Fruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద సీతాకోక చిలుకలకు ప్రియనేస్తం...
స్వచ్ఛమైన లేత గులాబీ రంగు పూలతో విభిన్నంగా, మనోహరంగా కనిపించే పొద గులాబీ గరుడవర్థనం. దీన్ని గులాబీ కాప్సియా అనీ, బిళ్లగన్నేరు పొద అనీ అంటారు. దీని శాస్త్రీయనామం కాప్సియా ఫ్రూటీకోజా లేదా సెర్బెరా ఫ్రూట్‌కోజా.
గులాబీ గరుడవర్థనం నెమ్మదిగా పెరిగే పెద్దపొద. సుమారు పది అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. గుబురుగా కాకుండా వ్యాపించినట్లుండే కొమ్మలతో ఉంటుంది. దీని ఆకులు కోలగా, లేతాకుపచ్చరంగులో ప్రస్ఫుటంగా కనిపించే ఈనెలతో ఉంటాయి. దీని పూలు లేత గులాబీ రంగులో ఐదురెక్కలతో, ముదురు గులాబీ కంఠంతో నాజూగ్గా ఉంటాయి. ఇవి గరుడవర్థనాలను, బిళ్లగన్నేరు(వింకారోజియా)పూలను తలపించడమే కాదు. చిన్న సైజులో ఉన్న స్వర్ణగన్నేరు (ఫ్లుమేరియా) పూలా అని భ్రమింపచేస్తాయి కూడా.
వెలుతురు కావాలి...
గులాబీ గరుడ వర్థనానికి సారవంతమైన మట్టి మిశ్రమం కావాలి. నేల ఎప్పుడూ తేమగా ఉంటే ఈ మొక్క అంత ఆనందంగా ఉంటుంది. నీరు సరిగా లేకున్నా సర్దుకుపోతుంది కూడా. ఎక్కువగా కత్తిరించడాన్ని ఈ మొక్క ఇష్టపడదు. అలా చేస్తే గిడసబారిపోయి బలహీనంగానూ, వికారంగానూ తయారవడమే కాదు, పూలు పూయడం కూడా బాగా తగ్గిపోతుంది. దీనికి సూర్యకాంతి కూడా ఎక్కువే కావాలి. కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది గానీ రోజులో సగంసేపైనా వెలుతురు సరిగా సోకకపోతే పూలు సరిగారావు.
ఏడాదంతా పూస్తుంది...
కొమ్మల చివరన వదులుగా ఉండే చిన్న చిన్న గుత్తుల్లో పూసే ఈ మొక్క సంవత్సరమంతా పూస్తూనే ఉంటుంది. గులాబీ గరుడవర్థనం గుంపుల్లో నాటుకోవడానికి చాలా బాగుంటుంది. కుండీలోనూ దీన్ని చక్కగా పెంచుకోవచ్చు. దీన్ని గొంగళి పురుగుల వంటివి తప్ప మరీ ఇబ్బంది పెట్టే చీడపీడలేవీ ఆశించవు. వాటిని కూడా వేపకషాయం అప్పుడప్పుడూ చల్లుతూ నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనికి రెండునెలలకోసారి ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరవును కొద్దిగా వేస్తుంటే సరిపోతుంది. వాడేసిన టీ పొడి, కాఫీ పొడి మట్టి మిశ్రమంలో కలిపితే మంచిది. దీన్ని విత్తనాల ద్వారానూ, కొమ్మంట్లు కత్తిరింపుల ద్వారానూ ప్రవర్థనం చేయవచ్చు. మరోవిషయం ఈ గులాబీ గరుడవర్థనం సీతాకోక చిలుకలకు కూడా ప్రియనేస్తమే!
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....