Monda Grass ..........ముచ్చటైన మోండోగ్రాస్.....
ఎలాంటి ల్యాండ్ స్కేప్ లో అయినా సులువుగా ఇమిడిపోయి అదనపు ఆకర్షణను అందించే మోండోగ్రాస్.....
మోండోగ్రాస్ ఎలాంటి నేలలో అయినా మూడునుండి ఆరు అంగుళాల ఎత్తుమాత్రమే పెరుగుతుంది. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే బహువార్షికం. ఇది కాడలు లేని నిండాకుపచ్చ రంగు గడ్డిలాంటి ఆకులతో కుదురులా పెరుగుతుంది.
ఇది పెద్దగా శ్రద్ధ చూపనవసరం లేకుండా సులువుగా పెరిగే మొక్క.
మోండోగ్రాస్ ఎలాంటి నేలల్లో ఐనా పెరుగుతుంది. కానీ నీళ్లు నిలవకుండా ఉంటే చాలు. ఎండను తట్టుకున్నా నీడ దీనికి అనుకూలం. పూర్తినీడలో చాలా తక్కువ
నీటితోనూ చక్కగా పెరుగుతుంది. మట్టిమిశ్రమంలో కోకోపిట్, వాడేసిన కాఫీపోడి, టీపొడి వంటివి కలిపి నాటితే దీనికి మంచిది. దీన్ని చిన్న గ్రౌండ్ లో కవర్ గానూ, పొట్టి బోర్డరుగానూ, పేవింగ్ రాళ్లమధ్య కూడా నాటుకోవచ్చు. లాన్ కు, పూలబెడ్ల మధ్య నాటుకోవచ్చు. కుండీలలో పెద్ద మొక్కలు నాటినప్పుడు కింద వరకుసగానూ పెంచుకోవచ్చు. మోండోగ్రాస్ ను చిన్న చిన్న కుదుళ్లలాగా నాటితే కొంతకాలానికి మొత్తం కలిసిపోయి లాన్లాగా కనిపిస్తుంది. నిజానికి మోండోగ్రాస్ లాన్ చూడటానికి అద్భుతంగా ఉంటుంది. పైగా దీనికి మోవింగ్ అంటే కత్తిరించడం అవసరం లేదు. చాలా తక్కువ నీటితో పెరుగుతుంది. ఇంకా పూర్తి నీడకు కూడా ఎంతో అనుకూలం. కానీ ఒకే ఒక్క సమస్య...ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది.
నీళ్లు నిలవకూడదు...
మోండోగ్రాస్ లో వరిగేటెడ్ రకాలు, నల్లరకం కూడా ఉన్నాయి. బ్లాక్ మోండోగ్రాస్ తక్కువ గుబురుగా ఎనిమిది నుండి తొమ్మిది అంగుళాల ఎత్తులో పెరుగుతుంది. కుండీలలో ఇతర మొక్కలతో కలిపి నాటడానికి లాండ్ స్కేప్ గానూ అద్భుతంగా ఉంటుంది.
దీనికి వర్షాకాలంలో చిన్న చిన్న ఊదారంగుపూలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. కానీ ఇవి కనపడకుండా ఆకులతో కప్పివేయబడతాయి. మోండోగ్రాస్ ను సాధారణంగా చీడపీడలేవి ఆశించవు. నీళ్లు ఎక్కువైతే వేరు కుళ్లుతుంది.
కనుక నీళ్లునిలవకుండా చూసుకోవాలి. తక్కువగా పోయాలి. దీనికి ఎరువులు పెద్దగా అవసరం లేదు. మూడు నాలుగు నెలలకోసారి ఎన్ పీ కె ఉండే పాలీఫీడ్ వంటి నీటిలో కరిగే ఎరువును లీటరుకు ఐదుగ్రాముల చొప్పున కలిపి చల్లితే సరిపోతుంది.
మోండోగ్రాస్ కుదుళ్లను విడదీసి చక్కగా ప్రవర్ధనం చేయవచ్చు.
- బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్, సౌజన్యంతో......
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...