చిలకముక్కు మొక్క – అరుదైన మొక్కలలో ఒకటి
అరుదుగా కనిపించే ప్రత్యేకమైన మొక్కలలో చిలకముక్కు కూడా ఒకటి దీన్నే హెడ్జ్ హాగ్ (ముళ్లపందిమొక్క) అని కూడా అంటారు. దీని శాస్త్రీయనామం మొల్లినా ఫిలిప్పెన్సిస్ లేదా మొల్లినా హిస్ట్రిక్స్ గుమ్మడి టేకు జాతికి చెందిన ఈ మొక్క జన్మస్థానం మన దేశమే.
చిలక ముక్కు మొక్క ముళ్లతో ఉండే పొద లేదా చిన్న చెట్టు లేదా తీగ. వాలినట్లున్న కొమ్మలతో ఆరు నుంచి పది అడుగుల ఎత్తవరకు పెరుగుతుంది. క్రమం తప్పకుండా కత్తిరిస్తూ పందిరి మీదకు తీగలా గుమ్మటంలాంటి పొదలా, అందమైన చిన్న చెట్టులానే కాకుండా కుండీల్లోనూ చక్కగా పెంచుకోవచ్చు. బోన్సాయ్ పెంపకానికి అత్యంత అనువైన మొక్క ఇది. దీని ఆకులు చిన్నగా అండాకారంలోగానీ, కొద్దిగా నొక్కులతో ఐవీ ఆకుల్లా గాని ఎలాగైనా ఉండవచ్చు.
ఈ మొక్క ప్రత్యేకత అంతా దీని పూలే. అవి గుత్తుల్లో పూస్తాయి. ఈ పూల గుత్తులు ఒకదాన్ని ఒకటి కప్పిన రక్షక పత్రాలతో గొట్టల్లాగా కిందికి వేలాడుతూంటాయి. వాటిల్లో నుంచి చిలకమక్కు ఆకారంలో ఉండే ఆకర్షణీయమైన పసుపు పచ్చ రంగు పూలు వికస్తాయి. పూల ఆకారాన్ని బట్టి దీనికి చిలకముక్కు అని పేరు వస్తే ఒకదాని మీద ఒకటి పొలుసుల్లా కప్పి ఉన్న రక్షక పత్రాల వల్ల ముళ్లపంది మొక్క అన్న పేరు వచ్చింది. రాత్రిపూట వికసించే ఈ పూలు పూశాక ఒకటి రెండు రోజులుండి రాలిపోతాయి. ఇవి దాదాపు సంవత్సరమంతా పూస్తూనే ఉంటాయి.
పూర్తి సూర్యకాంతిలో పెరిగే ఈ మొక్కను కొద్దిపాటి నీడలో కూడా పెంచుకోవచ్చు. కుండీల్లో పెంచుకొని బాల్కనీల్లో వరండాల్లో అమర్చుకోవచ్చు. ఇది నీరు నిలవని సారవంతమైన మట్టి మిశ్రమంలో చక్కగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా నీళ్లు పోయడం అవసరం. నెలకోసారి ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువుని గానీ వర్మీకంపోస్టు, కోడి ఎరువు, ఎముకల పొడి వంటి సేంద్రీయ ఎరువులు గానీ వేస్తుంటే ఆరోగ్యంగా పెరిగి చక్కగా పూస్తుంది. ఈ మొక్కను చీడపీడలు సాధారణంగా ఆశించవు. ప్రత్యేకమైనదైనా పెద్దగా శ్రద్ధ అవసరం లేని మొక్క ఇది. గంగరావి కాయల ఆకారంలో చిన్నగా పసుపు రంగులో ఉండే దీని కాయల గుజ్జును ఫిలిఫైన్స్ లో కాలి వేళ్ల మధ్య వచ్చే పగుళ్లకు ప్రత్యేక మందుగా వాడతారు. విత్తనాలు, కొమ్మ కత్తిరింపులు, కొమ్మంట్లు ద్వారా దీనిని ప్రవర్థనం చేయవచ్చు. అందంగా ప్రత్యేకంగా కనిపించే ఈ మొక్కను చూస్తే తేనెటీగలు, సీతాకోక చిలుకలు, హమ్మింగ్ పిట్టలూ కూడా పండచేసుకుంటాయి.