header

Fycus Ariculeta

ఏనుగు చెవుల ఆకులు ఆకర్షణీయం...

ఏనుగు చెవుల ఆకులు ఆకర్షణీయం... ఏనుగు చెవులను తలపింపజేసే పెద్ద పెద్ద ఆకులతో ఆకర్షణీయంగా ఉండే చిన్న చెట్టు ఇది. దీని శాస్త్రీయనామం ఫైకస్‌ ఆరిక్యులేటా లేదా ఫైక్‌ రాక్స్‌బర్ఘి. ఇది మర్రి జాతికి చెందినది.
ఏనుగు చెవుల మొక్క ఐదు నుంచి పది మీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది. గొడుగు ఆకారంలో దీని కొమ్మలు చక్కగా వ్యాపిస్తాయి. దీని అండాకారపు ఆకులు దాదాపు ఒకటిన్నర అడుగు సైజులో చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. ఈశాన్యభారతంలో ఎక్కువగా కనిపించే ఈ చెట్టు నేపాల్‌, చైనాల్లో సాధారణ వృక్షం. నేపాల్‌లో దీని ఆకులను పశువులకు దాణాగా వాడతారు. అందుకోసమే ఈ చెట్లను పెంచుతారు కూడా. దీని ఆకులను ప్లేట్లలా కూడా వాడతారు.
ప్రత్యేకంగా...అందంగా వేడిగా, తేమగా ఉండే వాతావరణం దీనికి అనుకూలం పొడిగాలులను తట్టుకోలేదు. నీటి ఎద్దడిని కూడా తట్టుకోలేదు. తేమగా ఉండే, నీరు నిలవని మట్టి మిశ్రమం దీనికి అనువుగా ఉంటుంది. కుళ్లిన ఆకులు, కంపోస్టు, కోకోపీట్‌ వంటివి మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. మన ప్రాంతంలో పెంచుకున్నప్పుడు ఆకుల సైజు మరీ అంత పెద్దగా రాకున్నా, ప్రత్యేకంగా, అందంగా కనబడుతుంది. పూర్తి ఎండతో పాటు నీడను కూడా తట్టుకుంటుంది. అందుకే తోటలో ఓ పక్కకు పెంచుకున్నా ముచ్చటగా ఉంటుంది.
వరండాలో, బాల్కనీలో పెంచుకున్నా బాగుంటుంది. అసలు దీన్ని హోటల్‌ లాబీల్లోనూ, పెద్ద పెద్ద గదుల్లోనూ అలంకరించడానికి ఎక్కువగా వాడతారు.
ఫలదీకరణ కందిరీగ ద్వారా... దీనిని ప్రూనింగ్‌ చేసుకుని కావలసిన సైజులో గుబురుగా పెంచుకోవచ్చు. దీని లేత ఆకులు ఎరుపు రంగులో ఉండి పెరిగే కొద్దీ ఆకుపచ్చగా మారతాయి. దీని పూలు ప్రస్ఫుటంగా కనబడవు. మూడు రకాల పూలు ఒక చిన్న కాయలాంటి దానిలో అమరి ఉంటాయి. ఫలదీకరణ ప్రత్యేక జాతికి చెందిన కందిరీగ ద్వారా జరుగుతుంది. ఆ జాతి కందిరీగ లేకపోతే ఫలదీకరణ జరగదు. గింజలు ఏర్పడవు. దీన్ని విత్తనాల ద్వారా, శీర్షకత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు.
అంజూరలా ఉండే దీని పళ్లను తినవచ్చు. వీటితో జ్యూస్‌లు, జామ్‌లు, కూరలు చేసుకుంటారు. సలాడ్లలో కూడా వాడతారు. ప్రత్యేకమైన మొక్కలను పెంచాలనుకునే వారికి ఇది చక్కని ఎంపిక. దీనికి చీడపీడలు పెద్దగా ఆశించవు. తగినంత నీరు, కంపోస్టు ఉంటే వేగంగా పెరుగుతుంది. అన్నట్లు దీనికి ఔషధ గుణాలు కూడా ఎక్కువే. ఈ పళ్లను మూత్ర సంబంధ వ్యాధులను తగ్గించడానికీ, జీర్ణక్రియ సరిగా జరగడానికీ వాడతారు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....