header

Jookamalle,Vallaris Heynei ....పరిమళాల జూకామల్లె
vadamalli జూకామల్లె మనదేశానికి చెందిన లత. పచ్చని ఆకులతో గుబురుగా అల్లుకొని గిన్నెలాంటి చిన్నచిన్న మీగడరంగు పూలతో విరగబూస్తుంది.సాయంకాలాలను తన మనోహరమైన సువాసనతో మరపురానివిగా మార్చేస్తుంది. గిన్నె మాలతికి ఎండ బాగా తగలాలి. కొద్దిపాటి నీడలోనూ ఎదుగుతుంది. ఇది కుండీలలో చక్కగా పెరుగుతుంది. పందిరి మీదికి, కంచెల మీదకి అల్లుకునేలా చేస్తే బాగుంటుంది. పొదలాపెరిగే తత్వం వల్ల ఎక్కువగా తీగలు సాగకుండా, నిండుగా కనిపిస్తుంది. దీన్ని కత్తిరిస్తూ సులభంగా మనకు కావలసినట్లు పెంచుకోవచ్చు.దీనికి సారవంతమైన నేల ఉంటే బాగుంటుంది. నీరు మాత్రం బాగా పోస్తుండాలి. ఈ మొక్కలు డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకూ పూస్తాయి. ఆక్టోబరు నుండి మార్చి వరకు నెలకు ఒకసారి ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువును కొద్దిగా మట్టి మిశ్రమంలో కలుపుతుంటే చాలు.
గిన్నె మాలతికి చీడపీడలు పెద్దగా ఆశించవు. అప్పుడప్పుడు వేప కషాయం చల్లితే సరిపోతుంది. దీని పూలవాసన మొగలిపూల పరిమళానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఆసక్తి కలిగించే విషయమేమంటే, బాస్మతి బియ్యానికి ఆ సువాననిచ్చే రసాయనాలే మొగలి పువ్వులోను, గిన్నెమాలతిలోనూ ఉంటాయట.మ ఔషధపరంగాకూడా ఈ మొక్క ఎంతో ఉపయోగ పడుతుంది. గిన్నె మాలతి ఆకుల రసాయనాన్ని గాయాలకు, దెబ్బలకూ పూతగా పూస్తే త్వరగా తగ్గుతాయంటారు. ఈ పూలు సీతాకోక చిలుకలకూ,హమ్మింగ్ పిట్టలకూ ఎంతో ప్రియమైనవి.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...