Kolias.....కోలియస్
రకరకాల వర్ణాల్లో, వర్ణమిశ్రమాలతో, అలరారే ఆకులుండే జాతి కోలియస్. ప్రకృతి శ్రద్ధతో గీసిన వర్ణచిత్రాల్లా మనోహరంగా ఉండే మొక్కలజాతి ఇది. దీని శాస్త్రీయనామం కోలియన్ బ్లూమి
వివిధ ప్రత్యేక వర్ణాల్లోనూ, బోలెడు రంగులతో హోలీ ఆడినట్టు గీతలు గీసినట్లు అంచులు వైవిధ్యంగా ఈనెలు వేరే వర్ణంలో ప్రస్పుటంగా ఇలా ఎన్నెన్నో సొగసులతో....లేత పసుపు మొదలుకుని ముదురు చాక్లెట్ రంగువరకూ.... ఇన్ని వన్నె చిన్నెలు ప్రదర్శించగల మొక్క ఇది ఒక్కటేమోనేమో. అలాగే ఆకుల ఆకారం, పరిమాణంలో కూడా ఎంతో వైవిధ్యం మొత్తంమీద మీరు ఎక్కువ పెంచదలుచుకున్నా అందుకు సరిగ్గా అనువైన రకం. తప్పనిసరిగా దొరికే మొక్క కోలియస్. అందమైన ఆకులుండే మొక్కలలో బిగోనియాలు, ఫిటోనియాలు, ఫోల్రాడాట్ లకు సరిజోడి ఈ మొక్క.
కోలియస్ అడుగున్నర నుంచి రెండడుగుల ఎత్తువరకూ మొత్తని కాండంతో పెరిగే మొక్క బహువార్షికమైనా ప్రతి సంవత్సరం కత్తిరింపులను నాటుకుని పెంచుకుంటే అందంగా ఉంటుంది. ముదిరిన మొక్కలు అంత చక్కగా ఉండవు. ఎండ సూటిగా తగలకుండా కొద్దిగా నీడగా ఉండే చోటు కోలియస్ లకు బాగా అనుకూలం. పూర్తినీడలో పెంచినప్పుడు కొమ్మలు సాగిపోయి అందవిహీనంగా ఉంటుంది. ముదురు రంగు ఆకులుండే రకాలు లేతరంగు రకాలకంటే ఎండను తట్టుకోగలవు. నీరునిలవని సారవంతమైన మట్టిమిశ్రమంలో కోలియస్ బాగా పెరుగుతుంది. నీళ్లు క్రమం తప్పకుండా పోయాలి. నీటి ఎద్దడిని అసలు తట్టుకోలేని మొక్క ఇది. సులభంగా వాడిపోయి తలవేలాడేస్తుంది. మళ్లీ కొద్దిగా నీళ్లుపోయగానే పుంజుకుని చైతన్యంతో తుళ్లిపడుతుంది.
పూలు వచ్చిన మొక్క త్వరగా పాకి ముదిరిపోయి అందవిహీనంగా మారుతుంది. రెండు మూడు వారాలకోసారి కొమ్మల చివర్లు తుంచివేస్తుంటే పూలు రాకుండా ఉంటాయి. ఎక్కువ కొమ్మలతో గుబురుగా, అందంగా పెరుగుతాయి కూడా కోలియస్ ను కుండీలలో పెంచుకునేటపుడు క్రమం తప్పకుండా పాలీసీడ్ వంటి సమ్రగ ఎరువును నెలకోసారి నీళ్లలో కలిపి పోస్తూ ఉండాలి. నేలలోనైతే వర్మీకంపోస్టు కానుగ పిండి ఆముదం పిండి వంటివి అప్పుడప్పుడూ కలుపుతూ వుంటే సరిపోతుంది. ఎరువులు మరీ ఎక్కువైతే ఆకు రంగులు ప్రకాశవంతంగా ఉండవు. ఎరువులు ఎక్కువగాకుండా జాగ్రత్తపడాలి. కోలియస్ కొమ్మ కత్తిరింపులతోనూ, గింజలతోనూ సులువుగా ప్రవర్ధం చేయవచ్చు. తగినంత వెలుతురు, సరిపడా నీళ్లు ఉంటే కోలియస్ ను పెంచడడం సులభం. చీడపీడలు పెద్దగా ఆశించవు కూడా. అయినా ముందుజాగ్రత్తగా ఆకుకషాయాలు అప్పుడప్పుడూ చల్లుతూ ఉంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. కోలియస్ ను బోర్డరుగా నాటుకున్నా, కుండీలలోనైనా, హ్యంగింగ్ తొట్లలోనైనా, అస్పరాగ్ లు, పెరన్ లు, లిల్లీలు, రిబ్బన్ గ్రాస్ వంటివాటితో కలిపి నాటుకున్నా బాగుంటుంది. లెఫోమియా గ్రౌండ్ కవర్ తో కలిపి కుండీల్లో నాటుకున్నా, చెట్లకింద పెంచుకున్నా ముచ్చటగా ఉంటుంది. తోటను తక్కువ సమయంలో, సులువుగా వర్ణభరితం చేసుకోవడానికి కోలియస్ ను మించినది మరొకటి ఉండదు. మీరూ ప్రయత్నించి చూడండి. కోలియస్ తో ప్రేమలో పడకుండా ఉండటం అసాధ్యం.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...