header

celosia…..సీతమ్మ జడబంతి

celosia…..సీతమ్మ జడబంతి

celosia ప్రకాశవంతమైన రంగుల్లో, పట్టులాంటి మెరుపుతో, ఎక్కువకాలం నిలిచి ఉండే అందమైన పూలమొక్క సెలోషియా. దీన్ని సీతమ్మవారి జడబంతీ, కోడి తురాయి పూలూ, కాక్స్‌కూంబ్‌ అనీ అంటారు. సెలోషియా అంటే గ్రీకుభాషలో మండుతున్నది అని అర్థం. ప్రకాశవంతమైన ఈ పూలు నిజంగానే మంటను తలపిస్తాయి. అలాగే మృదువుగా పట్టుకుచ్చుల్లా ఉండే పూల వల్ల దీన్ని ‘పట్టు పూల మొక్క’ అని కూడా అంటారు.
సెలోషియాలో క్రిస్టేటా, ఫ్లూమోజా రకాలను ఎక్కువగా పెంచుతారు. క్రిస్టేటా రకం పూలు వెల్వెట్‌లాగా కెరటాల్లా మడిచినట్లు ముద్దగా ఉంటే... ఫ్లూమోజా రకం పూలు సన్నని ఈకల్లా పట్టుకుచ్చులా కొమ్మల చివరన కంకుల్లా పూస్తాయి. తోటకూర కుటుంబానికి చెందిన ఈ మొక్క అడుగునుంచి అడుగున్నర ఎత్తువరకూ పెరుగుతుంది. ఇంకా పొట్టిగా పెరిగే హైబ్రీడ్‌ రకాలు కూడా వచ్చాయి.
దీని కాండం మృదువుగా ఉంటుంది. లేతాకుపచ్చ ఆకులు ప్రస్ఫుటంగా కనిపించే ఎరుపు రంగు ఈనెలతో ఉంటాయి. సెలోషియా పూలు క్రిస్టేటా రకమైనా, ఫ్లూమోజా రకమైనా ప్రకాశవంతమైన ఎరుపూ, పసుపూ, నారింజ, గులాబీ, బచ్చలిపండు రంగుల్లో చాలా అందంగా కనిపిస్తాయి. ఎండిన తరవాత కూడా ఈ పూలు రంగునీ, ఆకారాన్నీ కోల్పోవు. అందువల్లే వీటిని తాజాగా ఉన్నప్పుడే కాకుండా ఎండినవాటిని కూడా ఫ్లవర్‌వాజుల్లోకి, బొకేల్లోకి ఉపయోగిస్తారు.
ఏడాది పొడవునా...
సెలోషియాను మడుల్లో, బోర్డరుగా, కుండీల్లోనూ కూడా పెంచుకోవచ్చు. విత్తనాలు నారు పోసుకుని ఆరు నుంచి ఎనిమిది అంగుళాల దూరంలో నాటుకోవాలి. ఐదు నుంచి ఆరు ఆకులు వచ్చాక నాటుకుంటే ఆరోగ్యంగా ఎదుగుతుంది. దీన్ని పెంచేందుకు పూర్తి ఎండకావాలి. అలాగే సారవంతమైన మట్టి దీనికి అవసరం. అయితే కాస్త తేమగా ఉన్న నీరునిలవని మట్టి మిశ్రమం దీనికి తప్పనిసరి. దీన్ని ఏడాది పొడవునా నాటుకుని పెంచుకోవచ్చు. నాటిన రెండు నెలలకు పూలు వస్తాయి.
ఈ పూలు దాదాపు రెండు నెలలపాటు అలాగే ఉంటాయి. మట్టిమిశ్రమంలో కంపోస్టు బాగా కలుపుకోవడంతో పాటు మొగ్గ తొడిగిన దగ్గర్నుంచీ వారానికోసారి ద్రవరూపంలో ఉన్న ఎన్‌పీకే ఉన్న సమగ్ర ఎరువును ఇస్తుంటే పూలు పెద్దవిగా వస్తాయి. ఈ మొక్కకు రసం పీల్చే పురుగులు నుంచి తప్ప మిగిలిన చీడపీడల ప్రమాదం తక్కువ. వేపనూనె, ఆకు కషాయాలు తరచూ చల్లుతూ ఉంటే ఇది పెద్ద సమస్యకాదు.
సెలోషియా విత్తనాలను కొన్కునేటప్పుడు ఒకే రంగు వాటికంటే మిశ్రమంగా దొరికే వాటిని కొనుక్కుంటే బాగుంటుంది. ఒకసారి నాటుకున్న తర్వాత ఆ కంకుల నుంచి విత్తనాలను తీసి వాడుకోవచ్చు గానీ హైబ్రీడ్‌ రకాలలో విత్తనాలు ఎక్కువగా తయారవ్వవు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....