పొట్టిగా, గుబురుగా పెరిగే గ్రౌండ్‌కవర్ కావాలనుకున్నప్పుడు చక్కని ఎంపిక రియో. దీని శాస్త్రీయనామం రియో డిస్కలర్ లేదా రియో స్పాధేషియా లేదా ట్రాడెస్‌కాన్షియా స్పాధేషియా.
పూల ఆకారాన్నీ, అమరికను బట్టి రియోకు బోట్‌లీల్లీ అనీ, ఆయిస్టర్‌ప్లాంట్ అనీ, స్పైడర్‌వార్ట్ అనీ, క్రీస్ట్ ఇన్ ద క్రాడిల్ అనీ రకరకాల పేర్లున్నాయి. రియో బహువార్షికం.. దుంపల ద్వారా పెరుగుతుంది. దీని ఎత్తు ఆరు నుంచి ఎనిమిది అంగుళాల వరకూ ఉంటుంది. బద్దల్లాగా ఉండే ఆకులు మైనం వంటి పొరతో కప్పి ఉంటాయి. ఇవి లిల్లీ ఆకుల్లా కింద నుంచి గుబురుగా వరుసల్లో వస్తాయి. ఈ ఆకుల పైభాగం మెరిసే ముదురాకుపచ్చ రంగులోనూ కింది భాగం వూదారంగులోనూ ఉంటుంది.
రియో ట్రైకలర్ రకం.. లేతవర్ణాల్లో తెలుపు, లేత గులాబీ, లేతాకుపచ్చల సమ్మిళితంగా ఎంతో మనోహరంగా ఉంటుంది. ఇది సాధారణ రియో కన్నా పొట్టిగా ఉంటుంది.
పడవ ఆకారంలో ఆకులు:
రియోలో పూలు ఆకు గ్రీవాల నుంచి వస్తాయి. ఇవి చిన్నగా, తెల్లగా ఉండి వూదారంగులో, పడవ ఆకారంలో రూపాంతరం చెందిన ఆకుల్లో అమరి ఉంటాయి. ఈ పూలు ఏడాదంతా పూస్తూనే ఉంటాయి. రియో ఎండలోనూ, కొద్దిపాటి నీడలోనే కాకుండా పూర్తినీడలో కూడా పెరుగుతుంది. ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది. మట్టిమిశ్రమం పొడిగా, నీరు నిలవనిదై ఉండాలి. వారానికోసారి నీళ్లుపోస్తే చాలు. ఇది రాళ్లమధ్యా, గోడ పగుళ్లలో కూడా చక్కగా పెరగగలదు.
ఇంట్లో అమర్చుకోవడానికి కూడా అనువైన మొక్క ఇది. నెమ్మదిగానే పెరుగుతుంది గానీ, పిలకలు త్వరత్వరగా రావడం వల్ల సులభంగా వ్యాపిస్తుంది. అందువల్ల ఇతర మొక్కలకు అడ్డురాకుండా జాగ్రత్త పడాలి. రియో గ్రౌండ్‌కవర్‌గానే కాకుండా పొట్టి బార్డరుగానూ, రాళ్లమధ్య ఇతర చోట్ల గుంపులుగా నాటడానికీ, కొన్ని సక్యులెంట్‌లు, కాక్టస్, పెడలాంధస్ వంటివాటితో కలిపి మిశ్రమ అమరికల్లో నాటుకోవడానికీ బాగుంటుంది.
పిల్లలకు దూరంగా: రియోకు పెద్దగా ఎరువులు అవసరం లేదు. చీడపీడలు కూడా పెద్దగా ఆశించవు. అయితే నీరు ఎక్కువయినా, మరీ తరచుగా నీళ్లుపోసినా వేరు కుళ్లూ, ఆకుమచ్చ ఆశించే ప్రమాదం ఉంది. ట్రైకలర్ వంటి రకాలకు మాత్రం నేల లోపలి పొరల్లో కూడా పూర్తిగా పొడిబారకుండా చూసుకోవాలి.
అలాగే ఈ రకాలకు వెలుతురు కూడా సాధారణ రకాలకంటే కొంచెం ఎక్కువ కావాలి. రియో మొక్క విషపూరితం కనుక పసిపిల్లలకూ, పెంపుడు జంతువులకూ దూరంగా ఉంచాలి. అయితే సింగపూర్, థాయ్‌లాండ్, ఫిలిప్ఫైన్స్ వంటి దేశాల్లో దీని ఆకులూ, పూలను ఔషధాలుగా వాడతారు. పిలకలూ, విత్తనాల ద్వారా రియోను సులువుగా ప్రవర్థనం చేయవచ్చు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....