header

Common Mugwort ….పరిమళాలు వెదజల్లే... మాచిపత్రి

Common Mugwort ….పరిమళాలు వెదజల్లే... మాచిపత్రి

ఇప్పుడు చాలామందికి తెలియదు కానీ చూడటానికి అచ్చం చామంతిలానే కనిపిస్తూ సువాసనతో ఉండే ఆకులూ, పూలు కలిపి ఊళ్లలో మాలలు కట్టుకునేవాళ్లు. ఆ మొక్కే మాచిపత్రి. ఇది దవనం జాతికి చెందింది. దీన్ని ‘కామన్ మగ్ వార్ట్’, ‘నాటీమేన్’, ‘సెయిలర్స్ టొబాకో’... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఆర్టిమీసియా వల్గారిస్.
సువాసనభరిత ఆకులు...
మాచిపత్రి సుమారు మూడేళ్లు బతుకుతుంది. ముదురు మొక్కలను తీసేసి పక్కన వచ్చే పిలకలను పెంచుకోవచ్చు. ఇది రెండు, మూడడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉండి కిందివైపు తెల్లని, సన్నని నూగుతో వెండి రంగులో సువాసనతో ఉంటాయి. పొడవాటి కంకుల్లో పూసే పూలు అంత ఆకర్షణీయంగా ఉండవు. పైగా పూత వచ్చాక ఆకుల్లో నూనెశాతం తగ్గుతుంది. అందువల్ల సువాసనతో పాటు ఔషధగుణాలూ తగ్గుతాయి. విత్తనాలు కావాలనుకుంటే తప్ప పూలకంకులను ముందే తుంచేయడం మంచిది. మాచిపత్రిని పెంచడం చాలా సులభం. ఎండపడే చోటు చూసి నాటుకుని క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటే చాలు. అన్ని నేలల్లోనూ ఈ మొక్క చక్కగా పెరుగుతుంది. దీనికి చీడపీడల ప్రమాదం పెద్దగా ఉండదు. ఎరువుల అవసరం కూడా అంతగా ఉండదు. మట్టి మిశ్రమంలో అప్పుడప్పుడూ వర్మికంపోస్టు లేదా పశువుల ఎరువును కలిపితే చాలు. ఎండలైపోగానే నేలబారుకు కత్తిరిస్తే వచ్చే కొత్త కొమ్మలు తాజాగా, అందంగా, సువాసనతో ఉంటాయి. సరిగా గాలి ఆడకపోయినా, నీడ ఎక్కువైనా ఆకుల మీద తెగుళ్లు రావచ్చు. అందుకే ఎండ పడేలా చూసుకుని మరీ గుబురుగా పెరగకుండా మధ్యలో కొన్ని పిలకలు తీసేస్తుంటే సరి.
ఔషధగుణాలు కూడా...
మాచిపత్రిని కుండీలో చక్కగా పెంచుకోవచ్చు. గుంపుగా లేదా ఇతర మొక్కలతో కలిపి నాటుకోవచ్చు. ఆకుల అడుగుభాగం వెండి రంగులో ఉండటంతో ఇతర రంగుల ఆకుల మొక్కలతో కలిపి నాటుకుంటే బాగుంటుంది. ఈ మొక్కల్ని కుండీల్లో పెంచుకుని లెమన్ గ్రాస్తో కలిపి బాల్కనీ, వరండాలో అమర్చుకుంటే దోమలనూ, ఇతర కీటకాలను రానివ్వవు. అలాగే మాచిపత్రికి పాములను నిలువరించే శక్తి ఉంది. ఫెన్సింగ్ పక్కనే వరుసగా నాటుకుంటే పాములు రావు. ఆరోగ్యానికీ...
మాచిపత్రి మంచి ఔషధ మొక్క కూడా. జ్వరం, ఒళ్లు నొప్పులూ, మూత్ర సంబంధ వ్యాధులకు ఇది మంచి మందు. చర్మ, కాలేయ సంబంధ వ్యాధులకూ, అజీర్తికి కూడా మందుగా వాడతారు. దీని ఆకులను వేడినీటిలో వేసుకుని స్నానం చేస్తే కీళ్ల, కాళ్లనొప్పులు కూడా తగ్గుతాయట. మాచిపత్రి ఆకులతో టీ చేసుకుని కూడా తాగుతారు. ఈ ఆకులను సువాసన కోసం వంటల్లో కూడా ఉపయోగిస్తారు. వాటిని దగ్గర ఉంచుకుంటే వడదెబ్బ తగలదంటారు. మాచిపత్రిని పెంచుకుంటే ఎలాంటి అనారోగ్యం, దురదృష్టం దరిచేరదని యూరోపియన్లు నమ్ముతారట. ఈ ఆకులను దిండుకింద పెట్టుకుని నిద్రపోతే మంచి కలలు వస్తాయని కూడా వారి విశ్వాసమట.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....