header

Garden Balsum Flowers …. చిలకముక్కుపూలు

Garden Balsum Flowers …. చిలకముక్కుపూలు

celosia వర్షాకాలంలో మీ ఇంటి ముంగిలిని మనోహరమైన పూలతో వర్ణభరితం చేసే చక్కని ఏకవార్షికాల్లో చిలకముక్కుపూలు కూడా ఒకటి. దీన్ని శృంగార గన్నేరూ, కర్ణ కుండలాలు, గౌరీపూలు అని కూడా అంటారు. దీన్నే గార్డెన్‌ బాల్సమ్‌ అనీ, ఎక్కువగా గులాబీ వర్ణంలో పూయడంతో రోజ్‌ బాల్సమ్‌ అనీ, ముదిరిన కాయలు చేయి తగిలీ తగలకముందే పగిలి గింజల్ని వెదజల్లడంతో టచ్‌మీనాట్‌ అనీ పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఇంపేషన్స్‌ బాల్సామినా.
చిలకముక్కు పూలు ఎండలో పెరిగినా కొద్దిపాటి నీడ దీనికి మంచిది. ఇది అడుగు నుంచి రెండడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. నీరు నిలవని, గుల్లగా ఉండే సారవంతమైన మట్టి మిశ్రమంలో చక్కగా పెరుగుతుంది. దీని ఆకులు లేతాకుపచ్చరంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పూలు తెలుపూ, ఎరుపూ, నారింజ, పసుపు, వూదా, గులాబీ వంటి వర్ణాల్లో కనువిందు చేస్తాయి. అలాగే రెండు రంగుల కలయికతో పూసే కొత్త రకాలూ ఉన్నాయి. దీనిలో ఒంటి రెక్క పూలు కంటే ముద్ద రకాలు అందంగా కనిపిస్తాయి. చిన్న చిన్న గులాబీల్లా సుకుమారంగా ముద్దుగా కనువిందు చేస్తాయి. కాండం చుట్టూ అమర్చినట్లుండే ఈ పూలు సున్నితంగా మనోహరంగా ఆకట్టుకుంటాయి.
కొద్దిగా వేస్తే చాలు...
చిలకముక్కు పూల మొక్కను విత్తనాలతో సులువుగా పెంచుకోవచ్చు. ఇవి పూల విత్తనాలు దొరికే అన్ని షాపుల్లోనూ సులువుగా దొరుకుతాయి.. ఇవి పది నుంచి పదిహేను రోజుల్లో మొలకెత్తుతాయి. కుండీలో నారు పోసుకుని మూడు నాలుగు అంగుళాల ఎత్తు పెరిగాక తీసి కావలసిన చోట నాటుకుంటే వర్షం ఎక్కువ పడినా ఇబ్బంది ఉండదు. మొక్కకు మొక్కకు మధ్య ఎనిమిది నుంచి పది అంగుళాల దూరం ఉండేలా నాటుకోవాలి.
విత్తనాలు నాటిన దగ్గర్నుంచి పూలు రావడానికి అరవై నుంచి అరవై ఐదు రోజులు పడుతుంది. మొక్కలు నాటుకోబోయే ముందే నేలలో పశువుల ఎరువుగానీ వర్మీకంపోస్టుగానీ కలుపుకుంటే మంచిది. మొక్క పెరిగే కొద్దీ పాలీఫీడ్‌ వంటి నీటిలో కరిగే సంపూర్ణ ఎరువును చాలా కొద్ది కొద్దిగా(2గ్రా/లీటరునీటికి) ఎక్కువ సార్లు అంటే వారం పదిరోజుకోసారి వేస్తూ ఉండాలి. అలా అయితే పూలు బాగా పూస్తాయి. ఎరువులు ఎక్కువగా వేస్తే ఆకులు బలంగా పెరిగి పూలను కప్పేస్తాయి.
ఇతర మొక్కలతోనూ...
ఈ పూల మొక్కలకు నీళ్లను మొదళ్ల దగ్గర పోస్తే మంచిది. ఎందుకంటే ఆకుల మీద తరచూ నీళ్లు పడితే బూడిద తెగులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ మొక్కను పెంచడం చాలా సులభం. ఒక్క బూడిద తెగులు తప్ప మిగిలిన చీడపీడలు పెద్దగా ఆశించవు. గొంగళి పురుగులు కొంత ఇబ్బంది పెట్టొచ్చు. క్రమం తప్పకుండా వేపా, వెల్లుల్లి కషాయం చల్లుతూ ఉంటే వీటిని నివారించడం పెద్ద కష్టమేం కాదు. వీటిని బోర్డరుగా, గుంపుగా ఎలా నాటు కున్నా బాగుంటాయి. లేదంటే జఫ్రాంతస్‌ లిల్లీ, కాస్మోస్‌ వంటి ఇతర మొక్కలతో కలిపి పెంచుకోవచ్చు.లేదా కుండీల్లో వెల్బినా, పోర్చులక వంటి వేలాడే మొక్కలతో కలిపి నాటుకుంటే ఎంచక్కని వర్ణభరితమైన అమరిక మీ సొంతమవుతుంది.
ఎండాకాలంలో తప్ప మిగిలిన ఏడాదంతా మళ్లీ మళ్లీ గింజలు చల్లి ఈ మొక్కను పెంచుకోవచ్చు. ముచ్చటైన ఈ మొక్క సీతాకోక చిలుకలకు కూడా ప్రియ నేస్తమే. బటర్‌ఫ్లై గార్డెన్‌, కాటేజ్‌ గార్డెన్‌ వంటి ప్రత్యేక తోటలకు ఇది చక్కని ఎంపిక. -బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్‌ కన్సల్టెంట్‌
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....