header

Mona Lavender... మోనా లావెండర్ ఇంటికే అందాలు

Mona Lavender... మోనా లావెండర్ ఇంటికే అందాలు
vadamalli మోనా లావెండర్ ను 1990లో ఆఫ్రికాలో సృష్టించినా మన దగ్గర వాడకంలో వచ్చింది మూడు, నాలుగేళ్ళ క్రితమే. మోనా లావెండర్ పుదీనా కుటుంబానికి చెందినది. సాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కలన్నింటిని ఆకుల కోసం పెంచుతారు కానీ ఈ మొక్కలను మాత్రం పూల కొరకే పెంచుతారు. ఇది చిన్న పొదలాపెరిగే బహువార్షికం. ఒకటి నుండి రెండడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.అదీ వేగంగా, దీని ఆకులు అండాకారంలో ముదురాకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఆకుల అడుగు భాగం ఊదారంగులో ఉంటుంది. అందంగా ఉండే దీని పూలు లావెండర్ రంగులో కంకుల్లా పూస్తాయి.

మోనా లావెండర్ గుల్లగా ఉండే నేలలో బాగా పెరుగుతుంది. దీనికి నీరు ఎక్కువ అవసరం లేదు. కానీ క్రమం తప్పకుండా ఉండాలి. ఎండలో కంటే ఇదినీడలో బాగా పెరుగుతుంది. ఇది పుదీనా కుటుంబంలోని ఇతర మొక్కల్లాగా తీగలా సాగకుండా నిలువుగా గుబురుగా పెరుగుతుంది. పూలు లేనపుడు కూడా అందమైన ఆకులతో సంవత్సరమంతా కనువిందు చేస్తుంది మోనా లావెండర్ ఎక్కువకాలం పూస్తుంది.

వర్షాకాలంలో, చలికాలంలోనూ పూలు పూస్తాయి. పూలు పూసేటప్పుడు ఎరువులు వేయరాదు. పూత అయిపోయాక రెండుమూడు వారాలకు ఒకసారి పాలీఫీడ్ వంటి నీటిలో కరిగే సమగ్ర ఎరువును లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి వేయాలి. వాడేసిన టీ ఆకులు, కాఫీ పొడి వంటివి మట్టి మిశ్రమంలో కలిపితే ఈ మొక్క బాగా పెరుగుతుంది. వాడిన పూలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. మోనా లావెండర్ కు చీడపీడల సమస్య తక్కువే. పిండిపురుగులు గానీ, రసం పీల్చే పురుగులు గానీ ఆశిస్తే వేప, వెల్లుల్లి కషాయం వాడితే సరిపోతుంది. దీనిని నాలుగు అంగుళాల పొడవుండే కొమ్మ చివరి కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు.

ఇది కుండీలలోకి, హ్యాంగింగ్ బాస్కెట్లలోకి చాలా బాగుంటుంది. నేలలో నాటేటపుడు అంచులుగానూ, ఇతర మొక్కలతో కలిపి బెడ్ ల మాదిరి నాటుకోవడానికి చక్కగా ఉంటుంది. నీడలో పూసే మొక్కలే అరుదు అయితే మోనా లావెండర్ లాగా నీడలో విరగబూసే మొక్కలు ఇంకా అరుదు.

బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...