header

epicia

ఎపీసియా...అందమైన ప్రకాశవంతమైన పూలతో.....
ఆరు అంగుళాలకు మించని ఎత్తులో అందమైన ఆకులతో ప్రకాశవంతమైన పూలతో ఆకట్టుకునే మొక్క ఎపీసియా. ఈ మొక్క ఆఫ్రికన్ కుటుంబానికి చెందినది దీనిలో ఎన్నో తెగలున్నా ఎపీసియా కుప్రియేటా, ఎపీసియా రిస్టాన్స్ ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. ఎపీసియాను ఫ్లేమ్ వయోలెట్ అనీ, కార్పెట్ ప్లాంట్ అనీ అంటారు. ఎపీసియా బహువార్షికం. నీడలో పెరిగే మొక్క. వెలుతురు కావాలి కానీ సూటిగా ఎండను తట్టుకోలేని సుకుమారమైన మొక్క ఇది. దీని పేరు కూడా గ్రీకు బాషలోని ఎపీసియోస్ అన్న పదం నుంచి వచ్చింది. దీనికి నీడలో అని అర్ధం. దీని ఆకులు కొంచెం మందంగా, మృదువుగా ఉండి పైభాగమంతా రంగు రంగుల ఈనెలు అల్లకున్నట్లు ప్రకాశవంతమైన వర్ణాల మేళవింపుతో అద్భుతంగా ఉంటాయి. ఎన్నెన్నో వర్ణాలు.... ఆకుపచ్చలోని వివిధ వన్నెల కలయుకతో రాగివర్ణంలో, వెండి రంగులో, చారికలతో ఈ చిన్నమొక్క కళ్లు తిప్పుకోనివ్వదు. ఆకులే కాకుండా ఎపీసియా పూలు కూడా ఆకర్షణీయమైనవే. ప్రకాశవంతమైన కాషాయం, ఎరుపు రంగులో రెండు నుంచి నాలుగు చిన్న చిన్న పూలు పొడవాటి కాడ చివర వస్తాయి. వీటిలో గులాబీ, నారింజ, తెలుపు, వర్ణాలు కూడా అరుదేమీ కాదు. ఇది సంవత్సరం పొడవునా పూస్తుంది. ఎపీసియా నేలలో సాగే కాండం ద్వారా పెరిగే మొక్క. మంచి మట్టి మిశ్రమం, నీడ ఉంటే సులువుగా అల్లుకుపోతుంది. అందుకే దీన్ని కార్పెట్ ప్లాంట్ అంటారు. చెట్లకింద పొదలు, రాళ్లమధ్య గ్రౌండ్ కవర్ గా నాటుకోవడానికి ఎంతో బాగుంటుంది. అలాగే వేలాడే తొట్లలోకి కూడా చాలా అనువుగా ఉంటుంది. ఈ ఆకులకుండే ఒకలాంటి లోహపు మెరుపు, తక్కువ ఎత్తు పెరిగే లక్షణం వీటిని మిశ్రమ అమరికల్లో కూడా అందంగా ఒదిగేలా చేస్తాయి. వెలుతురు అవసరం..... ఎపీసియాలకు నీరు నిలవని తేమ ఉండే సారవంతమైన మట్టి మిశ్రమం అవసరం. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి. కోకోపిట్, ఇసుక, పెర్లైట్ ఉండే మిశ్రమం దీనికి అనువుగా ఉంటుంది. పదిహేను రోజులకోకసారి రెండువంతుల పొటాషియం నైట్రేటు, ఒక వంతు ఎన్ పీ కె 17:17:17 కలిపిన మిశ్రమాన్ని ఐదు గ్రాములకు మించకుండా వేస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. సేంద్రియ ఎరువులు వాడాలనుకున్నప్పుడు వర్మీకం పోస్టుతో పాటు కుళ్లిన ఆకులు, వాడేసిన టీ లేదా కాఫీ బూడిద వంటివి అప్పుడప్పుడు మట్టి మిశ్రమంలో కలుపుతూ ఉండాలి. ఆకు కషాయాలు నెలకోసారి చల్లుతూ ఉంటే చీడపీడల బెడద అసలు ఉండదు. ఎపీసియా వేళ్లు త్వరగా పక్కకు వ్యాపిస్తాయి. కనుక లోతు తక్కువ, వెడల్పుగా ఉండే కుండీలు బాగా అనువుగా ఉంటాయి. దీన్ని ఇంట్లో పెంచుకునేటప్పుడు కిటికీ దగ్గరగా అమర్చుకుంటే తగినంత వెలుతురు అందుతుంది. వెలుతురు తక్కువయితే పూలు సరిగా రావు. మూడేళ్లకోసారి.... పీసియా ఆకు అంచులు ఎండిపోతున్నా, పూలు విచ్చుకోకుండానే రాలిపోతున్నా గాల్లో తగినంత తేమ లేదని అర్ధం. అలాంటప్పుడు కుండీ అడుగున ట్రేలో రాళ్లువేసి వాటిని తడుపుతూ ఉండాలి. ఆకులపై నీళ్లు పిచికారీ చేయడం ఈ మొక్కకు సరిపడదు. అలాచేస్తే ఆకులమీద మచ్చలు రావడమే కాకుండా త్వరగా కుళ్లిపోయి చనిపోతుంది కూడా. రెండు మూడేళ్లకోసారి ముదురు మొక్కలను తీసివేసి మళ్లీ లేతమొక్కలను నాటుకుంటే తాజాగా, అందంగా పెరుగుతాయి. కుదురును విడదీసి గానీ, కొమ్మలను నాటిగానీ సులువుగా ప్రవర్ధనం చేయవచ్చు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....