Keladiam, Jesus Heart, Angle Wing Plants ......కెలాడియం మొక్కలు
ఇవి దుంపల ద్వారా పెరిగే మొక్కలు. ఏనుగు చెవులు, జీసస్ హార్ట్, ఏంజల్ వింగ్స్, ఇలా రకరకాల పేర్లున్న కెలాడియం శాస్త్రీయనామం కెలాడియం బైకలర్. వీటిని అందమైన ఆకులకోసం పెంచుకుంటారు. హృదయాకారంలో వాలినట్లుండే ఆకులు తెలుపు, గులాబీ, ఎరుపు లేత ఆకుపచ్చ వంటి ప్రకాశవంతమైన రంగులలో ఉంటాయి. వాటిపై రంగురంగుల చుక్కల, చారలు, మచ్చలు, చూడచక్కని అంచులతో అద్భుతంగా కనువిందు చేస్తాయి. కెలాడియమ్ నీడలో చక్కగా పెరిగే మొక్క. ఇది ఎండను కొంతవరకు తట్టుకుంటుంది కానీ మరీ ఎక్కువైతే మాత్రం ఆకులమీద కాలినట్లు రంధ్రాలు పడతాయి. కెలాడియంకు నీరు నిలవని తేమగా ఉండే మట్టి మిశ్రమం అవసరం. అంటే కంపోస్టు, కోకోపిట్ల పాళ్ళు ఎక్కువగా ఉండాలన్న మాట. నీరు క్రమం తప్పకుండా పోస్తూ ఉండాలి.
దుంపలను రెండుమూడు అంగుళాల లోతులో ఆరు నుండి ఎనిమిది అంగుళాల ఎడంలో నాటుకుంటే సరిపోతుంది. పెద్దగా ఉన్న దుంపలు నాటితే ఎక్కువ ఆకులు వస్తాయి. మట్టి మిశ్రమంలో ఎముకల పొడి కలిపితే ఆకులరంగు ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది. వాడేసిన కాఫీ, టీపొడి, కుళ్ళిపోయిన ఆకులు వంటివి మట్టి మిశ్రమంలో కలుపుతూ ఉంటే కెలాడియమ్ బాగా పెరుగుతుంది. దీనిని నేలలో నాటుకున్నా, కుండీల్లో పెంచుకున్నా ముచ్చటగా ఉంటుంది. విడివిడిగానే కాదు ఇతర మొక్కలతో కలిపి నాటుకున్నా అందంగా కనిపిస్తుంది. దీని చెట్ల మొదళ్ళలో, చుట్టూ కొలను పక్కన నాటుకుంటే కొత్తందం తెచ్చి పెట్టుకున్నట్లే. వీటిని చిన్నచిన్న కుండీల్లో నాటుకుని చెట్ల మొదళ్ళలో పాతుకుంటే చెట్లవేర్లకు అడ్డం లేకుండా పెరుగుతాయి. అందంగా ఆరోగ్యంగా మొక్క ఎదగటానికి పొటాష్ ఉండే 17:17:17వంటి సమగ్ర ఎరువును నెలకోసారి వేయాలి.దుంపలను నాటటం ద్వారా కెలాడియంను సులభంగా ప్రపర్ధనం చేయవచ్చు. ఈమొక్కకు చీడపీడలు తక్కువ. మట్టి, నీరు, నీడ, సరిగా ఉంటే చాలు. అందమైన ఆకులతో సంవత్సరం పొడుగునా మీ తోటకు అలంకారమవుతుంది కెలాడియం. ఇవి రంగురంగులలో పరిసరాలను తేజోవంతం చేస్తాయి. ప్రతి సంవత్సరం జులై చివరివారంలో అమెరికాలో కెలాడియం ఫెస్టివల్ జరుగుతుంది. ప్రపంచ ప్రఖ్యాతమైన కెలాడియం రకాలెన్నో అక్కడ ప్రదర్శితమవుతాయి.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...