header

Jacobinia.....జాకోబినియా

Jacobinia.....జాకోబినియా
jacobinia నీడలో కూడా అతితక్కువ అందమైనే పూలతో కనువిందుచేయగల అతితక్కువ రకాలలో జాకోబినాయా కూడా ఒకటి. మన ప్రాంతానికి అనువైన మొక్క ఇది. జాకోబినియాను బ్రెజీలియన్ ఫ్లూమ్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయనామం జస్తీషియా కార్నియా. ఇది నీడలో పెరిగే చిన్నపొద. రెండు నుండి మూడు అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది.
అండాకారంలో ఉండే పెద్ద పెద్ద ఆకులతో ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. కంకులవంటి పూల గుత్తులు, ఆకర్షణీయమైన తెలుపు, లేత గులాబీ, నిండుగులాబీ, పసుపువంటి రంగులతో ముచ్చటగా ఆకట్టుకుంటాయి. నీరు నిలవని సారవంతమైన తేమగా ఉండే మట్టిమిశ్రమం జాకోబినియాలకు అత్యంత అనుకూలం. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి. కానీ మరి ఎక్కువ పోయకూడదు. నీరు మరీ ఎక్కువైనా తక్కువైనా ఆకులు కాలిపోయి మొక్క దెబ్బతింటుంది.
ఎండలో పెరిగినా నీడకూడా దీనికి ఎక్కువ అనువుగా ఉంటుంది. ఇది వేగంగా పెరిగే మొక్క. జాకోబినియాను గుంపులుగా వాడటానికి బొర్డరుగా నాటడానికి చాలా బాగుంటుంది. ఇది హైడ్రాంజియా ఫ్లెక్లాంధస్, ఫెరన్, కమేలియాలతో కలిపి నాటినపుడు చక్కగా ఉంటుంది. ధవళ వర్ణంలో పూలు పూసే రకమైతే వెండి రంగు ఆకులుండే ఫ్లెక్లాంధస్ ఫైలియా రకాలతో కలిపితే అద్భుతంగా కనిపిస్తుంది.
ఏడాదంతా....
జాకోబినియా సంవత్సరమంతా పూస్తూనే ఉంటుంది. కొత్తగా వచ్చే కొమ్మలకే పూలు వస్తాయి. అందుకే పూలు పూయడం అయిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటే చిగుళ్లు వచ్చి పూలు బాగా రావడమే కాకుండా మొక్కకూడా ముద్దుగా గుబురుగా పెరుగుతుంది.
బాల్కనీలకు, వరండాలకు చెట్లకింద నీడలో పెంచుకోవటానికి అత్యంత అనుబైన మొక్కను కుండీలలో పెంచుకున్నపుడు అప్పుడప్పుడూ గదుల్లో కూడా అమర్చుకోవచ్చు. ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువును నెలకోసారి వేస్తుంటే సరిపోతుంది. అశ్రద్ధ చేసినా తట్టుకునే ఈ మొక్క చక్కగా ఎరువులు వేసి నీళ్ళుపోస్తే ఆనందంగా పెరిగి విరగబూస్తుంది. అప్పుడప్పుడూ నీళ్లు పిచికారీ చేస్తూ ఉంటే తాజాగా ఉంటుంది.
జాకోబినియాలను కత్తిరింపులతో సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. గింజలు మొలకెత్తడానికి వెలుతురు కావాలి. అందుకే గింజలను మట్టితో కప్పకూడదు. ఇరవై నుంచి ఇరవై అయిదు రోజుల్లో మొలకలు వస్తాయి. ఏ తోటకైనా అందాన్నిచ్చే జాకోబినియాలు సీతాకోక చిలుకలకు సైతం ఆప్తబంధువులే

బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...