తమ తోట మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండాలీ, ప్రతి మొక్కా ప్రత్యేకంగా కనిపించాలి అనుకునే వారు బెలూన్ మొక్క ప్రయత్నించొచ్చు. నిండా చిన్న చిన్న బుడగలు కట్టినట్లు కనిపించే ఈ మొక్కను బెలూన్ బుష్, బిషప్స్ బాల్స్, స్వాన్ ప్లాంట్, హెయిరీ బాల్స్, ఫ్యామిలీ జ్యుయల్స్... ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క శాస్త్రీయ నామం ఎక్లిపియాస్ ఫైసోకార్పా లేదా గాంఫోకార్పస్ ఫైసో కార్పస్.
ఆఫ్రికాకు చెందినదైనా ఈ మొక్క ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. బెలూన్ ప్లాంట్ బహువార్షిక గుల్మం. నాలుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. చక్కటి వెలుతురులో పెరిగే ఈ మొక్క కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది. బెలూన్ ప్లాంట్‌కు తగు మాత్రం తేమ ఉండే నేలలు అనుకూలంగా ఉంటాయి. దీని ఆకులు సన్నగా, పొడుగ్గా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని పూలు చిన్నవిగా ఒక సెంటీ మీటరు వ్యాసంతో తెలుపు లేదా మీగడ రంగులో ఉంటాయి. ఇవి 4-5 కలిసి చిన్న చిన్న గుత్తుల్లా పూస్తాయి. మరీ అందంగా కాకపోయినా చక్కగానే ఉంటాయి. ఈ మొక్కలో ఆకట్టుకునేది దీని కాయలే. చిన్నపాటి బుడగల్లా ఉంటాయి. వీటి మీద ముదురాకుపచ్చ రంగులో ఉండే మెత్తని ముళ్ల లాంటి రోమాలుంటాయి. ఈ కాయల్లో తేలికగా, పట్టుకుచ్చులా ఉండే నూగుతో కప్పబడిన గింజలుంటాయి. కాయలు పగిలినప్పుడు ఈ గింజలు గాల్లో సులభంగా వ్యాపిస్తాయి.
ఏడాదంతా పూస్తుంది.. :
బెలూన్ ప్లాంట్‌ను కుండీలో లేదా నేలలో పెంచుకోవచ్చు. మట్టి మిశ్రమం సారవంతంగా ఉండేలా చూసుకోవాలి. గింజలను 24 గంటలు నానబెట్టి నాటుకుంటే సులువుగా మొలకెత్తుతాయి. సాధారణంగా వారం రోజుల్లోపే మొలుస్తాయి. కొమ్మ కత్తిరింపులు కూడా సులువుగానే వేళ్లూనుకుంటాయి. మన ప్రాంతంలో దాదాపు సంవత్సరం పొడవునా పూసే ఈ మొక్క బటర్‌ఫ్లై గార్డెన్లలో తప్పనిసరిగా ఉండాలి. బెలూన్ ప్లాంట్ కొమ్మలు చేవదేరి ఉండవు కాబట్టి వాటిని తుంచి గుబురుగా పెరిగేలా చూసుకోవాలి. అయినా ఎక్కువ పెరిగినప్పుడు వంగిపోయి అందంగా అనిపించదు. అందుకని రెండేళ్లకొకసారి కొత్త మొక్కలు నాటుకుంటే బాగుంటుంది. దీనికి చీడపీడలు పెద్దగా ఆశించవు. అప్పుడప్పుడూ ఆకు కషాయాలు చల్లితే సరిపోతుంది. రెండు మూడు నెలలకోసారి 19:19:19 సమగ్ర ఎరువును కొద్దిగా వేస్తుంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.
పాలు ప్రమాదం :
ఈ మొక్కను లాన్‌లో పక్కగా నాటుకున్నా, కుండీలో పెంచుకుని బాల్కనీలో వెలుతురు పడేలా అమర్చుకున్నా అతిథుల దృష్టిని ఇట్టే ఆకట్టుకుంటుంది. కాయలతో ఉన్న కొమ్మలను ఇతర ఆకులూ, పూలతో పాటు ఫ్లవర్‌వాజులో అమర్చి చూడండి ఎంత బాగుంటుందో! బెలూన్ ప్లాంట్ మంచి ఔషధ మొక్క కూడా. దీని ఆకుల రసాన్ని చిన్నపిల్లల్లో వచ్చే జలుబూ, కడుపు నొప్పికి మందుగా వాడతారు. అయితే ఆకులూ, కొమ్మలను తుంచితే వచ్చే పాలు కళ్లలో పడితే ప్రమాదం. అందుకే ఈ మొక్కను పసిపిల్లలకు దూరంగా ఉంచాలి.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....