Ice Plant Flower Plants.........ఐస్ ప్లాంట్ మొక్కలు
చిన్న చిన్న అందమైన పూలతో ప్రకాశవంతమైన పచ్చని ఆకులతో కనువిందు చేసే మొక్కలు ఐస్ ప్లాంట్ మొక్కలు. ఇంట్లో పెంచుకోవటానికి మరియు లాండ్ స్కేపింగ్ కు అనువుగా ఉంటాయి. సారవంతం కాని, నీటి వసతి లేని భూములలో కూడా చక్కగా త్వరగా, దట్టంగా పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితులలై నైనా చక్కగా పెరుగుతాయి.. రెండునుండి నాలుగడుల వరకూ విస్తరించే మొక్కలు ఇవి. వాలులో నాటటానికి, రాక్ గార్డన్ లోనూ, లాన్ల కోసం, కాలి బాటల పక్కన పెంచితే అందమైన పూలతో కనువిందుచేస్తాయి.
పెంచే విధానం :
ఈ మొక్కలు నీరు నిలవని నేలలో ఎక్కువ వెలుతురు ఉండే చోట బాగా పెరుగుతుంది. ఒకసారి కుదురుకున్నాక అప్పుడప్పుడూ నీళ్లు పోస్తే చాలు. ఈ మొక్కకు ఎరువులు అవసరం పెద్దగా లేకున్నా ఇళ్ళలో పెంచుకునేటపుడు కొద్దిగా వర్మీకం కంసోస్టు లేదా 17:17:17 శాతం ఎన్.పి.కె ఎరువు వేసి అప్పుడప్పడూ మట్టి పూర్తిగా తడారి పోయాక నీళ్ళు పెడుతూ ఉండే ఎక్కువకాలం ఎక్కువ పూలు పూస్తాయి.
ఐస్ ప్లాంట్లలో పసుపూ, తెలుపూ, ఊదా, ఎరుపు, ఆరెంజ్, గులాబీ రంగుల్లో పూలుపూసే రకాలున్నవి. చలికాలం నుంచి ఎండలు ముదిరే వరకూ ఈ మొక్కలు ఎక్కువగా పూస్తాయి..పూలు లేనప్పుడు కూడా పచ్చని ఆకులతో అందమైన తివాసీలాగా కనువిందు చేస్తాయి.
రంగురంగుల ఐస్ ప్లాంట్స్ సీతాకోక చిలుకలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటి ఆకులు వెలుతురు పడినప్పుడు మంచు స్పటికాలలాగా మెరుస్తూ ఉండటం వలన వీటికి ఐస్ ప్లాంట్స్ అని పేరు వచ్చింది. ఎక్కువగా ఎండలో పెరిగే మొక్కలైనా కూడా కొద్దిపాటి నీడనుమాత్రమే తట్టుకుంటాయి.
ఈ మొక్కలు ఎంతపొడి నేలలలో నైనా పెరుగుతాయి. కానీ నీరు నిలవకూడాదు. మొక్కలు కుళ్ళిపోతాయి. విత్తనాల ద్వారా మొలకెత్తించు కోవచ్చు. కానీ విత్తనాలను నేలలో పాతకూడదు. పైనే వేయాలి. ఇవి పెరగటానికి వెలుతురు అవసరం.ఈ మొక్కలకు చీడపీడలు అంతగా ఆశించవు. నర్సరీల్లో తక్కువ ధరకే దొరకుతాయి.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...