నీలిరత్నాలు అరుదైన పూలు, పండ్లతో అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రత్యేకమైన అలంకరణ వృక్షం నీలి రత్నాలు. దీని శాస్ర్తీయనామం ఎలియో కార్పస్ అంగుష్టీ ఫోలియస్. ఇది రుద్రాక్ష జాతికి చెందినది. ఈ పూల అమరికను బట్టి లిల్లీ ఆఫ్ ద వ్యాలీ అని కూడా అంటారు.
నీలి రత్నాలు చక్కని ఆకృతిలో పెరిగే చిన్న చెట్లు. ఆకులు, పూలు, పండ్లు అన్నీ ముచ్చట గొలుపుతాయి. నీరు నిలిచే నేలల్లోనూ, రాతి నేలల్లోనూ తప్ప అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతాయి. పూర్తి ఎండతో పాటు, నీడలోనూ చక్కగా పెరుగుతాయి. వీటి ఆకులు మెరిసే ముదురాకుపచ్చ రంగులోనూ అడుగుభాగం లేత రంగులోనూ టాయి. వీటి పూలు కాడకు ఒక వరుసులో అమరి ఉంటాయి. అవి అంగుళం పొడవులో, మీగడ రంగులో తిరగేసిన కప్పు ఆకారంతో సన్నగా చీలినట్లు ఉండే అంచులతో చిన్న చిన్న అందమైన పరికిణీలు వేలాడుతున్నట్లు కనబడతాయి. అందుకే ఈ చెట్టుని దేవకన్యల పావడాలు అనికూడా అంటారు. వీటిల్లో లేత గులాబీ రంగులో పూసే రకాలు కూడా ఉన్నాయి.
ఇక ఈ చెట్టు ప్రత్యేకతలలో మరొకటి అండాకారపు అద్భుతమైన నీలిరంగు పళ్ళు. ఇవి చూడటానికి ఆలివ్ పళ్ళలాగా ఉంటాయి. ఎలియోకార్పస్ అంటే గ్రీకు భాషలో ఆలివ్ పండు అని అర్ధం. దీన్ని పెంచేందుకు పెద్దగా శ్రద్ధ అవసరం లేదు. ప్రత్యేకంగా ఎరువులు వేయాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు నేలలో వర్మీకం పోస్ట్ కలిపితే సరిపోతుంది. ఈ చెట్టకి చీడపీడలు పెద్దగా ఆశించవు. అప్పుడప్పుడూ వేప కషాయం చల్లుకుంటే సరిపోతుంది. దీన్ని తోటల్లో లాన్ మధ్యలోనే కాక పెద్ద తొట్లలో నాటుకుని వరండాలలో, బల్కనీలలో అమర్చకోవచ్చు. ఈ చెట్లు తక్కువ వెలుతురునూ పొడి వాతావరణాన్ని తట్టుకుంటుంది. దీనిని చక్కగా కత్తిరించి పొట్టిగా గుబురుగా పెంచుకోవచ్చు. దీని చిగుర్లు ఆకర్షణీయమైన గులాబీ రంగులో ముచ్చట గొలుపుతాయి. నీలిరత్నాలు సొగసైన సీతాకోక చిలుకలను తమ చుట్టూ తిప్పుకుంటే వీటి పళ్ళు ఎన్నో రకాల పక్షులకు మంచి ఆహారం. అంతే కాదు ఆస్ట్రేలియాలోని రీజెంట్ బోయర్ పక్షులు తమ గూళ్ళను అలంకరించేందుకు నీలి రంగు కోసం ఈ పళ్ళను సేకరిస్తాయట. అందమైన, అరుదైన ఈ చెట్టును హార్మోను హౌడరుని ఉపయోగించి కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు.
--- బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్ సౌజన్యంతో