ఇదొక ప్రత్యేకమైన చెట్టు. దీని ఆకుల మీద నొక్కి పెట్టి ఏదైనా రాసినా, సంతకం చేసినా అది ఆ ఆకు రాలిపోయే వరకూ అలాగే ఉండిపోతుంది. ఈ ఆకులు కూడా మందంగా, తోలులాగా ఉండి ఎక్కువ రోజులపాటు రాలిపోకుండా అలాగే ఉండి పోతాయి. అవి అండాకారంలో, ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి.
ఆటోగ్రాఫ్ చెట్టును బాల్సిమ్‌ఫిగ్ అనీ, పిచ్ ఆపిల్ అనీ కూడా అంటారు. దీని శాస్త్రీయనామం క్లూసియారోజియా. కింద వరకూ ఉండే కొమ్మలతో ఈ చెట్టు చూడ్డానికి కృతిమ మొక్కలాగా అనిపిస్తుంది. ఇది దాదాపు పదిహేను నుంచి ఇరవై అడుగుల ఎత్తువరకూ కూడా పెరగగలదు. దీన్ని కత్తిరించి కావలసిన సైజులో పెంచుకోవచ్చు. దీని పూలు ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఉండి రెండు నుంచి మూడు అంగుళాల వెడల్పులో తెలుపు లేదా లేత గులాబీ రంగులో అందంగా ఉంటాయి. దీని కాయలు లేతాకుపచ్చ రంగులో దాదాపు మూడు అంగుళాల వ్యాసంతో ఉండి, ఎండి పగిలినప్పుడు ఎర్రని గింజలతో మనోహరంగా ఉంటాయి. ఈ గింజలు పిట్టలకు చాలా ప్రీతి పాత్రమైన ఆహారం. ఈ గింజల చుట్టూ జిగురులా ఉండే పదార్థాన్ని ఒకప్పుడు పడవల్లో పగుళ్లను పూడ్చడానికి వాడేవారట. అందువల్ల దీన్ని పిచ్ యాపిల్ అన్న పేరు వచ్చింది.
అన్నింటా అందంగా...
ఆటోగ్రాఫ్ చెట్టు పూర్తి ఎండలోనే కాకుండా కొద్దిపాటి నీడలో కూడా చక్కగా పెరుగుతుంది. మొదట్లో క్రమం తప్పకుండా నీళ్లు పోయడం అవసరమే. అయినా బాగా కుదురుకున్న తరవాత నీటి ఎద్దడిని చాలావరకూ తట్టుకుంటుంది. ఇది అన్ని రకాల నేలల్లోనూ పెరగగలదు. కానీ నీరు నిలవని తేలికపాటి మట్టి మిశ్రమం బాగా అనువుగా ఉంటుంది. సముద్ర తీరాల్లో కూడా చక్కగా పెరగగలిగే మొక్క ఇది. సాధారణ రకంతో పాటు మీగడ రంగు వరిగేషన్‌తో ఉండే రకం, చిన్న సైజు ఆకులతో పొట్టిగా పెరిగే నానారకం కూడా కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇంటి తోటకైనా, పార్కులూ, పెద్ద పెద్ద తోటలకైనా అందాన్ని, ప్రత్యేకతను ఇచ్చే మొక్క ఇది
ఏడాది పొడవునా....
ఆటోగ్రాఫ్ చెట్టు సంవత్సరమంతా అడపాదడపా పూస్తూనే ఉంటుంది. చీడపీడల ప్రమాదం దాదాపు లేనట్లే. త్వరగా రాలని ఆకులతో ఉండటంతో శ్రద్ధతో పెరిగే మొక్క కావడంతో బోర్డరుగా కూడా చాలా బాగుంటుంది. కుండీలో పెంచుకుని ప్రత్యేక మొక్కగా అమర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేగంగా పెరిగే మొక్క కనుక ఏడాదికోసారి కుండీలోకి మార్చుకోవడం మంచిది. వాతావరణం నుంచి రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేయగలశక్తి ఉన్న మొక్క. అందువల్ల కుండీలో పెంచుకుని పడకగదిలో పెట్టుకుంటే మంచిది. దీనికి రెండు నెలలకోసారి సేంద్రియ ఎరువుని కానీ, ఎన్‌పీకే ఉన్న సమగ్ర రసాయన ఎరువుని కానీ ఇస్తుంటే ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఈ చెట్టు పూలకు, గింజల చుట్టూ ఉండే జిగురుకు ఔషధ లక్షణాలున్నాయంట. కొమ్మ కత్తిరింపులతో ఈ మొక్కను సులువగా ప్రవర్థనం చేయవచ్చు. ఇది అన్ని నర్సరీల్లోనూ దొరుకుతుంది.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....