header

Fycus Krishna

ఫైకస్‌ కృష్ణ

ప్రత్యేకమైన, అరుదైన మొక్కలను పెంచాలనుకునేవారి సేకరణలో తప్పక ఉండాల్సిన మొక్క కృష్ణుడి వెన్నెల. దీనినే మక్కర్‌ కటోరీ అని, కృష్ణుడి మర్రి అని కూడా అంటారు.
మర్రి, రావి జాతికి చెందిన దీని శాస్త్రీయ నామం ఫైకస్‌ కృష్ణ. మన దేశంలో చాలా పార్కుల్లో, తోటల్లో దీనిని ప్రత్యేకమైన చెట్టుగా సంరక్షిస్తున్నారు. దిల్లీలోని వీర్‌ భూమిలో ఈ చెట్లను తోపులాగా పెంచారు.
ఈ కృష్ణుడి వెన్నగిన్నె చెట్టు ప్రత్యేకత అంతా దీని ఆకుల్లోనే ఉంది. ఇది వెనక్కి వంగి చిన్న దోనెల్లాగా మారి ఉంటాయి. కృష్ణునితో ఈ చెట్టుకు ఉన్న అనుబంధాన్ని గురించి పురాణాల్లో ఓ చక్కని కథ ఉంది. బాలకృష్ణుడు వెన్నను దొంగిలించి తింటూ తల్లి యశోద వచ్చే సరికి ఆమెకు కనబడకుండా వెన్నను ఈ చెట్టు ఆకులో చుట్టి దాచాడట. అప్పటి వరకు మామూలుగా ఉన్న ఆ చెట్టు ఆకులు ఆ నాటి నుంచి ఇలా గిన్నెలా మారిపోయాయట. అంతేకాదు.. కృష్ణుని చేతి వేడికి ఆకులోని వెన్న కరిగి కిందకి కారిందని..
అప్పటి నుంచి ఆ చెట్టు ఆకులను తుంచినట్లైతే కరిగిన వెన్నను తలపించేలా తెల్లని పాలు కారతాయని చెప్తారు. కృష్ణాష్టమి నాడు ఈ ఆకుల్లో వెన్నను పెట్టి అర్పిస్తే చిన్ని కృష్ణుడు పరవశుడు అవుతాడని నమ్మకం. వూడలతో మర్రిలాగానే పెరుగుతుంది కానీ మర్రి కంటే భిన్నమైన చెట్టు ఇది. ఈ మొక్కను సేకరించుకోవటమే కష్టం కానీ పెంచుకోవటానికి పెద్ద జాగ్రత్తలులేవీ అవసరం లేదు. ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది కూడా. ఫిబ్రవరి సమయంలో కొంతవరకు ఆకులు రాలిపోతాయి.
మళ్లీ మే నెల నుంచి కొత్త ఆకులతో కళకళలాడుతుంది. దీని కాయలు మర్రికాయల్లానే ఉన్నా చూట్టానికి కొద్దిగా నొక్కినట్లు ఉంటాయి. తోటలో ఎదురుగా కనబడేలా నాటుకున్నా.. కుండీలో పెంచి అమర్చుకున్నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆగి ఆసక్తితో వివరాలు అడిగే అరుదైన చెట్టు ఇది.
మర్రి రావిచెట్లులాగే పూర్తి ఎండలో మామూలు మట్టిలో పెద్దగా ఎరువులు, పురుగు మందులు అవసరం లేకుండా దీనిని పెంచుకోవచ్చు. ఇది పెద్దగా పెరిగే చెట్టు కనుక ఎక్కువ స్థలం లేనప్పుడు ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ చిన్నగా ఉంచుకోవచ్చు. కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....