header

Butterfly Zinger…పరిమళ భరితం.. బటర్ ఫ్లై జింజర్

Butterfly Zinger…పరిమళ భరితం...బటర్ ఫ్లై జింజర్

అందమైన పూలతో పాటు అద్భుతమైన సువాసనను కోరుకునే వారికి ఇంకో చక్కని ఎంపిక బటర్ఫ్లై జింజర్. దక్షిణాసియా దేశాలు దీని జన్మస్థానాలు. దీన్ని గార్లెండ్ లిల్లీ, వైట్ జింజర్ లిల్లీ అని కూడా అంటారు. దీని పేరులోని జింజర్... ఇది అల్లం కుటుంబానికి చెందినదనీ, బటర్ఫ్లై పూల ఆకారాన్ని సూచిస్తుంది. దీని శాస్త్రీయ నామం హెడీబియమ్ కొరొనేరియమ్. హెడీబియమ్ అంటే గ్రీకుభాషలో ‘‘తీపి మంచు’’ అని అర్థం. వీటి పరిమళ భరితమైన తెల్లని పూలను ఈ పేరు సూచిస్తుంది.చూడటానికి మెట్టతామరలా అనిపించే ఈ మొక్కకు గాలిలో తేమ అధికంగా కావాలి. సారవంతమైన, నీరు నిలవనీ, తేమగా ఉండే నేలలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. కొద్దిపాటి నీడలో కూడా పెంచుకోవచ్చు.
సూర్యరశ్మి సూటిగా సోకకుండా ఉండే పెద్దపెద్ద చెట్ల నీడలో ఇది బాగా పెరుగుతుంది. నేల ఎప్పుడూ పొడిబారకూడదు. బటర్ఫ్లై జింజర్ పొడవుగా ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. దీని పూలు సున్నితమైన సువాసనతో ఉంటాయి. పూలు పూయడం అయిపోయిన కాడలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ఆకులను అలాగే ఉంచడం వల్ల దుంపలు బాగా పెరగడానికి వీలుంటుంది.
వేగంగా పెరుగుతుంది...
సాధారణంగా ఆకర్షణీయమైన, పరిమళభరితమైన పూల కోసమే ఈ మొక్కను పెంచినా, పొడవుగా, అందంగా పెరిగే ఆకుల్నీ తక్కువ చేయలేం. బటర్ఫ్లై జింజర్ను మెట్ట తామర, అలోకేషియా, బ్రుగ్మాన్షియా, హెమరోకాలిస్ లిల్లీలతో గానీ కలిపి నాటుకుంటే అందంగా ఉండటంతో పాటు అన్నిటికీ పెరిగే పరిస్థితులు ఒకే విధంగా ఉండటంతో అన్ని మొక్కలూ ఆరోగ్యంగా ఉంటాయి. దీన్ని కుండీలోనూ చక్కగా పెంచుకోవచ్చు. ఈ మొక్క పొడవుగా పెరుగుతుంది. కాబట్టి కొంచెం బరువైన కుండీని వాడితే పక్కకు పడిపోకుండా ఉంటుంది. కుండీని మనం కూర్చునే దగ్గర్లో అమర్చుకుంటే ఆహ్లాదరకరమైన వీటి పరిమళాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. ఈ మొక్క వేగంగా పెరుగుతుంది కాబట్టి కుండీ త్వరగా దుంపలతో నిండిపోతుంది. అందువల్ల ఒకటి రెండు సంవత్సరాలకోసారి కుండీ మార్చుకోవాలి.
ఔషధవిలువలు అపారం...
ఒకవంతు చొప్పున ఎర్రమట్టీ, వర్మి కంపోస్టూ, రెండు వంతుల కోకోపీట్, కొద్దిగా వేపపిండి కలిపిన మిశ్రమం ఈ మొక్కకు అనువుగా ఉంటుంది. పదిహేను రోజులకోసారి నీళ్లలో కరిగే పాలిఫీడ్ వంటి సమగ్ర ఎరువును లీటరు నీళ్లకు పదిగ్రాముల వంతున కలిపి పోస్తుండాలి. బటర్ఫ్లై జింజర్కు చీడపీడల భయం తక్కువ. రసం పీల్చే పురుగులను ఆకు కషాయాలను వాడి నివారించవచ్చు. అలాగే నీరు నిలవకుండా జాగ్రత్త పడితే దుంప కుళ్లిపోయే ప్రమాదం ఉండదు. బటర్ఫ్లై జింజర్ను ఇతర జింజిబరేసి మొక్కల తరహాలోనే సులువుగా , అలాగే విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు.
ఇది అల్లం, పసుపు కుటుంబానికి చెందినదే అయినా వంటల్లో వాడుకోవడానికి పనికి రాదు. కానీ దీని ఔషధ విలువలు అపారం. దీని అన్ని భాగాలూ ఉపయోగకరమైనవే. ఆయుర్వేదంలోనూ, చైనా మూలికా వైద్యంలోనూ మధుమేహానికీ, కీళ్లనొప్పులకూ, జ్వరాలూ, తలనొప్పులకూ దీన్ని మందుగా వాడతారు. టాన్సిల్స్కు, గొంతు నొప్పికీ, కడుపునొప్పికీ కూడా మంచి మందట. ఈ పూల నుంచి తీసిన నూనె ఎంతో విలువైనది. దీని పూలను ఆరోగ్యానికీ, అదృష్టానికీ ప్రతీకగా భావిస్తారు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....