header

Mysore Trumphet

పూలతోరణాల సోయగం మైసూర్‌ ట్రంపెట్‌

mysore trumphet పూలతోరణాల సోయగం మైసూర్‌ ట్రంపెట్‌ ఎక్కడ పెంచినా అందరి దృష్టినీ ఇట్టే కట్టిపడేసే అతికొద్ది మొక్కల జాబితాలో తప్పనిసరిగా ఉండదగ్గది మైసూర్‌ ట్రంపెట్‌. ఉష్ణప్రాంతానికి చెందిన ఈ మనోహరమైన లతకు నిజానికి రావలసినంత ప్రాచుర్యం దొరకలేదేమో!
లేడీస్‌ స్లిప్పర్‌, డాల్స్‌ షూస్‌, బ్రిక్‌ అండ్‌ బట్టర్‌...అనే పేర్లూ దీనివే. ఇది పసిడి, కుంకుమ వర్ణాల సమ్మిళితమైన పూల గుత్తులతో కనువిందు చేసే తీగ మొక్క. దీని శాస్త్రీయ నామం తంబర్జియా మైసూరెన్సిస్‌. మైసూర్‌ ట్రంపెట్‌ వేగంగా పెరిగే తీగ. సులువుగా పెంచుకోగలిగిన ఈ లత పూర్తి సూర్యకాంతిలో చక్కగా పెరిగినప్పటికీ కొద్దిపాటి నీడనూ తట్టుకుంటుంది.
ఇతర తంబర్జియా తీగల కన్నా దీని ఆకులు సన్నగా ఉంటాయి. ఈ మొక్కను పెంచేందుకు సారవంతమైన, నీరు నిలవని మట్టి మిశ్రమం కావాలి. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి. శీతాకాలంలో పూలవర్షం కురిసినట్లు విరబూసే ఈ తీగ మిగిలిన కాలమంతా పచ్చని ఆకులతో నిండి ఉంటుంది. దీన్ని పందిళ్లు, గోడలపైకి పాకించుకుంటే వాటి సందుల్లోంచి కిందకి వేలాడే పూల గుత్తులు తోరణాల్లాగ, ఏదో పండుగకో, వేడుకకో చేసిన పుష్పాలంకరణ లాగ అనిపిస్తాయి. పైగా, సీజన్‌లో ఈ పూలు విరబూసినప్పుడు పసుపు, కుంకుమల కలయికతో మెరిసిపోతూ శుభప్రదంగా పండుగ వాతావరణాన్ని తలపింపచేస్తాయి.
ఎరువులు తప్పనిసరి...
ఈ తీగకు పూలతో పాటు మకరందం కూడా బాగా ఎక్కువ. అందుకే ఎప్పుడూ బుజ్జిబుజ్జి పిట్టలు, తేనెటీగలు, సీతాకోకచిలుకలను బాగా ఆకర్షిస్తుంది. తగినన్ని పోషకాలు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి. నెలకోసారి పాలీఫీడ్‌ వంటి నేలలో కరిగే ఎరువును వేస్తూ ఉండాలి.
నేలలో వేరుసెనగపిండి, ఆముదం పిండీ వంటి సేంద్రియ ఎరువులు కలుపుతూ ఉండాలి. ఈ మొక్కకు చీడపీడలు పెద్దగా ఆశించవు గానీ రసం పీల్చే పురుగులు కొంత ఇబ్బంది పెట్టొచ్చు. క్రమం తప్పకుండా వేప, కానుగ కషాయాలను చల్లుకోవడమే పరిష్కారం. ఎక్కువగా పెరిగిన,
ఎండిపోయిన కొమ్మల్ని సంవత్సరానికోసారి కత్తిరిస్తుంటే చక్కగా కనిపిస్తుంది. దీని పూలు గుత్తిలో పై నుంచి కిందకి వికసిస్తూ వస్తాయి. ఎక్కువ రోజులు నిలిచి ఉంటాయి కూడా. దీన్ని విత్తనాల ద్వారా కానీ, కొమ్మ కత్తిరింపుల ద్వారాగానీ సులువుగానే ప్రవర్థనం చేయవచ్చు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....