header

Emerald Palm

ఎమరాల్డ్‌ పామ్‌

ఎమరాల్డ్‌ పామ్‌ …………. మొక్క ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉండాలి. ఎండ పడకపోయినా, తరచూ నీళ్లు పోయకపోయినా, పట్టించుకోకుండా వదిలేసినా.. చక్కగా పెరిగి అందంగా కనిపించాలి.. అని కోరుకునే వారికి అనువైంది ఎమరాల్డ్‌ పామ్‌.
పైన చెప్పిన లక్షణాలన్నీ ఈ మొక్కకు ఉంటాయి. నిజానికి ఇది పామ్‌ మొక్క కాదు. ఆకుల అమరిక, రంగుని బట్టి మాత్రమే దీనికా పేరు వచ్చింది. దీని శాస్త్రీయనామం జామియో కల్కస్‌ జామిఫోలియా. అందువల్ల దీన్ని జేడ్‌ ప్లాంట్‌ అని కూడా అంటారు. ఆఫ్రికాలోని జాంజిబార్‌ దీని జన్మస్థలం కావడం వల్ల దీన్ని జాంజిబార్‌ జెమ్‌ అని కూడా పిలుస్తారు. కార్యాలయాల్లోనూ, ఇళ్లల్లోనూ అలంకరణ మొక్కగా పెంచుకునేందుకు అనువైందిగా ఈ మొక్క ప్రాచుర్యంలోకి వచ్చింది గత ఇరవై ఏళ్ల నుంచే. చూడ్డానికి జామియా పామ్‌లాగే కనిపించినా పూర్తిగా భిన్నమైన మొక్క ఇది. ఫిలోడెండ్రాన్‌, స్పాథిఫైలమ్‌, అగ్లోనిమా- దీని జాతికి చెందినవే.
నిగనిగలాడే ఆకులు...
ఎమరాల్డ్‌ పామ్‌ ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఇది దుంపతో పెరుగుతుంది. ఆకులన్నీ ఒకే దగ్గర నుంచి వస్తాయి. ప్రత్యేకంగా కాండం ఉండదు. దీని ఆకులు ముదురాకు పచ్చరంగులో ప్రకాశవంతంగా, నూనె రాసినట్లు నున్నగా నిగనిగలాడుతూ ఉంటాయి. అందుకే చూడగానే ఇది కృత్రిమ మొక్కేమో అని భ్రమ కలుగుతుంది.
ఇ ది ఇండోర్‌ మొక్కలా నెమ్మదిగా పెరుగుతుంది. ఎన్ని రోజులైనా సరే! దాని స్థలంలో అది ఒద్దికగా ఉంటుందే తప్ప దేనికీ అడ్డురాదు. ఆకుల్లో, కాడల్లో నీరు నిల్వ ఉంచుకుంటుంది. ఒకటి రెండు నెలల పాటు నీళ్లు పోయకపోయినా కూడా తట్టుకోగలుగుతుంది. ఒకసారి వచ్చిన ఆకులు దాదాపు ఆరునెలలు రాలిపోకుండా అలాగే ఉంటాయి. ఇది ఎలాంటి మట్టి మిశ్రమంలోనైనా చక్కగా పెరుగుతుంది. నీళ్లు నిలవకుండా చూసుకుంటే చాలు. ఎండ సూటిగా పడకుండా ప్రకాశవంతమైన వెలుతురు ఉండే చోటు దీనికి అత్యంత అనుకూలం.
చీడపీడలు తక్కువే...
ఎమరాల్డ్‌ పామ్‌కు చీడపీడలు ఆశించే సమస్య దాదాపు తక్కువే. నెలకోసారి 19:19:19 చొప్పున ఎన్‌పీకే ఉండే నీటిలో కరిగే సమగ్ర ఎరువును తక్కువ మోతాదులో కానీ, వర్మివాష్‌ని గానీ పోస్తూ ఉంటే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. దీనిని ఆకు కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్థనం చేయవచ్చు. అయితే ఆకు నుంచి మొక్క తయారవడానికి సుమారు ఒక సంవత్సరం పడుతుంది.
ఎమరాల్డ్‌ పామ్‌కు ఔషధ గుణాలు ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో దీని ఆకులను, వేర్లను చెవిపోటుకి, అల్సర్లకు మందుగా వాడతారు. అంతేకాదు, హానికారక రసాయనాలను తొలగించి గాలిని పరిశుభ్రం చేయగల శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. మరి ఇంట్లోనో, ఆఫీసులోనో పెంచుకోవడానికి ఇంతకంటే మంచి మొక్క ఉంటుందా?
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....