header

Nalleru…నల్లేరును పెంచడం సులువే!

Nalleru…నల్లేరును పెంచడం సులువే!

పసిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకూ ఎముకల పటుత్వానికైనా, వాటికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలోనైనా అగ్రతాంబూలం నల్లేరుకే ఇవ్వాలి. నల్లేరును ‘అస్థి సంహార’, ‘వజ్రవల్లి’ అని అంటారు. ఈ రెండు పేర్లూ ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో నల్లేరు పాత్రను వ్యక్తపరిచేవే. ఇది మనదేశానికి చెందిన మొక్కే. దీని శాస్త్రీయ నామం సిస్సస్ క్వాడ్రాంగ్యులారిస్. నల్లేరు ద్రాక్ష కుటుంబానికి చెందిన బహువార్షికం. దీన్ని అడమెంట్ ప్లాంట్ అని కూడా అంటారు. నాలుగు పలకలుగా ఉండే కాండంతో, కణుపులుగా ఉండి, వేగంగా పెరిగే తీగజాతి మొక్క. ఇది దాదాపు రెండు మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. కణుపుల మధ్య దూరం దాదాపు 3-5 అంగుళాలు ఉంటుంది.
గుత్తులుగా పూలూ...
ప్రతి కణుపు దగ్గర ఒకవైపు మూడుగా చీలిన వెడల్పాటి ఆకూ, రెండోవైపు సన్నని నులితీగ ఉంటాయి. ఈ నులితీగల సాయంతోనే నల్లేరు ఆధారాన్ని పట్టుకుని ఎగబాకుతుంది. దీని పూలు తెలుపూ/ లేత పసుపు/ లేతాకుపచ్చ రంగులో చిన్నచిన్న గుత్తుల్లో పూస్తాయి. గుత్తుల్లో కాసే గుండ్రని చిన్న చిన్న కాయలు పండినప్పుడు ఎర్రగా అందంగా ఉంటాయి. నల్లేరు ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది. మరీ వెలుతురు అస్సలు రాని చోట తప్ప ఎక్కడైనా పెంచుకోవచ్చు. నీళ్లు రోజూ పోయాల్సిన పనిలేదు. చీడపీడల భయంలేదు. అలాగే పెద్దగా ఎరువుల అవసరం కూడా లేదు. మట్టి మిశ్రమంలో కొంచెం కంపోస్టు లేదా పశువుల ఎరువు కలిపితే సరిపోతుంది.
కూరగాయగానూ...
నల్లేరు తరతరాలుగా ఔషధ మొక్కగా ప్రాచుర్యంలో ఉంది. ఎముకలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో, విరిగిన ఎముకలు అతికేలా చేయడంలో నల్లేరుకు సాటి వేరే లేదు. ఎముకలు అతకడానికే కాకుండా కండరాలు దెబ్బతిన్నా, లిగమెంట్లు విరిగిపోయినా కూడా నల్లేరు అద్భుతంగా పనిచేస్తుంది. బరువును తగ్గించడంలో కూడా నల్లేరు పాత్ర చెప్పుకోదగ్గదే. ఎముకలూ, కండరాల సమస్యలను త్వరితంగా పరిష్కరించడమే కాకుండా ఆ సమయంలో ఉండే నొప్పుల్నీ, వాపల్నీ ఈ మొక్క తగ్గిస్తుందట. అలాగే స్త్రీలకు సంబంధించిన వ్యాధుల నివారణలో కూడా నల్లేరు చాలా మంచి ఔషధమట.
ఈ మొక్క వాడకం చాలా సులువు. చక్కగా కూరగాయలా దీన్ని వాడుకోవచ్చు. దీంతో రోటి పచ్చడి చేసుకోవచ్చు. కూర వండుకోవచ్చు. బజ్జీలు వేసుకోవచ్చు. ఇలా మరెన్నో సొంతంగా మీరూ ప్రయత్నించవచ్చు. నల్లేరు తరచూ వాడుతుంటే ఎముకల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయట. ఇది పైల్స్ను తగ్గిస్తుందట. అల్సర్, ఉబ్బసాన్ని అదుపులో ఉంచుతుందట. రక్తహీనతను కూడా అరికడుతుందట. నల్లేరు కొమ్మను కోసి దాంతో తుడిస్తే తుప్పు మరకలు పోతాయట. ఈ మొక్కను కణుపులను నాటుకుని సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. చూడటానికి చక్కగా ఉండి, అద్భుతమైన ఔషధ లక్షణాలున్నాయి. కూరగాయగానూ వాడుకోవచ్చు. ఇంటి శుభ్రతకు పనికొస్తుంది