ప్రకాశవంతమైన గులాబీ, ఎరుపు రంగుల మేళవింపులో పెద్ద పెద్ద పూలతో ప్రత్యేకంగా కనిపించే మనోహరమైన లత కాండీకింగ్. దీని శాస్త్రీయ నామం వెపోమియా బెరావియన్సిస్ లేదా స్టిక్టోకార్డియా బెరావియన్సిస్. ఇది మార్నింగ్ గ్లోరీకి దగ్గర బంధువు. దీన్ని హవాయ్ సన్ సెట్ అని, హవాయ్ బెల్స్ అనీ అంటారు. పేరులో హవాయ్ ఉన్నా ఇది ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందింది. దీని పూలరంగు హవాయ్ లో సూర్యాస్తమయంలో కనిపించే వర్గాల ప్రత్యేక సమ్మిళానాన్ని పోలి ఉండడంతో దీనికా పేరు వచ్చింది.
కాండీకింగ్ వేగంగా పెరిగే అందమైన తీగ. ఎలాంటి స్థలాన్నైనా ఇట్టే కప్పేస్తుంది. కంచెల మీదికి, పెరగోలాలు, అర్చిల మీదికి అల్లిస్తే చాలా బాగుంటుంది. నేలలోనే కాకుండా కుండీల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు. పూర్తి సూర్యకాంతిలోనే కాకుండా నీడలో కూడా పెరుగుతుంది.
అందువల్ల వరండాల్లో, బాల్కనీల్లో పెంచుకోవడానికి అనువైన లత ఇది. కాండీకింగ్ ఆకులు పెద్దవిగా, మొత్తగా, గుండె ఆకారంలో ఈనెలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకులు అందంగా ఉండి పూలు లేనప్పుడు కూడా ఈ తీగను ఆకర్షణీయంగా ఉంచుతాయి. నీడలో పెంచినప్పుడు పూలు తక్కువగా వస్తాయి. కానీ ఆకుల సైజు పెద్దగా వచ్చి మొక్క అడవితీగలా అందంగా ఉంటుంది.
కాండీకింగ్ పూలు ప్రకాశవంతంగా, నారింజరంగు కంఠంతో, క్రిస్మస్ ఎరుపు అంచులతో గరాటు ఆకారంలో పెద్దగా, అందంగా ఉంటాయి. ఈ లత సంవత్సరంలో రెండు సార్లు – డిసెంబర్-జనవరిలో ఒకసారి, ఆగస్టు-సెప్టెంబర్ లో ఒకసారి మాత్రమే పూసినా ఆ కొద్ది సమయం కోసం సంవత్సరమంతా ఆనందంగా ఎదురుచూడొచ్చనిపిస్తుంది. ఈ పూలు కొద్దిపాటి సువాసనతో ఉండి, విచ్చిన ఒకటి రెండు రోజులకు రాలిపోతాయి.
ఎరువులు మితంగా...
కాండీకింగ్ ఇసుకపాళ్లు ఎక్కువగా ఉండే నేలలో బాగా పెరుగుతుంది దీనికి క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి. దీన్ని అప్పుడప్పుడూ కత్తిరిస్తూ ఉంటే ఆకు గ్రీవాల నుంచి పూలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా కత్తిరించడం వల్ల ఈ లతను అడ్డదిడ్డంగా పెరగకుండా కుదురుగా ఉండేలా చూసుకోవచ్చు. కాండీకింగ్ కు ఎరువులు అంతగా అవసరం లేదు. నిజానికి ఎరువులు ఎక్కువైతే పూలు తగ్గడంతో పాటు, అతిగా పెరిగి ఆకర్షణ కోల్పోతుంది కూడా. నెలకోసారి 17:17:17 ఎన్ పీ కె వంటి సమగ్ర ఎరువును దాదాపు పదిగ్రాముల చొప్పున మట్టిలో కలుపుతూ ఉంటే సరిపోతుంది.
కాండీకింగ్ ను రసం పీల్చే పురుగులు ఆశించే ప్రమాదం ఎక్కువే. క్రమం తప్పకుండా ఆకు కషాయాలు చల్లుతూ ఉండాలి. దీన్ని ముదిరిన కటింగ్ ల ద్వారానూ, విత్తనాల ద్వారాను సులువుగా ప్రవర్ధనం చేయవచ్చు. విత్తనాలను ఇరవై నాలుగు గంటలపాటు నీళ్లలో నానబెట్టి నాటితే త్వరగా మెలకెత్తుతాయి. ప్రకాశవంతమైన పూలతో మురిపించే ఈ మొక్క సీతాకోక చిలుకలనూ తేనెటీగలనూ, హమ్మింగ్ పిట్టలను కూడా అంతే చక్కగా ఆకట్టుకుంటుంది.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....