పసిడివర్ణంలో, సున్నితంగా కనిపించే చెర్రీపూల వంటి ఆకర్షణీయమైన పూలతో ఆకట్టుకునే అందమైన లత ఆర్కిడ్ తీగ. దీని పూలు ఆన్సిడియమ్ ఆర్కిడ్ పూలను పోలి ఉండటంతో దీన్ని ఆర్కిడ్ తీగ అంటారు. అలాగే పూల వర్ణాన్ని బట్టి గోల్డెన్ వైన్ అనీ, అమెజాన్ ప్రాంతంలో ఎక్కువగా పెరగడం వల్ల అమెజాన్ వైన్ అనీ, పూల రెక్కల ఆకారాన్ని బట్టి బటర్‌ఫ్లై వైన్ అని కూడా అంటారు. ఈ ఆర్కిడ్ తీగ శాస్త్రీయనామం స్టిగ్మాఫైలాస్ సీవియేటమ్.
పదిహేను అడుగుల ఎత్తులో... ఆర్కిడ్ తీగ ఎనిమిది నుంచి పదిహేను అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. ఇది వేగంగా పెరిగే లత. ఎప్పుడూ పచ్చని ఆకులతో నిండి ఉండే ఈ తీగ వర్షాకాలంలోనూ, శీతాకాలంలోనూ కూడా అందమైన పూలతో కనువిందు చేస్తుంది. ఈ పూలు కొమ్మల చివర గుత్తుల్లో పూస్తాయి. సీతాకోక చిలుకలనూ, తేనెటీగలనూ, హమ్మింగ్ పిట్టలనూ అన్నింటినీ ఆకట్టుకోగల ముచ్చటైన మొక్కల్లో ఇదీ ఒకటి. దీని అండాకారపు లేతాకుపచ్చ ఆకులు, బంగారు రంగులోని సుకుమారమైన పూలు కలిసి ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. దీని ఆకుల అంచులు ఒకలాంటి నూగుతో ప్రత్యేకంగా ఉంటాయి. ఐదు రేకలతో ఉండే దీని నాజుకైనా పూలు ఎండబెట్టి గ్రీటింగ్ కార్డుల వంటివి తయారు చేయడానికి బాగుంటాయి.
తక్కువ శ్రద్ధ చూపించినా... పూర్తి ఎండలో పెరిగే ఈ ఆర్కిడ్ తీగ కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది. కూడా. ఇది నీరు నిలవని సారవంతమైన మట్టి మిశ్రమంలో చక్కగా పెరుగుతుంది. దీనికి క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి. వాడేసిన కాఫీ నీళ్లు పోయడం అవసరం. వాడేసిన కాఫీ పొడి, టీ పొడి వంటివి మట్టి మిశ్రమంలో కలిపితే ఈ తీగకు మంచిది. ఆర్కిడ్ తీగ తక్కువ శ్రద్ధతో పెరిగే లత. దీనికి చీడపీడలు పెద్దగా ఆశించవు. నెలకోసారి ఎన్‌పీకే వంటి సమగ్ర ఎరువుని 17:17:17 లేదా 19:19:19 నిష్పత్తిలో నీటిలో నానబెట్టి పోస్తుంటే ఆరోగ్యంగా పెరుగుతంది. కంచెల మీద, పెరగోలా మీద అల్లించుకోవడానికి ఈ లత చాలా అనువుగా ఉంటుంది. దేన్నైనా కనబడకుండా అడ్డుగా త్వరగా కప్పేయడానికి వాడే తీగల్లో ఇది కూడా ముఖ్యమైనది. అల్లుకోవడానికి సరైన ఆధారం కల్పిస్తే కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కొమ్మ కత్తిరింపుల ద్వారానూ, నేలంట్ల ద్వారానూ, విత్తనాల ద్వారానూ కూడా ఈ తీగను సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. నగరాల్లోని వాతావరణ కాలుష్యాన్ని తట్టుకుని పెరగగలిగే సామర్థ్యం ఉన్న చక్కని లత ఇది. ఎక్కువకాలం బతుకుతుంది కూడా.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....