Marigold Plants...ముద్ద బంతులు:...
బంతి శాస్త్రీయ నామం టాజిటస్. ఇందులో ఆఫ్రికన్, ఫ్రెంచ్ రకాలున్నవి. ఫ్రెంచ్ రకాలంటే మన కారబ్బంతులన్న మాట. బంతి అన్ని రకాల నేలలోనూ పెరుగుతుంది.అందుకు సారవంతమైన నీరు నిలవని మట్టి అవసరం పూర్తి సూర్యకాంతి తప్పనిసరి బంతి మొక్కలు 40 నుండి 45 రోజులలో పూతకు వచ్చి తరువాత రెండు నెలల వరకు పూస్తూనే ఉంటాయి.పూలు చక్కగా రావాలంటే సరైన రకాలను ఎన్నకోవాలి. విత్తనాల ఎంపికలో జాగ్రత్త లు పాటించాలి. విత్తనాలు 1-2 సంవత్సరాలు వాడుకోవచ్చు. తరువాత మొలక శాతం తగ్గుతుంది. హైబ్రీడ్ విత్తనాల ధర కొంచెం ఎక్కువ. కనుక విత్తనాలను కుండీలలో గానీ, సీడ్లింగ్ ట్రేలలో కానీ చల్లుకోవడం మంచిది. తరువాత నేలలో నాటుకోవచ్చు.
బంతిలో ఏడాది పొడవునా పెంచుకోగలిగిన రకాలు ఉన్నాయి. ఎండాకాలంలో మాత్రం మరీ అధికఉష్ణోగ్రతలు ఉన్నపుడు పాక్షికంగా నీడ తగిలేలా ఏర్పాటు చేసుకొవాలి. చలికాలంలో పూసా, నారంగి, గైండా, ఆఫ్రికన్ జైంట్, డబల్ ఎల్లో, డబుల్ ఆరెంజ్, టైగర్ రకాలు ఎక్కువగా పూస్తాయి. ఎండా కాలంలో క్రాకర్ జాక్, ప్రాంతీయ రకాలు అనువైనవి. ఆఫ్రికన్, జెయింట్ టాల్ ఆరెంజ్, జాఫ్రి, లడ్డు గైండా రకాలు కూడా చక్కగా పూస్తాయి. వర్షాకాలంలో పూలు రావాలంటే జూన్ మధ్యలో నారుపోసుకొని, జులైలో నాటుకోవాలి. చలికాలంలో పూలు కావాలంటే సెప్టెంబర్ మధ్యలో నారుపోసుకొని అక్టోబర్ మధ్యలో నాటుకోవాలి.
ఎండాకాలంలో పూలకోసం జనవరి-ఫిబ్రవరి నెలలో నారుపోసుకొని ఫిబ్రవరి మార్చిలో నాటుకోవాలి.. హైబ్రీడ్ రకాలు మామూలుగా విత్తనాల నివ్వవు కనుక ఎప్పటికప్పుడు కొత్త విత్తనాలు కొనుగోలు చేసి నారు పెంచుకోవాలి.
త్వరగా ఎదుగుతుంది :
బంతి మొక్కలు త్వరగా పెరుగుతాయి. కనుక ఎరువులు ఎక్కువగా కావాలి. మట్టి, పశువుల ఎరువు లేదా వర్మీకం పోస్టను సమానంగా తీసుకుని కొంచెం వేపపిండి, ఎముకల పొడి కలిపితే మంచిది. నారు పోసాక పదిహేను రోజుల కొకసారి ఎన్ పీకె ఉండే సమగ్ర ఎరువును నీటిలో కలిపి చల్లాలి. బంతికి సాధారణంగా చీడపీడలు ఆశించవు. నీరు నిలవకుండా ఎండ బాగా తగిలేలా చూసుకుంటే సరిపోతుంది. వేపకషాయం పదిరోజులకొకసారి చల్లుతుంటే ఆరోగ్యంగా పెరుగుతుంది.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...