header


Firespike......అగ్నిశిఖ
firespike అగ్నిశిఖ మెరిసే నిండాకుపచ్చరంగులో సున్నితమైన పెద్ద పెద్ద ఆకులతో ప్రకాశవంతమైన పండుమిరప ఎరుపు రంగులో కంకుల్లో పూసే గొట్టాలాంటి సన్నని పూలతో లాంటి స్థలాన్నైనా వర్ణభరితం చేయగల మొక్కలే అగ్నిశిఖ ఒకటి. దీని శాస్త్రీయనామం బడాంటోనియా లాంగిఫోలియం లేదా జస్టీషియా ట్యూబిఫార్మస్ . దీన్ని ఫైర్ స్పైక్ అని, స్కార్లెట్ ఫ్లేమ్ అనికూడా అంటారు.
అగ్నశిఖ లేత కొమ్మలతో మూడు నుంచి నాలుగు అడుగల ఎత్తువరకు పెరిగే బహువార్షికం. సరైన మట్టిమిశ్రమంలో ఒకసారి నాటితే తర్వాత అట్టే పట్టించుకోనవసరం లేని మొక్క ఇది. కంపోస్టు లేదా పశువుల ఎరువు ఎక్కుగా ఉండే సారవంతమైన నీరు నిలవని మట్టి మిశ్రమంలో ఇది బాగా పెరుగుతుంది. నీటి ఎద్దడిని తట్టుకున్నా కొంచెం తేమ ఉంటే దీనికి సరిపోతుంది. వేగంగా పెరిగే ఈ మొక్క సూటిగా ఎండపడనిచోట చక్కగా పెరుగుతుంది.
పెద్ద పెద్ద తొటల్లో చెట్లకింద గుంపుగాను, బోర్డరుగానూ పెంచుకోవడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. కుండీల్లో ఇతర మొక్కలతో కలిపి నాటుకుంటే చాలాబాగుంటుంది. బోర్డరుగా నాటుకునేటప్పుడు రెండేసి అడుగుల దూరంతో ఉండేలా చూసుకుంటే రెండుమూడు సంవత్సరాల్లో ఆకుపచ్చని గోడలాగా పెరిగి ప్రకాశవంతమైన ఎర్రని పూలతో అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి నేలయినా.....
అగ్నిశిఖ దాదాపు ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది. వర్షాకాలం, చలికాలం అంతా పూస్తూనే ఉంటుంది. ఒక సారి పూస్తే ఈ పూలు ఎక్కువకాలం తాజాగా నిలిచి ఉంటాయి. నీడను తట్టుకునే మొక్కల్లో ఇంత నిండురంగుల్లో పూలుపూసే మొక్కలు సాధారణంగా అరుదు. ఈ పూల కంకులను ఫ్లవర్ వాజులలో కూడా చక్కగా అమర్చుకోవచ్చు. ఇది వేగంగా పెరుగుతుంది. కనుక ఇతరమొక్కల మీద ఆధిక్యత ప్రదర్శించకుండా దీన్ని అదుపులో ఉంచడం తప్పనిసరి. క్రమం తప్పకుండా తేలిగ్గా గానీ, సంవత్సరానికి రెండు మూడుసార్లు బాగా కిందకి కత్తిరిస్తూ ఉంటే ఒక క్రమపద్ధతిలో పెరిగి అందంగా ఉంటుంది. అంతేకాదు. ఈ మొక్కకు పూలు కొమ్మల చివర్లలో, ఆకు గ్రేవాల్లో రావటం వల్ల కత్తిరిస్తే ఉంటే ఒక ఎక్కువపూలు పూస్తాయి.
చీడపీడలు అంతగా ఆశించని ఈ మొక్కకు ఆకుకషాయాలు అప్పడప్పుడూ చల్లుతూ ఉంటే రసం పీల్చే పురుగులు కూడా పెద్దగా నష్టం కలిగించలేవు. పూలు పూసే సమయంలో వర్మీవాష్ వంటి సేంద్రీయ ఎరువులు నెలకోసారి చల్లుతూ ఉంటే పూలు విపరీతంగా వస్తాయి. పూలు పూయడం మొదలెట్టగానే అద్భుతంగా మారిపోతుంది. ఆకుపచ్చని నిండు ఎరుపులతో ప్రకాశవంతమైన వర్ణ మిశ్రమంతో ప్రత్యేకంగా కనిపించడంతో పాటు సీతాకోక చిలుకలు, హమ్మింగ్ పిట్టలు, తేనెటీగల సందడితో ఒక్కసారిగా పరిసరాలను సమ్మోహనం చేస్తుంది. అలాగే బట్టర్ ఫ్లై గార్డెన్లలలో నాటటానికి ఈ మొక్క ఒక మంచి ఎంపిక.
సులువుగా పెంచగలిగిన ఈ మొక్క ప్రవర్ధనానికి కూడా కష్టపడక్కరలేదు. కొమ్మ కత్తిరింపులను నాటినా, కుదురును విడదీసి నాటినా మరుసటి సంవత్సరానికే పూలతో మీ తోటకు రంగులు వేసేందుకు సంసిద్ధమైపోతుంది.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...