇన్‌-లా’స్‌ టంగ్‌ అనీ అంటారు. దీన్ని తెలుగులో చాగ అనీ పిలుస్తారు. సాన్సవేరియా అన్నదే ఎక్కువ వాడుకలో ఉన్న పేరు. దీనిలో అనేక రకాలున్నాయి. ఆకులు సన్నగా, పొడుగాటి బద్దల్లా ఉండేవి (సాన్సవేరియా ట్రైఫాసియేటా, సాన్సవేరియా లారెంటి), గుండ్రంగా ట్యూబుల్లా ఉండేవి (సాన్సవేరియా సిలిండ్రికా) పొట్టిగా, గుత్తుల్లా ఉండే (సాన్సవేరియా హనీ) రకాలూ ఉన్నాయి.
ఆకులు మందంగా, బిరుసుగా, నున్నగా మెరుస్తూ ఉంటాయి. తెలుపు, పసుపు రంగు మచ్చలతో, అంచులతో ఉంటాయి. ఈ మొక్కను అందమైన ఆకుల కోసమే పెంచినప్పటికీ, పరిస్థితులు అనువుగా ఉంటే సుకుమారమైన తెలుపు, మీగడ రంగుల్లో పూలు పూస్తాయి. సన్నని కాడ చివర గుత్తుల్లా పూస్తాయివి.
గుంపులుగా పెంచుకోవచ్చు... సాన్సవేరియా సిలిండ్రికా పూలు గులాబీ రంగులో ఉంటాయి. ఇది ఇంట్లో అమర్చుకోవడానికి అనువైన మొక్క. వేడీ, వెలుతురు తక్కువగా ఉన్నా తట్టుకోగలుగుతుంది. అందమైన కుండీల్లో నాటుకుంటే చూడముచ్చటగా ఉంటుంది. సాన్సవేరియా హనీ గుమ్మటంలా ఉండి టేబుల్‌ మీద పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. రాక్‌ గార్డెన్‌లలోకే కాకుండా వేరే మొక్కలతో కలిపి గుంపుగా నాటుకోవడానికి కూడా సాన్సవేరియా బాగుంటుంది.
టెర్రేనియమ్‌లలోనూ, మినియేచర్‌ గార్డెన్‌లలోనూ, ట్రేగార్డెన్‌లలోనూ పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎక్కువ కాలం ఎలాంటి సమస్యలు లేకుండా మనగలగడం కూడా ఇందుకు కారణమే. వీటి ఆకుల్లో నీరు ఉండటం వల్ల బరువుగా కనిపిస్తాయి. కనుక నాటేప్పుడే మట్టిమిశ్రమం మొక్కను పడిపోకుండా ఆపగలిగేలా ఉండేలా చూసుకోవాలి.
మట్టిలో ఇసుకపాళ్లు తక్కువ, మట్టి ఎక్కువ ఉండేట్లు చూసుకోవాలి. ఈ మొక్కకు తరచూ నీళ్లు పోయనక్కర్లేదు. చీడపీడలేవీ దాదాపు ఆశించవు. నీళ్లు ఎక్కువై వేళ్లు కుళ్లిపోతే తప్ప ఈ మొక్క అంత త్వరగా దెబ్బతినదు కూడా. మూడు, నాలుగు నెలలకోసారి కొద్దిగా ఎన్‌పీకే ఉండే ఎరువుని వేస్తే చాలు
పది మొక్కల్లో ఇది ఒకటి... సాన్సవేరియా మొక్కకు పరిసరాల్లోని గాలిని శుభ్రపరిచే శక్తి అమోఘం. నాసా సంస్థ ఇంట్లో పెంచుకోవడానికి అనువుగా ఉండే మొక్కలంటూ సూచించిన మొదటి పదిలో ఇది కూడా ఒకటి. సాన్సవేరియాకు రాత్రి పూట కూడా వాతావరణంలోని కార్బన్‌ డైఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేసే అరుదైన లక్షణం ఉంది.
ఈ మొక్కను మీ పడకగదిలో అమర్చుకుంటే గాలిలో ఆక్సిజన్‌ శాతం పెరిగి హాయిగా, ప్రశాంతంగా నిద్రపోగలరన్నమాట. మరి వెంటనే ఓ రెండు సాన్సవేరియా మొక్కలు తెచ్చుకోండి. పిలకల్ని విడదీసిగానీ, ఆకు కత్తిరింపుల ద్వారా గానీ ఈ మొక్కను సులభంగా ప్రవర్థనం చేయవచ్చు
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....