Haricane, Chees Plants, Monsterani Plants.....అందమైన హరికేన్...
పెరట్లో నిండుదనం రావాలంటే మాన్ స్టెరాని హరికేన్ మొక్కను పెంచుకోవాల్సిందే. దీనినే చీజ్ ప్లాంట్ అనికూడా అంటారు. ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని గాలివేర్ల సాయంతో ఎదుగుతుంది. ఇది ఉష్ణమండలానికి చెందిన మొక్క. ఇంట్లో పెంచుకునే మొక్కలలో దీనిదే ఆగ్రస్థానం.అనుకూల పరిస్ధితులలో 20 మీటర్ల వరకూ పెరుగుతుంది. దీని ఆకులు హృదయాకారంలో, ముదురాకుపచ్చ రంగులో పెద్దగా ఒకటినుండి రెండడుగుల పొడవు, దాదాపు అంతే వెడల్పుతో మెరుస్తూ ఉంటాయి. మధ్యలో తెలుపూ,మరికొన్ని రంగులతో వరిగేషన్ రకాలుగా వస్తున్నవి చాలా అందంగా ఉంటున్నాయి. లేత ఆకులు మామూలుగా ఉంటాయి కానీ అవి ముదిరే కొద్దీ దాదాపు మధ్య ఈనె వరకూ చీలికలతో అక్కడక్కడా రంధ్రాలతో తయారవుతాయి.ఆకులూ ఇలా ఉండటం వల్ల మాన్ స్టెరా పెద్దపెద్ద గాలులను కూడా తట్టుకోగలదు. అందుకే దీనిని హరికేన్ ప్లాంట్ అంటారు.
తగిన వెలుతురు..
మాన్ స్టెరా సామాన్యంగా పెద్ద పెద్ద చెట్లను చుట్టుకొని, గాలి వేర్లను చెట్ల బెరడులోకి చొప్పించి పెరుగుతుంది. ఇళ్ళలో పెంచేటపుడు పీట్ మాస్ లేదా కొబ్బరిపీచుతో కప్పిన కర్రలను ఆధారంగా అమర్చితే గాని ఆరోగ్యంగాపెరుగుతుంది. ఈ మొక్కలకు గాలిలో తేమ ఎక్కువ అవసరం. ఇంట్లో పెంచినపుడు ఆకులను స్పాంజీతో తరచూ తుడుస్తుండాలి, పెరట్లో పెంచుకునేటపుడు నీళ్ళు చల్లుతూఉండాలి. మాన్ స్టెరా పెరగటానికి వెలుతురు కావాలి గానీ ఎండ నేరుగా పడకూడదు వెలుతురు మరీ తక్కువగా ఉంటే ఆకులు చిన్నవిగా, చీలికలు లేకుండా ఉంటాయి. ఎండ ఎక్కువగా పడితే ఆకులు మాడిపోయి మచ్చలు పడతాయి.ఈ మొక్కలకు సేంద్రియ ఎరువు ఎక్కువగా ఉండే సారవంతమైన మట్టి అవసరం. క్రమం తప్పకుండా వర్మీకం పోస్టు, కుళ్ళిపోయిన ఆకులు మట్టి మిశ్రమంలో కలుపుతూ ఉండాలి. వీలైనంతవరకూ వేర్లు తడారి పోకుండా చూసుకోవాలి, అలాగని నీరునిల్వ ఉండకూడదు. తగినన్నీ నీళ్ళు పోస్తుండాలి. మాన్ స్టెరాను అలాగే వదిలేస్తే అడవిలాగా పెరుగుతుంది. పక్కకు వచ్చిన కొమ్మలను ఎప్పకప్పుడు కత్తిరిస్తూ ఆధారాన్ని చక్కగా పట్టుకుని పెరిగేలా చూసుకోవాలి. అప్పుడప్పుడూ వేప కషాయం చల్లితే చీడపీడలు పెద్దగా ఆశించవు.
నీళ్ళు సరిపోకపోతే....
సాధారణంగా ఇంటి లోపల పెంచినపుడు మాన్ స్టెరాకు పూతరాదు. కానీ బయట పెరిగినపుడు మీగడ రంగు డొప్పతో కప్పిన అడుగు పొడుగున్న పూలకాడలు వస్తాయి. ఇవి తెల్లని పండ్లలా మారతాయి. కొద్దిగా అనాస రుచితో ఉండే వీటిని తింటారు కూడా. వీటిని కత్తరింపుల ద్వారా ప్రవర్ధనంచేయవచ్చు. రెండు మూడు ఆకులున్న శీర్ష కత్తిరింపులు బాగా నాటుకుంటాయి. మాన్స్ స్టెరా ఆకులు పసుపు రంగుకి మారుతుంటే నీరు ఎక్కువైందని, ఎరువులు వేయాల్సిన అవసరంఉందని కానీ తెలుసుకోవాలి. అలాగే ఆకుల అంచులు కొనలూ ఎండిపోతుంటే గాలిలో తేమ తక్కువగా ఉండటం గానీ, కుండీ సరిపోకపోవటం గానీ కారణాలు. ఆకులకుచీలికలూ,రంధ్రాలు రాకపోతుంటే వెలుతురుగానీ, నీళ్ళు గానీ ఎరువులు గానీ సరిపోక పోవడం జరగవచ్చు. మొక్క ఎక్కువగా సాగిపోతుంటే వేళ్ళు ఆధారాన్ని సరిగా పట్టుకోలేదని అర్ధం. ఇంకెందుకు మీ మొక్కలకు మాన్ స్టెరాను జతచేసి నిండుదనాన్ని తెచ్చుకోండి.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...