ఎక్కువ శ్రద్ధ చూపనవసరం లేకుండా, ఎలాంటి నేలలోనైనా నీటి ఎద్దడిని కూడా తట్టుకుని మరీ పూల దుప్పటిని పరిచే చక్కని మొక్క గల్లార్డియా. దీన్నే బ్లాంకెట్ ఫ్లవర్ అనీ, ఇండియన్ బ్లాకెంట్ అనీ, ఫైర్వీల్ అనీ కూడా అంటారు.
సాధారణంగా తోటల్లో లేదా ఇంటి ముంగిళ్లలో పెంచుకునే గల్లార్డియా ఏకవార్షికం. దీని శాస్త్రీయనామం గల్లార్డియా పుల్చెల్లా లేదా గల్లార్డియా డ్రుమాండి. దీనిలోని ఇతర ముఖ్య రకాలు బహువార్షికాలు. గల్లార్డియా పుల్చెల్లా ఏకవార్షికమైనా ఏటా ప్రత్యేకంగా నారుపోసి నాటుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాధారణంగా ఒకసారి నాటితే విత్తనాలు పడి వాటంతటవే మళ్లీ మళ్లీ మొలుస్తుంటాయి.
రెండడుగుల ఎత్తులో... ఈ మొక్క రెండడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. మూడు అడుగుల వెడల్పు వరకూ వ్యాపిస్తుంది. నిలువుగా నేలమట్టం నుంచి పెరిగే నాలుగైదు కొమ్మలతో ఉండే ఈ మొక్క సన్నటి నూగుతో కప్పి ఉంటుంది. ఇది పూర్తిగా ఎండలో పెరుగుతుంది. ఏడాది పొడవునా నాటుకోవచ్చు. అన్ని రకాల నేలల్లో పెరిగినా ఇసుకపాళ్లు ఎక్కువగా ఉంటే అనుకూలం. దీని ఆకులు లేతాకుపచ్చ రంగులో సన్నగా, పొడవుగా రంపపు పళ్లు, లేదా నున్నని అంచులతో రకరకాలుగా ఉంటాయి. దీని పూలు ఆస్టర్ లేదా సన్ఫ్లవర్ పూలనుపోలి ప్రకాశవంతమైన వర్ణాల్లో పూలు ఉంటాయి. ప్రకృతిలో సహజంగా పెరిగే మొక్కల్లో ఒంటిరెక్క పూలు ఎక్కువగా ఉంటాయి కానీ వాణిజ్యపరంగా, తోటలో అందానికి పెంచుకునే మొక్కల పూలు ఎక్కువ రేకలతో ప్రకాశవంతంగా ఉంటాయి. వివిధ వర్ణాల్లో పరుచుకున్నట్లుంటే పూల సోయగం వల్ల బ్లాంకెట్ ఫ్లవర్ అన్నపేరు పూల ఆకారాన్నీ, వర్ణ సమ్మేళనాన్ని బట్టి ఫైర్వీల్ అన్నపేరు వచ్చాయి.
ఇతర మొక్కలతోనూ.. బోర్డరుగా నాటినా, గుంపుగా నాటినా గల్లార్డియా చాలా బాగుంటుంది. కారియోప్సిస్ సన్ఫ్లవర్, ప్లంబాగో, జిప్సోఫైలా వంటి పూల మొక్కలతో కానీ, ఫౌంటెన్గ్రాస్ వంటి ఆర్నమెంటల్ గడ్డిరకాలతో కానీ కలిపినాటితే అందంగా ఉంటుంది. నాటిన 70 నుంచి 75 రోజుల్లో ఇది పూయడం మొదలుపెడుతుంది. ఎండాకాలంలోనూ ఇది పూస్తుంది. ఎన్నో రకాల తేనెటీగలు ఈ మొక్కను ఆధారం చేసుకుంటాయి. దీనికి పెద్దగా ఎరువుల అవసరం లేదు. ఇళ్లలో పెంచుకునేటప్పుడు మాత్రం పదిహేను రోజులకోసారి పాలిఫీడ్ వంటి నీటిలో కలిపే సమగ్ర ఎరువును లీటరు నీటికి ఐదు గ్రాముల వంతున కలిపి పోస్తూ ఉంటే బాగా పూస్తుంది.
చీడపీడలు తక్కువ... గల్లార్డియాకు చీడపీడల భయం బాగా తక్కువ. ఆస్టర్ ఎల్లో తెగులు ఒకటి ఇబ్బంది పెడుతుంది. మొక్కలు గిడసబారి, పూలు రంగు సరిగా రాకుంటే ఈ తెగులు లక్షణాలుగా గమనించి అలాంటి మొక్కలను పీకి నాశనం చేయాలి. పూల విత్తనాలు అమ్మే దుకాణాల్లో ఈ విత్తనాలు సులువుగా దొరుకుతాయి. అన్నట్లు గల్లార్డియా పూలను కొన్ని చోట్ల అదృష్టానికి సంకేతంగా కూడా భావిస్తారట.
-బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....