header

Babies Breeeth Flowers / బేబీస్‌ బ్రీత్‌’

Babies Breeeth Flowers / ‘బేబీస్‌ బ్రీత్‌’

చిన్ని చిన్ని సుకుమారమైన పూలు వందల్లో, సన్న సన్నని రెమ్మల చివర్లో విరిసి వెలుగుతూ ఉంటే, అంతకు మించిన మనోహర దృశ్యం ఏముంటుంది? తరచూ ధవళవర్ణంలో, కొంచెం అరుదుగా గులాబీ ఛాయలో రాశిలా కుప్పపోసినట్లు కాకుండా, నక్షత్రాల్లా పరుచుకొని, కళ్లనూ, మనసునూ తమవైపు లాక్కునే బుల్లి దేవదూతలు జిప్సోఫైలాపూలు.
జిప్సోఫైలాను ‘బేబీస్‌ బ్రీత్‌’ అంటారు. నిజంగా అంత సున్నితంగానూ, అంత నాజూగ్గానూ ఉంటాయివి. జిప్సోఫైలాలో బహువార్షికాలు - జిప్సోఫైలా పానిక్యులేటా, ఏకవార్షికాలు- జిప్సోఫైలా రిపెన్స్‌ ఉన్నాయి. అడుగు నుంచి అడుగున్నర ఎత్తు మాత్రమే ఉండే పొట్టి రకాలూ, మూడు అడుగుల ఎత్తువరకూ పెరిగే సాధారణ రకాలూ ఉన్నాయి. అలాగే ఒకే రెక్కతో పాటు ముద్ద రకాలూ ఉన్నాయి. తోటకొక విధమైన సున్నితత్వాన్నీ, ఆహ్లాదాన్నీ తెచ్చేమొక్క ఇది. డైసీ, యాస్టర్‌, సాల్వియా, కాలండ్యులా, జినియా వంటి అన్నిరకాల సీజనల్‌ మొక్కల మధ్యా సులువుగా, ముచ్చటగా ఇమిడిపోయే అందమైన మొక్క ఇది. పుష్పగుచ్ఛాల్లోకీ, వాజుల్లోకీ, ఎండిన పూలుగా, విడిగానైనా, ఇతర పూలతో కలిపి.. ఇలా ఎలాగైనా వాడుకోవచ్చు. ఎలాంటి పూల అమరికల్లోనైనా ఫిల్లర్‌ అనగానే గుర్తుకొచ్చేది ఈ మొక్కే.
విశాలంగా వ్యాపిస్తాయి... జిప్సోఫైలాను పెంచడం చాలా సులభం. ఇది సున్నంపాళ్లు కలిసిన నేలలో బాగా పెరుగుతుంది. కనీసం ఆరుగంటలైనా మంచి వెలుతురు కావాలి. మట్టి మిశ్రమంలో వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువుల పాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలాగే కోడిగుడ్డు పెంకులు పొడిచేసి కలిపినా మంచిదే. నీళ్లు ఒకసారి బాగా పోశాక, మట్టి దాదాపు పూర్తిగా పొడిబారాకే మళ్లీ పోయాలి. మొక్క చిన్నగా ఉన్నప్పుడే వూతంగా ఒక కర్రను పాతడం కాకుండా రింగును అమర్చినట్లయితే కొమ్మలు అన్నివైపులా కూడా విశాలంగా వ్యాపించి పూలు బాగా పూస్తాయి. పూలు అయిపోయిన కాడలనూ, కొమ్మలనూ బాగా కిందకి కత్తిరిస్తే కొత్త చిగుళ్లు వచ్చి మళ్లీ బాగా పూస్తాయి. దీని ఆకులు సన్నగా, పొడుగ్గా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పొట్టి రకాలకు కుండీలు బాగుంటాయి. జిప్సోఫైలా వేళ్లు మరీలోతుగా కాకుండా పక్కలకు వ్యాపిస్తాయి కనుక వెడల్పాటి లోతు తక్కువ కుండీలు అనువుగా ఉంటాయి. వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ కూడా పూలతో నిండిపోయే ఈ మొక్క సీతాకోక చిలుకలను కూడా బాగా ఆకర్షిస్తుంది
నీళ్లు మరీ ఎక్కువైతే...
జిప్సోఫైలా నెలకోసారి 17:17:17 లేదా 19:19:19 వంటి ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరువును కొద్దికొద్దిగా వేస్తుంటే బాగా పెరుగుతుంది. అయితే మరీ ఎక్కువగా ఎరువులు వేసినా, నీళ్లు పోసినా పూలు సరిగా రావు. గాలి సరిగా ఆడేలా మొక్కల మధ్య ఎడం ఉంచుకుని, నీళ్లు ఎక్కువ కాకుండా జాగ్రత పడితే బూజు తెగుళ్లూ, వేరు కుళ్లూ వంటివి రాకుండా చూసుకోవచ్చు. మొక్క సరిగా ఎదగక, గిడసబారి ఉంటే ఒకటి రెండుసార్లు కొద్దిగా మెగ్నీషియం సల్ఫేటును మట్టి మిశ్రమంలో కలిపినా, నీళ్లలో కలిపి చల్లినా ఫలితం ఉంటుంది. జిప్సోఫైలాలో ఏకవార్షికాలను గింజలతోనూ, బహువార్షికాలను విత్తనాలూ ఇంకా కత్తిరింపులతోనూ ప్రవర్థనం చేయవచ్చు. నారు నాటుకోవడం కంటే గింజలు చల్లుకోవడమే దీనికి అనువుగా ఉంటుంది. కటింగుల ద్వారా వచ్చిన మొక్కలు త్వరగా పూస్తాయి. అరవిచ్చిన పూలతో ఉన్న కొమ్మలను కత్తిరించి, ఆకులు తీసేసి, చీకటి గదిలో గాలాడేలా చూసుకుని వేలాడదీస్తే వారం పది రోజుల్లోనే పూల అమరికలోకి ఎంచక్కని ఎండుపూల కొమ్మ సిద్ధంగా ఉంటుంది.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....