Flaming Sword .......ఫ్లేమింగ్ స్వోర్డ్ – కత్తిలాంటి పూలు
చూడ చక్కని ఆకృతి, ఆకట్టుకునే రంగుల్లో ఆకులు కొన్ని నెలల పాటు తాజాగా ఉండే పూలూ...ఫ్లేమింగ్ స్వోర్డ్ ప్రత్యేకతలు. బాల్కనీలూ, కిటికీలూ,మెట్ల దగ్గర పెంచుకునేందుకు అనువైన మొక్కలు ఇవి.
వీటిలో ఆకు, పువ్వులు,రంగులను బట్టి వందల రకాలున్నవి.ఎర్రని కత్తిలాంటి పుష్పగుచ్ఛం మొక్కకు పూయడం వల్ల ఈ పేరు వచ్చింది. ఇంటి లోపల పెంచుకోవటానికి అనువైనది. సుమారు రెండువందల యాభై రకాలలో లభించే ఈ మొక్క సహజంగా అడవులలో ఇతర మొక్కల మీద ఆధారపడి పెరుగుతుంది. ఇంట్లో పెంచేందుకు ప్రత్యేకమైన మట్టిని తయారు చేసుకోవాలి. మూడువంతుల కోక్ పిట్ కు రెండుపాళ్ళ చొప్పున వర్మీకం పోస్టు, ఎర్రమట్టి, సున్నం, ఇటుక ముక్కలు, ఒకవంతు వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీలో నింపుకోవాలి. ఎండిపోయన దుంగలో రంధ్రం చేసి దానిలో ఈ మొక్కను పెట్టి పెంచినా బాగా పెరుగుతుంది. కొత్తగానూ కనిపిస్తుంది.
నీళ్ళు తప్పనిసరి
ఫ్లేమింగ్ స్వోర్డ్ ను వెలుతురు బాగా ఉండి నేరుగా ఎండ పడని ప్రదేశంలో పెంచుకోవాలి. దీని ఆకులు గుత్తిలా ఉండి మధ్యలో గుంటలా ఉంటుంది. మొక్కకు అందించే నీళ్ళు మట్టిలో కాకుండా ఈ గుంటలోనే పోయాలి. ఎప్పుడూ గుంటలో కొద్దిగానైనా నీళ్లుండేలా చూసుకోవాలి. మట్టికి కొద్దిపాటి తేమ అవసరం మట్టి పూర్తిగా పొడిబారకుండా చూసుకోవాలి. గాలిలో తేమ ఎక్కువగా ఉంటే మంచిది.అందుకే దీన్ని ఇతర మొక్కల మధ్య ఉంచడమో లేక మధ్య మధ్యలో నీళ్లు చల్లుతుండడమో చేయాలి. ఈ మొక్కకు మరీ ఎక్కువగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు.నెలకోసారి పాలీఫీడ్ ను లీటరు నీటిలో ఎనిమిది నుండి పది గ్రాములు కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. దీనికి పిండి పురుగులూ, పొలుసు పురుగులు ఆశించవచ్చు. అలాంటప్పుడు వంటసోడాను నీళ్ళలో కలిపి గానీ, వెల్లుల్లి కషాయాన్ని గానీ చల్లాలి. ఈ ఆకుల మీద కొన్ని సార్లు గోధుమ రంగు మచ్చలు రావచ్చు. సమస్య నివారణకు మొక్క మధ్య గుంటలో నీళ్ళు ఉండేలా చూసుకోవాలి. ఆకుల మీద నీళ్ళు పిచికారీ చేయాలి. ఒకవేళ ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వస్తే ఎండ ఎక్కువైందని తెలుసుకొని వెంటనే నీడలోని మార్చాలి. నాటిన మూడు నుంచి ఐదేళ్ళపాటు పూలు రావు. కానీ ఒకసారి పూలు పూసాక కొన్ని నెలలపాటు తాజాగా టాయి. తరువాత చనిపోతుంది. ఈలోగా చిన్నచిన్న పిలకలు దాని చుట్టూ వస్తాయి. తల్లి మొక్క ఎత్తులో సగం ఉన్నప్పుడు పిలకలను వేరుచేసి నాటుకుంటే మంచిది. ఇది కొంచెం ప్రత్యేకంగా కనిపించే మొక్క కాబట్టి ధరకూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఏ అలంకరణ మొక్కనైనా అందమైన ఆకుల కోసమో లేదా చూడచక్కని పూలకోసమో పెంచాలనుకుంటారు. ఈ మొక్క విషయంలో ఇవి రెండూ ఒకదాన్ని మించి మరొకటి ఆకర్షిస్తాయి.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...