రంగురంగుల హైడ్రాంజియా
ఏడాదంతా పూస్తూ, ముదురాకుపచ్చ ఆకులతో కనువిందు చేస్తుంది హైడ్రాంజియా. ఇది బహువార్షిక పొద. వర్షాకాలం, చలికాలంలో పూత ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణం ఈ పొద పెరగడానికి చాలా అనుకూలం. దీన్ని పెంచే నేల తేమగా, సారవంతంగా, గుల్లగా ఉండాలి. ఇసుక పాలు ఎక్కువగా ఉండే మట్టిలో కంపోస్టు లేదా వర్మీకం పోస్టు, కొంచెం వేపపిండి, కొద్దిగా సూపర్ ఫాస్పేట్ కలిపి నాటుకోవాలి. రెండు మూడు నెలలకొకసారి ఒక టేబుల్ స్పూన్ 14-35-14 శాతంలో ఫాస్పరస్ ఎక్కువగా ఉండే ఎరువును మట్టిలో కలిపితే ఆరోగ్యంగా పెరుగుతాయి.
హైడ్రాంజియాను ఉదయం ఎండపడి, మద్యాహ్నం నీడ వచ్చే చోట నాటుకోవాలి. సూటిగా ఎండపడని బాల్కనీలలోనూ చక్కగా పెంచుకోచ్చు. కుండీలలో పెంచినా, నేలపై నాటినా నీరు ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. హైడ్రాంజియాను ప్రూనింగ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా చేస్తే పూలు తగ్గపోతాయి. ఈ పొదకు బూడిద, తుప్పూ, ఆకుమచ్చ తెగులూ ఆశించే ప్రమాదముంది. మొక్క బలంగా ఉంటే తెగుళ్ళ వల్ల ప్రమాదం ఉండదు. ఒక టీ స్పూను బేకింగ్ సోడాగానీ రెండు ఆస్ర్పిన్ బిళ్ళలు గానీ లీటరు నిటిలో కలిపి చల్లితే తెగుళ్ళను నియంత్రించవచ్చు.
పలు రంగులలో ఉండే ఈ పువ్వులలో తెల్లనివి ప్రత్యేకంగా కనబడతాయి. నీలం రంగు పూలు పూసే హైడ్రాంజియాను మట్టి మిశ్రమంలో కొంచెం సున్నంగానీ, బూడిదను గానీ కలపటం ద్వారా గులాబీ రంగు పూలు వచ్చేటట్లు చేయవచ్చు. వాడేసిన కాఫీ పొడి కలిపితే నీలం పూలు పూస్తాయి. హైడ్రాంజియా కొమ్మల శీర్ష కత్తిరింపులను రూటింగ్ పౌడర్ లో ముంచి నీడలో నాటుకుని సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు. నర్సరీలలో కూడా ఈ మొక్కలను కొనుగోలుచేయవచ్చు.