header

Punnami Chandrudu, Musical Note, Morning Kiss పున్నమి చంద్రుడు.

Punnami Chandrudu, Musical Note, Morning Kiss పున్నమి చంద్రుడు.
punnami chandrudu తక్కువ శ్రద్ధతో, సులువుగా పెంచుకోగలిగిన అందమైన మొక్కల్లో మరొకటి పున్నమి చంద్రుడు. దీన్ని ‘‘మ్యూజికల్ నోట్’’ అనీ, ‘‘మార్నింగ్ కిస్’’ అనికూడా అంటారు. దీని శాస్త్రీయనామం క్లీరో డెండ్రమ్ ఇన్సిజమ్
పున్నమి చంద్రుడు 2 నుంచి 3 అడుగుల ఎత్తువరకు పెరగగల చిన్నపొద. పచ్చని ఆకులతో గుబురుగా పెరుగుతుంది. దీని ఆకులు రంపపు పళ్లవంటి అంచులతో ఉంటాయి. ఈ మొక్క ప్రత్యేకత అంతా దీని పూలు, మొగ్గలే. ఈ మొగ్గల సన్నని పొడవాటి కాడల చివర గుండ్రని బిళ్ళల్లాగా ‘‘మ్యూజికల్ నోట్’’ ఆకారంలో ఉండటం వల్ల దీనికా పేరు వచ్చింది. దీని పూలు అందంగా, తెల్లగా ఉండి గుత్తులుగా విరగబూస్తాయి. ఇవి రాత్రిపూట విచ్చుకుంటాయి. పున్నమి వెన్నెలను తలపించేలా రాత్రిపూట తెల్లని పూలు, మొగ్గలతో నిండి ఉండటవం వలన దీన్ని ‘‘పున్నమి చంద్రుడు’’ అంటారు. దీని కేసరాలు సన్నగా, పొడవుగా, ఎరుపురంగులో పూలలో నుంచి బయటకు వచ్చి అందంగా కనిపిస్తాయి.
ఏడాది పొడవునా....
పున్నమిచంద్రుడు తక్కువ శ్రద్ధతో పెరిగే మొక్క. పూర్తి సూర్యకాంతిలో పెరిగినా కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది కూడా. నీరు నిలవని సారవంతమైన మట్టి మిశ్రమంలో చక్కగా పెరుగుతుంది. తక్కువగా అయినా క్రమం తప్పకుండా నీరు పోయడం మంచిది. ఈ మొక్కను విడిగా నాటుకున్నా గుంపుగా నాటుకున్నా బోర్డరుగా పెంచుకున్నా, ఇతర రంగుపూల మొక్కలతో కలిపి పెంచుకున్నా చక్కగా ఉంటుంది. కుండీల్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. ఇది సంవత్సరం పొడవునా పూస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా అనిపించే తెల్లని మొగ్గలు, పూలవల్ల రాత్రిపూట ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎక్కువగా పూస్తుంది. కనుక నెలకోసారి ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువుని వేస్తూ ఉంటే చక్కగా పెరుగుతుంది. వేప, కానుగ, లేదా పొగాకు కషాయం వంటి కషాయాలను తరచుగా చల్లుతూ ఉంటే పిండి పురుగులు, రసం పీల్చేపురుగులు ఆశించకుండా ఉంటాయి. ఈ మొక్కను విత్తనాలు లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. ప్రత్యేకంగా కనిపించే మొక్కలు కోరుకునే వారికి ఇది కూడా ఒక చక్కని ఎంపిక.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...