header

Drasina Fragrence

డ్రసీనా ఫ్రాగ్రెన్స్‌

స్వచ్ఛమైన గాలినిచ్చే సుగంధ డ్రసీనా
ఇంటి బయటే కాదు....లోపల అందాన్ని పెంచడంలోనూ మొక్కల పాత్ర కీలకమే. చక్కని సువాసన, కంటికింపైన నిండుదనంతో పాటు స్వచ్ఛమైన గాలినీ అందించే బహుళ ప్రయోజనాలు కొన్ని మొక్కల ప్రత్యేకం. అలాంటివాటిల్లో డ్రసీనా ఫ్రాగ్రెన్స్‌ మొదట ఉంటుంది.
ఇంటిలోపల, ఆఫీసుల్లోనూ చక్కగా అమర్చుకోవడానికి సులువుగా పెంచుకోగలిగిన మొక్క సుగంధ డ్రసీనా. దీన్నే కార్న్‌ప్లాంట్‌ అనీ అంటారు. అయితే దీని శాస్త్రీయ నామమైన డ్రసీనా ఫ్రాగ్రెన్స్‌నే ఎక్కువ వాడుకలో ఉంది. దీన్ని పెంచేందుకు కొంచెం శ్రద్ధ చూపిస్తే చాలుఅందమైన ఆకులతో పాటూ ఇంటిలోపల వాయు కాలుష్యాన్నీ హరించేస్తుంది. ఇది దాదాపు ఆరడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. రెండు మూడు కాండాలు, వేర్వేరు ఎత్తుల్లో పెరిగేలా చూసుకుంటే అందంగా కనబడుతుంది. దీని కాండం లేతగా ఉన్నప్పుడు లక్కీబాంబూలా కనిపించినా మొక్క ముదిరే కొద్దీ ఎండుకర్రలా అనిపిస్తుంది. ఆకులు కాండం చివర గుత్తిలా ఉంటాయి.
రకాలూ ఉన్నాయి.. పూర్తి ఆకుపచ్చగా ఉండే ఆకుల రకాల కన్నా బంగారు వర్ణపు చారలతో ఉండే రకాలు ఎక్కువ. ఆకుకి రెండు అంచులూ ఆకుపచ్చగా ఉండి మధ్యలో పసుపు వర్ణం కలిగి ఉండే ‘మసంజనా’ రకం, ఆకుపచ్చ, పసుపు మిశ్రమం చారల అంచులతో మధ్యలో ఆకుపచ్చ కలిగిన ‘లిండేని’రకం ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆకులను బొకేల్లోనూ, అలంకరణల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. జాగ్రత్తగా పెంచుకుంటే కొంచెం ముదిరిన మొక్క తెల్లని చిన్న చిన్న పూలతో అందంగా కనువిందు చేస్తుంది. దీన్ని కూడా బహుమానంగా ఇవ్వొచ్చు. వీటి పూల సువాసన చుట్టు పక్కల ప్రాంతాలను గుమ్మెత్తిస్తుంది. అయితే సాధారణంగా ఇంట్లో పెంచుకునే మొక్కల కంటే బయటి వాతావరణంలో పెరిగేవే ఎక్కువగా పుష్పిస్తాయి.
వెలుతురు ముఖ్యం... డ్రసీనా ఫ్రాగ్రెన్స్‌ ఎండ సూటిగా పడని ప్రదేశంలో చక్కగా పెరుగుతుంది. ఎండ ఎక్కువగా ఉంటే ఆకులు మాడిపోతాయి. అలాగని నీడ ఎక్కువైనా, వెలుతురు సరిగా పడకపోయినా ఆకులు వాటి ప్రకాశాన్ని కోల్పోయి నిర్జీవంగా అనిపిస్తాయి. వెలుతురు సరిగా పడనప్పుడు కృత్రిమ వెలుతురు ఏర్పాటు చేయాలి.
డ్రసీనా ఫ్రాగ్రెన్స్‌కు చీడపీడలు పెద్దగా ఆశించవు. సారవంతమైన తేలికపాటి మట్టి మిశ్రమంలో నాటి ఎముకల పొడి, కానుగ, ఆముదం పిండితో పాటు కంపోస్టు కలిపిన సేంద్రియ ఎరువుల మిశ్రమాన్ని అందించాలి. కుండీ లేదా పాదులోని పై రెండడుగుల మట్టిలో అప్పుడప్పుడూ కలిపితే సరిపోతుంది.
ఒకసారి నీళ్లు పెట్టాక పై మట్టి పూర్తిగా పొడిబారాకే మళ్లీ నీళ్లు పెట్టాలి. ఆకుల మీద అప్పుడప్పుడూ నీళ్లు చల్లుతూ ఉంటే తగినంత తేమ అంది మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని కాండం కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్థనం చేయవచ్చు. డ్రసీనా ఫ్రాగెన్స్‌ కూడా వాయు కాలుష్యాన్ని నివారించేందుకు నాసా సిఫారుసు చేసిన జాబితాలోని మొక్క.
ఇంటిలోపల ఫర్నిచరు, రూంహీటర్ల నుంచి వచ్చే బెంజీన్‌ను, ఫ్లైవుడ్‌, వంటగ్యాసు, డియో, షాంపూలు, పేపర్‌ న్యాప్‌కిన్‌ల నుంచి వచ్చే ఫార్మాల్డిహైడ్‌ను... జిగురులోనూ, పెయింట్‌ మరకల్ని తొలగించే రసాయనాల ద్వారా వ్యాపించే టీఎస్‌ఈ (ట్రైక్లోరో ఇథలీన్‌)ను బాగా పీల్చుకుని ఆరోగ్యకరమైన గాలిని మనకిస్తుంది. ఇంకెందుకాలస్యం.. ఇంటితోపాటు ఆఫీసులోకి కూడా రెండు ముక్కలు తెచ్చుకోండి.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....